'ఛాంపియన్' .. రోషన్ - అనశ్వర రాజన్ జంటగా నటించిన సినిమా. 'పెళ్లి సందడి' హిట్ తరువాత రోషన్ చేసిన సినిమా కావడంతో, ఈ ప్రాజెక్టుపై యూత్ లో ఆసక్తి ఏర్పడింది. ఇక మలయాళంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనశ్వర రాజన్ ఈ ప్రాజెక్టులోకి వచ్చిన దగ్గర నుంచి మరింత హైప్ వచ్చింది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది.

కథ: దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడానికి ఖాసీం రజ్వి ఒప్పుకోడు. హింస ద్వారా తాను అనుకున్నది సాధించడం కోసం, నిజామ్ నిరంకుశ ప్రభుత్వం రజాకార్లను రంగంలోకి దింపుతుంది. రజాకార్ల ఆగడాలకు అనేక గ్రామాలు భయంతో వణికిపోతూ ఉంటాయి. అయితే 'బైరాన్ పల్లి' వంటి కొన్ని గ్రామాలకు చెందిన ప్రజలు మాత్రం ధైర్యంగా పోరాడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులలోనే తన స్నేహితుడు షబ్బీర్ తో కలిసి మైఖేల్ సి.విలియమ్స్ (రోషన్) ఆ గ్రామానికి వస్తాడు. 

మైఖేల్ మంచి 'ఫుట్ బాల్' ప్లేయర్. తన ప్రతిభ కారణంగా ఇంగ్లండ్ మాంచెస్టర్ ఫుట్ బాల్ క్లబ్ లో ఆడే అవకాశాన్ని సంపాదించుకుంటాడు. అయితే అక్కడికి వెళ్లే అవకాశాన్ని సంపాదించుకోవడం కోసం అతను అక్రమంగా ఆయుధాలను రవాణా చేయవలసి వస్తుంది. ఆ క్రమంలో అతను పట్వారి రంగారావు (హర్షవర్ధన్) మనుషులకు పట్టుబడబోయి తప్పించుకుంటాడు. ఆ 'గడీ'లో బందీగా ఉన్న 'బైరాన్ పల్లి' యువకుడు భిక్షపతి విడుదలకు కారకుడు అవుతాడు. అతని సూచన మేరకే ఆ  గ్రామానికి వెళతాడు. 

బైరాన్ పల్లికి పెద్దగా రాజారెడ్డి (కల్యాణ్ చక్రవర్తి) ఉంటాడు. ఆయన మాటపైనే ఆ గ్రామస్తులు నడుస్తూ ఉంటారు. రజాకార్లు ఆ ఊరును టార్గెట్ చేశారనే విషయం మైఖేల్ కి అర్థమవుతుంది. యుద్ధం అంటే ఎంతమాత్రం ఇష్టం ఉండని అతను, సాధ్యమైనంత త్వరగా అక్కడ నుంచి బయటపడాలని అనుకుంటాడు. అయితే తన కోసం వెదుకుతున్న పోలీసుల కంట పడకుండా కొన్ని రోజుల పాటు ఆ గ్రామంలోనే తలదాచుకోవడం మంచిదనే నిర్ణయానికి వస్తాడు. 

నాటకాలు ఆడుతూ తన తండ్రితో కలిసి అదే గ్రామంలో చంద్రకళ (అనశ్వర రాజన్) నివసిస్తూ ఉంటుంది. చంద్రకళతో మైఖేల్ పరిచయం ప్రేమగా మారుతుంది. అలాంటి పరిస్థితులలోనే ఆ గ్రామంపై రజాకార్లు విరుచుకు పడతారు. యుద్ధం అంటే ఇష్టం లేని మైఖేల్ ఏం చేస్తాడు? అసలు అతనికి యుద్ధం పట్ల విరక్తి కలగడానికి కారణం ఏమిటి? తన ఆశయం కోసం ప్రేమను వదిలేస్తాడా? ప్రేమ కోసం తన మనసు మార్చుకుంటాడా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: చాలా గ్యాప్ తరువాత రోషన్ చేసిన సినిమా. మలయాళంలో మంచి పేరున్న అనశ్వర రాజన్ తెలుగులో చేసిన తొలి సినిమా. రజాకార్ల కాలంలో నడిచిన ఒక ప్రేమ కథ ఇది. ఈ మూడు ప్రధానమైన అంశాలే ఈ సినిమా పట్ల ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి. విలేజ్ నేపథ్యంలో .. రజాకార్ల కాలంలో నడిచే ప్రేమకథగా ప్రేక్షకులు ఈ సినిమాను గురించిన ఒక అంచనాకు వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటివారికి కాస్త నిరాశను కలిగించే కథనే ఇది. 

 యుద్ధం అంటే ఇష్టం లేని హీరో యుద్ధం చేయవలసిన స్థానంలో నిలబడతాడు. తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలంటే తాను ప్రేమించిన అమ్మాయినీ .. ఆపదలో తనకి ఆశ్రయమిచ్చిన ఊరును వదిలేసి వెళ్లిపోవాలి. రజాకార్ల కారణంగా ప్రమాదం పొంచి ఉన్న ఆ ఊరును అలా వదిలేసి అతను వెళ్లిపోతాడా? తాను ప్రేమించిన అమ్మాయి కోసం నిలబడి పోరాడతాడా? అనే కుతూహలాన్ని రేకెత్తించేలా దర్శకుడు ఈ కథను తయారు చేసుకున్న తీరు బాగుంది. కానీ ఆ స్థాయి ఆవిష్కరణ జరగలేదేమోనని అనిపిస్తుంది. 

 హీరో ఇంట్రడక్షన్ .. ఆ తరువాత వెంటవెంటనే పడే సీన్స్ అంత పట్టుగా లేకపోవడం కాస్త అసహనాన్ని కలిగిస్తుంది. హీరోయిన్ ను హీరో కలుసుకునే సందర్భం తెరపైకి రావడానికి చాలా  సమయం పట్టడం .. ఈ మధ్యలోని సన్నివేశాలు కూడా అంత ఎఫెక్టివ్ గా లేకపోవడం ఇబ్బంది పెడుతుంది. అసలు అంశం దగ్గరికి ఆడియన్స్ ను తీసుకుని వెళ్లడానికి గాను చాలా నిడివిని పణంగా పెట్టడం నిరాశను కలిగిస్తుంది.     

 పనితీరు: తెలంగాణ నేపథ్యం .. రజాకార్ల కాలం .. ఆ రోజుల్లో జరిగిన బలిదానాలకు సంబంధించిన కథలు గతంలో వచ్చాయి. ఆ నేపథ్యంలో సాగే ఒక అందమైన ప్రేమకథను చూడొచ్చనే ప్రేక్షకులు అనుకుంటారు. కానీ ఆ ప్రేమకథకు తక్కువ సమయాన్ని కేటాయించడం పేక్షకులకు అసంతృప్తిని కలిగిస్తుందని చెప్పచ్చు. 

రోషన్ .. అనశ్వర రాజన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కల్యాణ్ చక్రవర్తి - అర్చన పాత్రలు నేపథ్యానికి బలాన్ని పెంచాయి. నిర్మాణ పరమైన విలువలు బాగున్నాయి. మిక్కి జే మేయర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఆయన స్వరపరిచిన బాణీలలో 'గిర గిరా .. ' .. 'సల్లంగుండాలే .. ' పాటలు మనసుకు పట్టుకుంటాయి. మథి ఫొటోగ్రఫీ .. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగున్నాయి. 

ముగింపు: తెలంగాణ నేపథ్యం .. రజాకార్ల కాలంలో ఫుట్ బాల్ ఆట అనేది ఒక ఇమడని అంశంగా అనిపిస్తుంది. అలాగే ఆ కాలంలో నడిచే ఈ కథకి 'ఛాంపియన్' అనే టైటిల్ కూడా సెట్ కాలేదేమో అనే భావన కలుగుతుంది. రజాకార్ల నేపథ్యంతో పాటు ప్రేమకథను కూడా అంతే బలంగా చూపించి ఉంటే ఈ కంటెంట్ మరింత బలంగా కనెక్ట్ అయ్యుండేదేమో అనే ఆలోచన రాకుండా ఉండదు.