శర్వానంద్ కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'నారీ నారీ నడుమ మురారీ'. అనిల్ సుంకర - రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. గతంలో 'సామజవరగమన' సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందించిన కారణంగా, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి రేసులో దిగిన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం.
కథ: గౌతమ్ (శర్వానంద్) హైదరాబాద్ లో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన గౌతమ్, తండ్రి కార్తీక్ (నరేశ్) దగ్గర పెరుగుతాడు. లేటు వయసులో 'పల్లవి' అనే యువతిని కార్తీక్ ఇష్టపడుతున్నాడని తెలిసి, ఆ అమ్మాయిని పెళ్లి పీటలపై నుంచి తీసుకొచ్చి మరీ వాళ్ల పెళ్లి జరిపిస్తాడు గౌతమ్. ఇక కొడుకు కూడా ఒక ఇంటివాడైతే బాగుంటుందని కార్తీక్ భావిస్తాడు. అలాంటి పరిస్థితులలోనే గౌతమ్ కి నిత్య (సాక్షి వైద్య) తారస పడుతుంది.
సిటీలో పెద్ద వకీల్ గా పేరున్న రామలింగం (సంపత్ రాజ్) కూతురే నిత్య. తల్లి లేని పిల్ల కావడంతో నిత్యను ఆయన గారంగా పెంచుతాడు. ప్రేమ పేరుతో తన కూతురు ఎక్కడ తప్పటడుగు వేస్తుందోనని అతను టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే తాను గౌతమ్ తో ప్రేమలో పడినట్టుగా తండ్రితో చెబుతుంది నిత్య. గౌతమ్ పద్ధతి .. అతని తండ్రి కార్తీక్ రెండో పెళ్లి వ్యవహారం నచ్చకపోయినా, కూతురు కోసం రామలింగం ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో జరగాలనే షరతు మాత్రం పెడతాడు.
ఈ షరతు కారణంగా గౌతమ్ చిక్కుల్లో పడతాడు. గతంలో 'దియా' ( సంయుక్త మీనన్)తో తన పెళ్లి జరిగింది అక్కడే. ఆ విషయం తెలిసిన ఆఫీసర్ సత్యమూర్తి (సునీల్) ఇంకా అక్కడే పనిచేస్తూ ఉంటాడు. ఆ సీక్రెట్ బయటపెట్టొద్దని, అతనిని కూల్ చేయడానికి గౌతమ్ ట్రై చేస్తాడు. 'దియా ' నుంచి విడాకులు తెస్తేనే నిత్యతో అతని పెళ్లి జరుగుతుందని సత్యమూర్తి తేల్చి చెబుతాడు. దియాతో గౌతమ్ కి ఉన్న గొడవేంటి? ఆ రహస్యాన్ని నిత్య దగ్గర దాచడానికి అతను పడిన పాట్లు ఎలాంటివి? అనేది కథ.
విశ్లేషణ: లేటు వయసులో మళ్లీ పెళ్లి అనేది ఒక ప్రమోషన్ లాంటిదని భావించే ఒక తండ్రి. అలాంటి తండ్రి పెళ్లిని ధైర్యంగా చేసేసి, తన పెళ్లి విషయంలో నానా తంటాలు పడే ఒక కొడుకు. కూతురు కోసం ఆమె ప్రేమించినవాడితో పెళ్లికి ఒప్పుకుని, అవకాశం దొరికితే చాలు వాళ్లని విడదీయాలని చూసే ఒక వకీలు. అతనిని ధైర్యంగా ఎదుర్కుందామని అనుకున్న హీరోని వెనక్కిలాగే ఒక ఫ్లాష్ బ్యాక్ .. ప్రధానంగా దర్శకుడు అల్లుకున్న కథ ఇది.
ప్రధానమైన కథ ఈ నాలుగు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. దర్శకుడు ఈ నాలుగు పాత్రలను డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. ఇక ఈ నాలుగు పాత్రలతో ముడిపెడుతూ సునీల్ .. వెన్నెల కిశోర్ .. సత్య పాత్రలను నడిపించిన విధానం నవ్వులు పూయిస్తుంది. ప్రేమికులకు సాయపడాలనే బలమైన సంకల్పం కలిగినవాడిగా సత్య .. గురువు పాదాలను అభిషేకించాలని పాల ప్యాకెట్టు పట్టుకుని తిరిగే వెన్నెల కిశోర్ పాత్ర సందడి చేస్తాయి.
ఇంట్రడక్షన్ సీన్ తోనే ఈ కథ ఆడియన్స్ ను తనలోకి లాగేసుకుంటుంది. ఆ తరువాత నుంచి సరదాగా నవ్విస్తూ ముందుకు సాగుతుంది. 'దియా' పాత్ర ఎంట్రీ తరువాత ఈ కథ మరింత రసవత్తరంగా సాగుతుందేమోనని అనిపిస్తుంది. కానీ నిజానికి ఇక్కడ కాస్త స్లో అయింది. ఆ తరువాత నిదానంగా మళ్లీ ట్రాక్ లో పడింది. 'దియా' పాత్రలో సంయుక్త సెట్ కాలేదని అనిపిస్తుంది.
పనితీరు: దర్శకుడి ఆలోచనా విధానం .. కొత్తదనం ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి. ఒక వైపున తండ్రి రెండో పెళ్లి .. మరో వైపున కొడుకు రెండో పెళ్లి మధ్యలో కన్ఫ్యూజన్ కామెడీ డ్రామాను వర్కౌట్ చేయడం బాగుంది. అలాగే సత్య .. వెన్నెల కిశోర్ పాత్రల బలహీనతలను హైలైట్ చేసిన తీరు థియేటర్లో నవ్వులు పండిస్తుంది.
జ్ఞాన శేఖర్ - యువరాజ్ ఫొటోగ్రఫీ బాగుంది. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. బాణీలు మాత్రం పెద్దగా మనసుకు పట్టుకోవు. చివర్లో శర్వానంద్ తాగేసి పాడే పాట మరిన్ని తక్కువ మార్కులను సంపాదించుకుంటుంది. ఎడిటింగ్ కూడా ఓకే.
ముగింపు: ఒక హీరో .. ఇద్దరు హీరోయిన్ల చుట్టూ మాత్రమే కాదు, ఇది తండ్రీ కొడుకుల చుట్టూ తిరిగే ఓ తమాషా కథ కూడా. శర్వానంద్ తో పాటు నరేశ్ ను కూడా మరో హీరో అనిపించేలా ఆ పాత్ర సందడి చేస్తుంది. ఈ కథ విలేజ్ నేపథ్యంలో నడవకపోయినా, సంక్రాంతి రోజులలో కోరుకునే సందడిని సరదాగా అందించే సినిమానే అని చెప్పచ్చు.
'నారీ నారీ నడుమ మురారీ' - మూవీ రివ్యూ!
Nari Nari Naduma Murari Review
- శర్వానంద్ నుంచి వచ్చిన పండుగ సినిమా
- తండ్రీకొడుకుల ట్రాక్ హైలైట్
- హాయిగా నవ్వించే సత్య - వెన్నెల కిశోర్
- అంతగా మనసుకి పట్టుకోని బాణీలు
- అలరించే సంభాషణలు
Movie Details
Movie Name: Nari Nari Naduma Murari
Release Date: 2026-01-14
Cast: Sharwanand, Sakshi Vaidya, Samyutha Menon, Sampath Raj, Sunil, Vennela Kishore, Sathya
Director: Ram Abbaraju
Music: Vishal Chandrashekhar
Banner: AK Entertainments
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer