గత కొంతకాలంగా సరైన కమర్షియల్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్న కథానాయకుడు ఆది సాయికుమార్‌ ఈసారి తన జోనర్‌ను మార్చుకుని పీరియాడికల్‌ మిస్టిక్‌ థ్రిల్లర్‌తో 'శంబాల'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ట్రైలర్‌తో, ప్రచార చిత్రాలతో కొంత బజ్‌ను క్రియేట్‌ చేసిన ఈ చిత్రం  ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఆది సాయికుమార్‌ హిట్‌ పడిందా? లేదా సమీక్షలో తెలుసుకుందాం. 

కథ: 1980వ సంవత్సరంలో 'శంబాల' అనే ఊరిలో జరిగే పీరియాడికల్‌ కథ ఇది. ఆకాశం నుంచి ఓ ఉల్క ఆ ఊరిలో పడుతుంది. అప్పట్నుంచీ ఆ ఊరిలో అనుకోని సంఘటనలు, ఆనర్థాలు జరుగుతున్నాయనేది ఆ ఊరి ప్రజల నమ్మకం. అందుకే తగ్గట్టుగానే ఊరిలో కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉన్నట్టుండి ఊరిలో ఎవరో ఒకరూ ఏదో అవహించినట్లుగా ఊరిలో ప్రజలను హత్యలు చేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. ఇదంతా ఆ బండబూతం (ఉల్క) వల్లే జరుగుతుందని భయపడుతుంటారు. 

ఇలాంటి పరిస్థితుల్లో దేవుడి మీద నమ్మకం లేని, సైన్స్‌ను నమ్మే జియాలజిస్ట్‌ శాస్త్రవేత్త,  విక్రమ్‌ '(ఆది సాయికుమార్‌)ను, ఊరిలో జరుగుతున్న పరిణామాలపై ఓ నివేదిక ఇవ్వడానికి ప్రభుత్వం 'శంబాల' గ్రామానికి పంపిస్తుంది. సైన్స్‌ను నమ్ముకున్న విక్రమ్‌ ఆ ఊరి ప్రజల నుంచి ఎలాంటి పరిస్థితులు ఫేస్‌ చేయ్యాల్సి వచ్చింది?  ఊరిలో జరుగుతున్న సంఘటనల వెనుక ఉన్న రహస్యాలను విక్రమ్‌ తెలుసుకున్నాడా? దేవి (అర్చన అయ్యర్‌)కు ఈ కథకు సంబంధం ఏమిటి? సైన్స్‌, శాస్త్రం మధ్య జరిగిన ఈ కథలో అసలు జరిగిందేమిటి? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ: ప్రస్తుతం ప్రేక్షకులు పీరియాడికల్‌ డ్రామాలు, ఇలాంటి మిస్టిక్‌ థ్రిల్లర్, మైథాలాజికల్‌ సినిమాలను ఇష్టపడుతున్నారు. అందుకే ఈ చిత్ర దర్శకుడు కూడా ఈ సినిమాలో హారర్‌, మైథాలాజికల్‌, పురాణాలు, దేవుళ్లు, సైన్స్‌ ఇలా అన్ని మిక్స్‌ చేసి చాలా బరువైన కథను ఎంచుకున్నాడు. ఈ అంశాలన్నింటిని ప్రేక్షకుడికి ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా వివరిస్తే సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ విషయంలో శంబాల దర్శకుడు కొంత మేరకు విజయం సాధించాడు. కథను శంబాల అనే ఊరిలో ఎస్టాబిష్‌ చేసి, ఆ ఊరిలో జరిగిన సంఘటనలు, వాటి వెనుక రహస్యాలను వివరిస్తూ ప్రేక్షకులను కథలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నట్టుగా అక్కడక్కడ సన్నివేశాలు రిపీటెడ్‌ అనిపిస్తూ బోర్‌ కొడుతుంది. అయితే ఈ మధ్యలో మరో ఆసక్తికరమైన సన్నివేశం రావడంతో ప్రేక్షకుడ్ని మళ్లీ కథలోకి ఇన్‌వాల్వ్‌ చేస్తాడు. 

