చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'మన శంకర వరప్రసాద్ గారు'. ఇంతవరకూ వరుస హిట్స్ ఇస్తూ వచ్చిన అనిల్ రావిపూడి నుంచి ఈ సినిమా రూపొందడం .. వెంకటేశ్ గెస్ట్ రోల్ చేయడం .. చిరంజీవి - నయనతార రొమాన్స్ ను టచ్ చేస్తూ సాగే 'మీసాల పిల్ల' సాంగ్ పాప్యులర్ కావడం ఈ సినిమాపై అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో సందడి చేసిందనేది చూద్దాం.

కథ: శంకర వరప్రసాద్ (చిరంజీవి) నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య శశిరేఖ (నయనతార) పెద్ద బిజినెస్ విమెన్. తండ్రి జీవీఆర్ (సచిన్ ఖేడ్కర్)కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలను ఆమె చక్కబెడుతూ ఉంటుంది. ప్రసాద్ - శశిరేఖకి విడాకులు జరిగిపోయి 10 ఏళ్లు అవుతుంటుంది. పిల్లలను కూడా తన కంటపడకుండా చేయడం పట్ల ప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. తండ్రి పట్ల పిల్లలకి సదాభిప్రాయం లేకుండా చేసిందని తెలుసుకుంటాడు. 

ప్రసాద్ తన పిల్లలు నిక్కీ .. విక్కీ చదువుకునే స్కూల్ కి  'పీటీ' సార్ గా వెళతాడు. వాళ్లకి దగ్గర కావాలనేదే అతని ప్రధానమైన ఉద్దేశం. చాలా తక్కువ సమయంలోనే వాళ్లకి చేరువైన ప్రసాద్, అలాంటి తండ్రి తమకి ఉంటే బాగుంటుందని అనిపించగలుగుతాడు. పిల్లల కోసమైనా శశిరేఖకి మళ్లీ దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. పీటీ  సార్ గా తన ప్లాన్ కి శశిరేఖ తెరదించడంతో, జీవీఆర్ కి సెక్యూరిటీ ఆఫీసర్ గా ప్రసాద్ తన టీమ్ తో ఆ ఇంట్లోకి అడుగుపెట్టవలసి వస్తుంది.

ఇదే సమయంలో జైలు నుంచి వీరేంద్ర పాండా (సుదేవ్ నాయర్) విడుదలవుతాడు. తాను సస్పెన్షన్ వేటుపడిన పోలీస్ ఆఫీసర్. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన క్రిమినల్. అతను శశిరేఖను .. ఆమె పిల్లలను అంతం చేయడానికి రంగంలోకి దిగుతాడు. ప్రసాద్ - శశిరేఖ ఎందుకు విడిపోతారు? ఆమెకి దగ్గర కావడానికి ప్రసాద్ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? శశిరేఖపై వీరేంద్ర పాండా పగబట్టడానికి కారణం ఏమిటి? అతని బారి నుంచి తన ఫ్యామిలీని ప్రసాద్ ఎలా రక్షించుకుంటాడు? ఈ తతంగంలో వెంకీ గౌడ (వెంకటేశ్) పాత్ర ప్రయోజనం ఏమిటి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: అనిల్ రావిపూడి ఇంతవరకూ చేసినా సినిమాలను ఒక సారి పరిశీలన చేస్తే, బలమైన కథ .. బరువైన సన్నివేశాలు .. కళ్లను తడిచేసే ఎమోషన్స్ ఎక్కడా కనిపించవు. ఆయన సినిమాలో ప్రధానంగా కనిపించేది వినోదం మాత్రమే. కథ పెద్దగా లేదనే విషయంగానీ .. కథలో కొత్తదనం లేదని గాని తెలియకుండా ప్రేక్షకులను నాన్ స్టాప్ గా ఎంటర్ టైన్ చేస్తూ వెళుతూ ఉంటాడు. తేలికపాటి కామెడీతో ఆడియన్స్ ను అలరించడం ఆయన బలంగా కనిపిస్తుంది. 

