కిచ్చా సుదీప్ కథానాయకుడిగా 'మార్క్' సినిమా రూపొందింది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాది డిసెంబర్ 25వ తేదీన కన్నడలో విడుదలైంది. జనవరి 1వ తేదీన తెలుగు వెర్షన్ ను కూడా రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
 
అజయ్ మార్కండేయ (సుదీప్) ఎస్పీగా పనిచేస్తూ ఉంటాడు. అందరూ అతనిని 'మార్క్' అని పిలుస్తుంటారు. ప్రస్తుతం అతను కొన్ని కారణాల వలన సస్పెన్షన్ లో ఉంటాడు. అతనంటే డిపార్టుమెంటులోని అవినీతి అధికారులకు .. రాజకీయనాయకులకు .. రౌడీలకు భయమే. తన కళ్లముందు అన్యాయాలు .. అక్రమాలు జరుగుతూ ఉంటే, తాను సస్పెన్షన్ లో ఉన్నానని చూస్తూ ఊర్కొనే రకం కాదు అతను. అలాంటి అతను మళ్లీ రంగంలోకి దిగడానికి కారణం, ఆదికేశవన్ ( షైన్ టామ్ చాకో) భద్ర ( నవీన్ చంద్ర) స్టీఫెన్ ( గురు సోమసుందరం).

ఆదికేశవన్ తల్లి లోకనాయకి ముఖ్యమంత్రిగా ఉంటుంది. హాస్పిటల్లో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉండగా, ఆమె వారసుడిగా ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకోవాలని ఆదికేశవన్ ప్లాన్ చేస్తాడు. ఈ విషయంలో అతను తల్లిని బెదిరించడాన్ని ఒక డాక్టర్ వీడియో తీస్తాడు. ఆ వీడియోను సంపాదించి తనకి ఇవ్వమని మాజీ ముఖ్యమంత్రి వీరేంద్ర సింహా, మార్క్ ను కోరతాడు. ఆ వీడియోను సంపాదించడానికి మార్క్ బయల్దేరతాడు. 

'భద్ర'పై గ్యాంగ్ స్టర్ గా అనేక కేసులు ఉంటాయి. వాటి నుంచి బయటపడటం కోసం అతను తన తమ్ముడైన 'రుద్ర'వివాహాన్ని మినిస్టర్ కూతురుతో జరిపించాలని అనుకుంటాడు. కానీ రుద్ర .. తాను ప్రేమించిన 'రుక్మిణి' అనే అమ్మాయితో పారిపోతాడు. ఆమెతో 'అమెరికా' వెళ్లిపోవాలనుకున్న అతను, డాలర్స్ కోసం 18 పిల్లలను అక్రమంగా తరలించే పనికి ఒప్పుకుంటాడు. ఒక సీక్రెట్ ప్లేస్ లో వాళ్లని దాచిపెడతాడు. ఇక తనకి సంబంధించిన 2 వేల కోట్ల ఖరీదు చేసే డ్రగ్స్ ను పోలీసుల నుంచి విడిపించుకుని వెళ్లడానికి 'స్టీఫెన్' బరిలోకి దిగుతాడు. ఈ ముగ్గురినీ మార్క్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే కథ. 
  
 సుదీప్ కి కన్నడలో మంచి క్రేజ్ ఉంది. తెలుగు .. తమిళ భాషలకు సంబంధించిన ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలను బాగానే చూస్తుంటారు. సుదీప్ స్టైల్ .. ఆయన మార్క్ తెలిసినవారికి ఆయన సినిమాలు ఎలా ఉంటాయనేది ఒక ఐడియా ఉంటుంది. అలాంటి మార్క్ లో ఆయన చేసిన మరో సినిమానే ఇది. రొమాన్స్ వైపు వెళ్లకుండా ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ నేపథ్యంలో ఆయన చేసిన సినిమా ఇది. 

సాధారణంగా చాలా సినిమాలలో .. తెరపైకి ముందుగా ఓ పెద్ద సమస్య వస్తుంది. ఈ సమస్యను ఒకే ఒక్కరు మాత్రమే పరిష్కరించగలరు అనే డైలాగ్ తరువాత హీరో ఎంట్రీ ఇస్తాడు. అయితే ఈ కథ విషయానికి వచ్చేసరికి తెరపైకి మూడు సమస్యలు వస్తాయి. ముఖ్యమంత్రి స్థాయి సమస్య ఒకటైతే, వేల కోట్ల ఖరీదు చేసే డ్రగ్స్ .. 18 మంది పిల్లల కిడ్నాప్ మిగతా రెండు సమస్యలు. ఈ మూడు సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత హీరోపై పడుతుంది. అతను సస్పెన్షన్ లో ఉండటం ఆడియన్స్ కి గల అదనపు టెన్షన్.

మాస్ హీరో .. మాస్ ఫైట్ తోనో .. మాస్ సాంగ్ తోనే ఎంట్రీ ఇచ్చినప్పుడే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. అందుకే దర్శకుడు ఈ రెండూ కలిపి హీరో ఇంట్రడక్షన్ డిజైన్ చేశాడు. ఇక ఇక్కడి నుంచి హీరో తన మార్క్ చూపించడం షురూ చేస్తాడు. అయితే దర్శకుడు ఎక్కువ సమస్యలు తీసుకొచ్చి హీరో తలపై పెట్టడంతో, ఆయన నానా అవస్థలు పడుతుంటాడు .. ఆడియన్స్ కూడా అంతే ఇబ్బంది పడుతుంటారు. విలన్ స్థాయి మనుషులు నాలుగు వైపుల నుంచి నలుగురు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.

ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి .. మాజీ ముఖ్యమంత్రి .. ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్న వారసుడు .. ఇక్కడే విషయం హెవీ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక విలన్ వర్గాలు ఎక్కువై ఆడియన్స్ అవస్థలు పడుతుంటే, డ్యూటీలో ఉన్న పోలీసులు .. సస్పెన్షన్ లో ఉన్న పోలీసులు అంటూ అటు వైపు నుంచి మరో గందరగోళం. లెక్కకి మించిన పాత్రల విషయంలో కూడా ఈ సినిమా తన మార్క్ చూపించిందని అనిపిస్తుంది.

దర్శకుడు ఏదైనా ఒక బలమైన సమస్యను తీసుకుని, ఆ సమస్య చుట్టూ కథ అల్లుకుంటే బాగుండేది. అలా కాకుండా కథను విస్తృతమైన స్థాయిలో పెంచుతూ వెళ్లి, ఎక్కువ పాత్రలతో నింపేయడం వలన .. సన్నివేశాలు తరుముతూ వెళ్లవలసి వచ్చింది. ఈ మధ్యలో ఆడియన్స్ ఆశించే వినోదం పాళ్లకు అవకాశం లేకుండా పోయింది. ప్రధానమైన పాత్రలు ఎక్కువై పోవడం వలన, వాటి మధ్య గ్యాప్ కూడా వచ్చేసింది. 

సుదీప్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. తన ఫాలోయింగ్ కి తగినట్టుగా .. తన ఫ్యాన్స్ ఆశించినట్టుగానే తెరపై ఆయన కనిపించారు.  అలాగే షైన్ టామ్ చాకో .. నవీన్ చంద్ర కూడా తమ పాత్రలతో సందడి చేశారు. శేఖర్ చంద్ర ఫొటోగ్రఫీ .. అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం .. గణేశ్ బాబు ఎడిటింగ్ ఫరవాలేదు అనిపిస్తాయి.

నిర్మాణ విలువలకు వంక బెట్టవలసిన పనిలేదు. మొదటి నుంచి చివరివరకూ సుదీప్ తన మార్క్ అయితే చూపించాడు. అక్కడక్కడా యాక్షన్ ఎపిసోడ్స్ .. పిల్లలకు సంబంధించిన ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. ఎటొచ్చి సమస్యలు .. విలన్లు .. పాత్రలు ఎక్కువైపోవడమే కాస్త అసహనాన్ని కలిగిస్తుంది .. అంతే!