కథానాయకుడు గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత జరిగే పరిణామాలు హారర్‌ కోణంలో ఆసక్తికరంగా ఉంటాయి. రవివర్మ, మీసాల లక్ష్మణ్‌ పాత్రలు వాళ్లలోకి ఆ భూతం ప్రవేశించిన తరువాత వచ్చే సన్నివేశాలతో దర్శకుడు ఆడియన్స్‌ను భయపెట్టే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఈ ఏపిపోడ్‌లో వచ్చే చెరుకు తోట సన్నివేశాలు ఉత్కంఠగా ఉంటాయి.  అయితే కథను ముందుకు నడిపించే భాగంలో దర్శకుడు కొన్ని సన్నివేశాలు సాగదీశాడు అనే ఫీల్‌ను కలుగుతుంది. కొన్ని హత్యలు హీరో కళ్ల ముందు జరుగుతున్న వాటి పట్ల ఆయన ప్రతిస్పందించకపోకుండా ఉండే సన్నవేశాలు  కూడా ఇందులో భాగంగానే ఉన్నాయనిపిస్తుంది. సినిమా మొదలైన పది నిమిషాలు ఇంట్రెస్టింగ్‌ ఉంటుంది. 

ఆ తరువాత కొన్ని సన్నివేశాలు మన సహనానికి పరీక్ష పెట్టిన, విరామం వచ్చే సరికి, ద్వితీయార్థంపై ఉత్కంఠను, ఆసక్తిని పెంచాడు దర్శకుడు. ఊరి దేవత హిస్టరీని తెలిపే సీన్స్‌, ఉల్క పడటం, దాని వెనుక ఉన్న పురాణ రహస్యం, ఇవన్నీ సెకండాఫ్‌లోనే తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయంలో దర్శకుడు తన ప్రతిభను చూపెట్టాడు. సెకండాఫ్‌ మొత్తంలో ఎక్కడా కూడా బిగి సడలకుండా పవర్‌ఫుల్‌ సన్నివేశాలకే ప్రాధానత్య నిచ్చాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాలు ఈ చిత్రానికి కీలకంగా మారాయి. చిన్నపాపకు, పతాక సన్నివేశాలకు ముడిపెట్టడంతో క్లైమాక్స్‌లో ఎమోషన్‌ను కూడా పండించాడు. అయితే సినిమా ముగింపు మాత్రం కన్వీన్సింగ్‌గా లేదనిపించింది. దర్శకుడు ఈ కథ ద్వారా  చెప్పాలనుకున్న విషయాన్ని పూర్తిగా చెప్పలేకపోయాడేమో అనే అసంతృప్తి మాత్రం కనిపిస్తుంది. 

నటీనటుల పనితీరు:
విక్రమ్‌గా ఆది సాయికుమార్‌ మెప్పించాడు. ఆయన గెటప్‌, నటనలో పరిణితి ఆకట్టుకుంది. యాక్షన్‌ సన్నివేశాల్లో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. అర్చన్‌ అయ్యర్‌ పాత్రకు అభినయానికి పెద్దగా ఆస్కారం లేదు.. రవివర్మ, మీసాల లక్ష్మణ్‌లు భయపెట్టారు. కానిస్టేబుల్‌ పాత్రలో మధునందన్‌ మెప్పించాడు.మిగతా ఆర్టిస్టులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం పర్వాలేదు. ప్రవీణ్‌ కె.బంగారి కెమెరా పనితనంతో శంబాలకు మెరుగులు దిద్దాడు. దర్శకుడు యుగంధర్‌ ఇలాంటి ఓ బరువైన కథకు రచనా పరంగా ఇంకొంత సమయం తీసుకుని వుంటే సన్నివేశాల్లో ఆ ఇంపాక్ట్‌ కనిపించేది. మేకింగ్‌ పరంగా మాత్రం ఆయన ప్రతిభ తెలుస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

ఫైనల్‌గా: ఉత్కంఠతో సాగే కథ, కథనాలతో కొనసాగిన 'శంబాల' ప్రేక్షకులకు ఓ మోస్తారు థ్రిల్ల్‌ను పంచుతుంది.