ఈ సినిమా విషయంలోను అనిల్ రావిపూడి అదే పద్ధతిని అనుసరించడం మనకి కనిపిస్తుంది. యాక్షన్ - ఎమోషన్స్ తో కూడిన భారీ కథలను చేస్తూ వెళుతున్న చిరంజీవిని ఆయన తన మార్క్ కామెడీ ట్రాకులోకి లాగాడు. కామెడీని పండించడంలో చిరంజీవికంటూ ఒక స్టైల్ ఉంది.  ఆ స్టైల్ ను అలాగే ఆవిష్కరించాడు. ఇక వెంకటేశ్ తో తనకి గల మూడు హిట్ల పరిచయాన్ని ఉపయోగించుకుని ఈ సినిమాలో 'వెంకీ గౌడ'గా రంగంలోకి దింపేసి సందడి చేయించాడు. 

ఒక నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫీసర్ గా .. ఒక భర్తగా .. ఒక తండ్రిగా మూడు వైపుల నుంచి చిరంజీవి పాత్రను ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. చిరంజీవి - నయన్ పెళ్లిళ్లలో కలుసుకోవడం .. ఇల్లరికం అల్లుడిగా ప్రసాద్ ఇక్కట్లు .. 'నన్ను దత్తత తీసుకోండి' అంటూ ప్రసాద్ వెంట బుల్లిరాజు (సుగుణేశ్) పడే ఎపిసోడ్ .. ఫస్టాఫ్ ను సరదాగా నడిపిస్తాయి. మామపై ప్రసాద్  రివేంజ్ .. వెంకీ గౌడతో కలిసి చేసే సందడి సెకండాఫ్ ను పరిగెత్తిస్తాయి. ఇక సుదేవ్ నాయర్ విలనిజం ఓకే కానీ, మెగాస్టార్ తో తలపడేంత విలనిజం పడలేదని అనిపిస్తుంది.               

పనితీరు: కొన్ని కారణాల వలన భార్య నుంచి విడిపోయిన ఒక భర్త, తన పిల్లల కోసం తిరిగి ఆమెకి చేరువ కావడానికి చేసిన ప్రయత్నమే ఈ సినిమా. కథగా చూసుకుంటే ఇంతేనా? అనిపిస్తుంది. కానీ అలా అనిపించకుండా .. బోర్ కొట్టకుండా అనిల్ రావిపూడి ఈ సినిమాను నడిపించాడు. తేలికపాటి కామెడీతో సరదాగా నవ్విస్తూ సందడి చేయించాడు. 

ముఖ్యంగా చిరంజీవిని హాఫ్ హ్యాండ్ షర్ట్స్ లో యంగ్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. 1990లలో చిరంజీవిని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక చిరంజీవి పాటకి వెంకీతో .. వెంకీ పాటలకు చిరంజీవితో స్టెప్పులు వేయించడం వంటి ప్రయోగాలతో ఆడిటోరియాన్ని హుషారెత్తించాడు.  పబ్ లో లేడీస్ కి ప్రసాద్ క్లాస్ పీకే సీన్ వన్స్ మోర్ అనిపిస్తుంది. తొలి రోజుల్లో చిరంజీవి - నయన్ ఎక్కడ తారసపడినా, 'దళపతి' సినిమాలోని 'సుందరీ నువ్వే నేనంట' పాట ప్లే చేయడం గొప్పగా వర్కౌట్ అయింది.    

సమీర్ రెడ్డి కెమెరా పనితనం చాలా బాగుంది. 'శశిరేఖ' పాటలో చిరంజీవిని యంగ్ గా .. చాలా స్టైలీష్ గా చూపించారు. భీమ్స్ బాణీలు కూడా వెంటనే కనెక్ట్ అవుతాయి. తమ్మిరాజు ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది. అనవసరమైన సన్నివేశాలు ఎక్కడా  కనిపించవు. 'భర్త వెధవైతే వదిలించుకోండి .. కానీ వదిలించుకోవడం కోసమని వెధవని చెయ్యొద్దు' అనే డైలాగ్ సినిమా  మొత్తానికి హైలైట్. చిరంజీవి .. నయనతార .. వెంకటేశ్ ..  అందరూ తమ  పాత్రలలో మెప్పించారు. 

ముగింపు: ఇది బలమైన .. బరువైన కథ కాదు. కామెడీ  ప్రధానంగా సరదాగా సందడి చేసే కంటెంట్. సంక్రాంతికి ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయనే చెప్పాలి.