థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై విపరీతమైన డిమాండ్ ఉంది. అందువలనే ప్రతివారం ఈ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ను వదలడానికి ఓటీటీ సంస్థలు పోటీపడుతూ ఉంటాయి. అలా ఈ వారం 'ఆహా' తెరపైకి వచ్చిన సినిమాగా 'ది హంటర్: చాప్టర్ 1' కనిపిస్తుంది. తమిళంలో 'రణమ్ అరమ్ తవరేల్' పేరుతో రూపొందిన ఈ సినిమా, ఈ ఏడాది జూన్ 13 థియేటర్లకు వచ్చింది. ఈ రోజు నుంచి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
కథ: అది ఒక నగరం .. కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు భయంతో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతుంటారు. అందుకు కారణం .. కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో జరుగుతున్న వరుస హత్యలే. కాలిపోయిన శవాల తాలూకు కాళ్లు .. చేతులు .. మొండెం .. తల వేరు వేరుగా అట్టపెట్టెల్లో పెట్టేసి, హంతకుడు ఆయా ప్రదేశాలలో పడేస్తుంటాడు. అవయవాలతో పాటే ఒక 'మాస్క్'ను కూడా హంతకులు పంపిస్తూ ఉంటాడు.
శివ (వైభవ్) ఊహించి బొమ్మలు గీయడంలో మంచి టాలెంట్ ఉన్న యువకుడు. ఒంటరిగా .. విషాదంలో అతను జీవిస్తూ ఉంటాడు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవాల పూర్వ ముఖాలు ఎలా ఉండేవనేది గీస్తూ, పోలీసులకు ఎంతో సహకరిస్తూ ఉంటాడు. క్రైమ్ సీన్ రాయడంలోను మంచి పేరు సంపాదించుకుంటాడు. ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన విషయంలోనూ ఆయన సూచనలను పోలీస్ డిపార్టుమెంటువారు ఉపయోగించుకుంటూ ఉంటారు.
వరుస హత్యలకు సంబంధించిన కేసును పరిశోధిస్తున్న పోలీస్ ఆఫీసర్ రాజేంద్రన్, ఓ రాత్రివేళ శివకి కాల్ చేస్తాడు. ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవద్దని చెబుతాడు. ఆ తరువాత ఆయన కనిపించకుండా పోతాడు. ఆయన స్థానంలోకి లేడీ పోలీస్ ఆఫీసర్ 'ఇందూజ' (తాన్యా హోప్) వస్తుంది. ఆమె కూడా శివ సాయంతో తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. హంతకులు ఎవరు? ఎవరిని చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? శివ గతం ఏమిటి? హత్యల వెనకున్న ప్రధానమైన కారణం ఏమిటి? అనేది కథ.
విశ్లేషణ: ఇది మిస్టరీ థ్రిల్లర్. పూర్తిగా కాలిపోయి .. గుర్తుపట్టలేని స్థితిలో శవాలు .. వాటి తాలూకు అవశేషాలు బయటపడుతూ ఉంటాయి. చనిపోయింది ఎవరు అనేది తెలుసుకోవడమే పోలీసులకు పెద్ద పజిల్ గా మారుతుంది. హంతకుడు ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నాడు? అనేది కనుక్కోవడం ఆ తరువాత టాస్క్. దర్శకుడు ఈ రెండు వైపుల నుంచి కథను ఇంట్రెస్టింగ్ గా నడిపించుకుంటూ వెళుతుంటాడు.
ఇక ఈ కేసుల విషయంలో పోలీసులకు ఎంతో సపోర్టుగా నిలిచే శివ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి? ఈ హత్యలకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే ఆలోచనలు కూడా ప్రేక్షకుల బుర్రలో రన్ అవుతూ ఉంటాయి. అందుకు సంబంధించిన ఆధారాలు తెరపై దొరక్క ప్రతి ప్రేక్షకుడు ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా మారిపోతాడు. పరిమితమైన పాత్రలను అవసరమైనప్పుడు మాత్రమే తెరపైకి తీసుకుని వస్తూ, ఆడియన్స్ ఎక్కడా జారిపోకుండా కూర్చోబెట్టడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేశాడు.
చివరి 45 నిమిషాలలో ఒక ఫ్లాష్ బ్యాక్ తో కూడిన కథ మొదలవుతుంది. వరుస హత్యలకు కారణమైన కథ ఇదే. ఈ ట్రాక్ ను కూడా దర్శకుడు ఆసక్తికరంగానే రాసుకున్నాడు. చివరికి ఈ కథ ఎవరూ ఊహించని ఒక మలుపు తీసుకుని, మన మధ్యలో మనకి తెలియని కోణంలో జరుగుతున్న ఒక నేర ప్రపంచాన్ని చూపిస్తుంది .. ఆలోచింపజేస్తుంది. చిన్న సినిమానే అయినా, కొత్త పాయింటును టచ్ చేసిన విధానం, ఈ జోనర్ ను ఇష్టపడేవారికి నచ్చుతుంది.
పనితీరు: కథ .. స్క్రీన్ ప్లేను దర్శకుడు డిజైన్ చేసుకున్న విధానం బాగుంది. ఆయా పాత్రలను సహజత్వం దిశగా నడిపించిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఎక్కడా కూడా ఆడియన్స్ ఊహకి ముందుగానే దొరికిపోకుండా దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు మెప్పిస్తాయి. కాకపోతే కాలిన శవాలు .. అవశేషాలు అంటూ చూపించిన క్లోజప్ షాట్లు కాస్త ఇబ్బంది పెడతాయి.
వైభవ్ .. తాన్యా హోప్ .. నందితా శ్వేత నటన బాగుంది. ఈ మూడు పాత్రలు కథను మూడు వైపుల నుంచి నడిపించేవి కావడం విశేషం. ఆ పాత్రలలో ఎక్కడా తమ పరిధిని దాటకుండా చేశారు. బాలాజీ ఫొటోగ్రఫీ .. పిపాసు సంగీతం .. మునీజ్ ఎడిటింగ్ కథ మరింత బలంగా మారడంలో తమ వంతు పాత్రను పోషించాయి.
ముగింపు: హంతకులు .. హత్యలు .. అందుకు దారితీసిన పరిస్థితులు .. పోలీసులు సాగించే ఇన్వెస్టిగేషన్ .. ఇలా ఈ కథను అన్ని వైపుల నుంచి అల్లుకుంటూ వచ్చిన తీరు ఆడియన్స్ ను కూర్చోబెడుతుంది. గతంలో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చినప్పటికీ ఈ ట్రీట్మెంట్ నిరాశ పరచదు. ఈ మాత్రం బడ్జెట్ లోనే బెటర్ అవుట్ పుట్ వచ్చిందనిపించే కంటెంట్ ఇది.
'ది హంటర్: చాప్టర్ 1'(ఆహా) మూవీ రివ్యూ!
The Hunter: Chapter 1 Review
- తమిళంలో రూపొందిన సినిమా
- తెలుగులో అందుబాటులోకి
- ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్
- కుతూహలాన్ని రేకెత్తించే కంటెంట్
- నేర సామ్రాజ్యంలో ఆలోచింపజేసే కోణం
Movie Details
Movie Name: The Hunter: Chapter 1
Release Date: 2025-12-04
Cast: Vaibhav, Nandita Swetha, Tanya Hope, Saras Menon, Praniti Praveen
Director: Sherief
Music: Pipaasu
Banner: Bhavani Movies
Review By: Peddinti
Trailer