అర్జున్ - ఐశ్వర్య రాజేశ్ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమానే 'తీయవర్ కులై నడుంగ'. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాకి దినేశ్ లక్ష్మణన్ దర్శకత్వం వహించాడు. తెలుగులో 'మఫ్టీ పోలీస్' టైటిల్ తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. నవంబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: చెన్నై లో మాగుడపతి (అర్జున్) పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. రచయిత 'జెబా' దారుణంగా హత్య చేయబడటం నగరంలో హాట్ టాపిక్ గా మారుతుంది. 'జెబా' కూతురు స్టెఫీని కలుసుకున్న మాగుడపతి, అతని గురించి అడుగుతాడు. రెండు మూడు నెలలుగా అతను డిప్రెషన్ లో ఉన్నాడనీ, కొత్తగా మద్యానికి అలవాటు పడ్డాడని తెలుసుకుంటాడు. అతనిని ఎవరు హత్య చేసి ఉంటారనే విషయంపై ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు. 

ఇక చెన్నైలోనే మీరా (ఐశ్వర్య రాజేశ్) బధిరుల పాఠశాలలో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమెకి ఆది (ప్రవీణ్ రాజా)తో పరిచయమవుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. ఆది తన తల్లితో కలిసి 'ఈగల్ అపార్టుమెంట్'లోని ఫ్లాట్ లో ఉంటూ ఉంటాడు. ఆమె మానసిక స్థితి సరిగ్గా ఉండదు. ఆమెను ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచి ఆదినే చూసుకుంటూ ఉంటాడు. ఆ అపార్టుమెంటు ఓనర్ వరదరాజన్ (రామ్ కుమార్)కూడా ఒక ఫ్లాట్ లో ఉంటూ ఉంటాడు.

హత్యకి గురైన 'జెబా' గదిని పరిశీలించిన మాగుడపతికి, 'ఈగల్' పెయింటింగ్ ఒకటి కనిపిస్తుంది. కొత్తగా అతను రాసిన పుస్తకం పేరులో 'కావేరి' అనే పేరు అతనికి ఏదో అనుమానాన్ని కలిగిస్తుంది.  ఆ పెయింటింగ్ ద్వారా .. ఆ పేరు ద్వారా అతను ఏదో చెప్పాలనుకున్నాడని ఆ పోలీస్ ఆఫీసర్ కి అనిపిస్తుంది. అతని పరోశోధన 'ఈగల్ అపార్టుమెంటు'కి చేరుకుంటుంది. అంతకుముందు అక్కడ ఏం జరిగింది? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ.

విశ్లేషణ: ఒక రాత్రి ఎన్నో అరాచకాలకు .. అక్రమాలకు నెలవుగా మారుతుంది. ఏ మారుమూలానో .. అడవీ ప్రాంతంలోనే కాదు, మన నివాస ప్రదేశాలలోనే ఎన్నో నేరాలు .. ఘోరాలు జరిగిపోతూ ఉంటాయి. బలమున్నవాడు .. ధనమున్నవాడు చేసే ఈ అరాచకాలను సామాన్యుడు చూస్తుండిపోవలసిందేనా? అలాంటివారిపై తిరగబడేవారు ఉన్నారా? అనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. 

ఇది ఒక అపార్టుమెంటు చుట్టూ తిరిగే కథ. హత్య .. అత్యాచారం .. ప్రేమకథను టచ్ చేస్తూ ఈ కథ అపార్టుమెంటు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. స్నేహితుడినీ .. ప్రేమించే యువకుడిని .. చివరికి కన్న కొడుకును కూడా నమ్మలేని ఒక సమాజంలో మనమంతా బ్రతుకుతున్నామనే ఒక నిజాన్ని ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నంగా ఈ సినిమా కనిపిస్తుంది. ఎక్కడ అతి అనేది లేకుండా దర్శకుడు ఆయా పాత్రలను డిజైన్ చేసిన తీరు మెప్పిస్తుంది. 

ఈ సినిమాకి అటు అర్జున్ పాత్ర .. ఇటు ఐశ్వర్య పాత్ర రెండు కళ్ల మాదిరిగా కనిపిస్తాయి. ఈ రెండు పాత్రలు స్క్రీన్ పై తారసపడే సందర్భం చాలా సహజంగా అనిపిస్తుంది.  'నాకు చట్టాన్ని కాపాడటం తెలుసు .. చట్టం నుంచి కాపాడటమూ తెలుసు' అనే అర్జున్ డైలాగ్ ఈ సినిమా మొత్తంలో హైలైట్ డైలాగ్. ఈ ఒక్క డైలాగ్ ఆయన పాత్ర స్వభావాన్ని చెబుతుంది.       
పనితీరు: అర్జున్ - ఐశ్వర్య రాజేశ్ లను ప్రధానమైన పాత్రలకి ఎంచుకోవడమే ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పాలి. ఈ కథలో యాక్షన్ .. ఎమోషన్ రెండూ ఉన్నాయి. అయితే అవసరమైన పాళ్లలో అవి పడలేదనిపిస్తుంది. నిదానంగా కథనం సాగే తీరు కాస్త అసహనాన్ని కలిగిస్తుంది. శరవణన్ అభిమన్యు ఫొటోగ్రఫీ .. భరత్ ఆసీవగన్ నేపథ్య సంగీతం .. లారెన్స్ కిశోర్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.

ముగింపు: యాక్షన్ హీరోగా అర్జున్ కి క్రేజ్ ఉంది. విలక్షణమైన పాత్రలు చేయగలిగిన నాయికగా ఐశ్వర్య రాజేశ్ కి మంచి పేరు ఉంది. అయితే ఈ ఇద్దరి స్థాయికి తగినట్టుగా ఈ కథను మలచలేకపోయారని అనిపిస్తుంది. యాక్షన్ ఉంది .. ఎమోషన్స్ ఉన్నాయి .. కానీ అవి కనెక్ట్  కావు. రొటీన్ గా అందించడం అందుకు కారణమని చెప్పాలి. ఈ సినిమా ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.