'నెట్ ఫ్లిక్స్' నుంచి వచ్చిన సూపర్ హిట్ సిరీస్ లలో 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. ఈ సిరీస్ నుంచి వదిలిన ఒక్కో సీజన్, ఒక దానికి మించి మరొకటి అలరిస్తూ వెళుతోంది. తాజాగా ఈ సిరీస్ నుంచి సీజన్ 5కి సంబంధించిన తొలి వాల్యూమ్ గా 4 ఎపిసోడ్స్ ను వదిలారు. ఈ నెల 26వ తేదీన మరో మూడు ఎపిసోడ్స్ ను .. జనవరి 1వ తేదీన చివరి ఎపిసోడ్ రిలీజ్ చేయనున్నారు. సీజన్ 5కి సంబంధించిన కథ ఎలా వెళ్లిందనేది చూద్దాం. 

కథ: 'హాకిన్స్' ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది. గతంలో అక్కడ 'వెక్నా' అనే ఒక వింతజీవి చేసిన దారుణమైన దాడులు .. అవి మిగిల్చిన భయంకరమైన జ్ఞాపకాల నుంచి ఆ ప్రాంతానికి చెందినవారు బయటపడుతూ ఉంటారు. గతంలో ఎలెవన్ .. స్టీవ్ .. లూకస్ .. విల్ .. జోనాథన్ .. నాన్సీ .. మ్యాక్స్ అంతా కూడా 'వెక్నా' కారణంగా ప్రమాదంలో పడినవారే. వాళ్లంతా కూడా దాని బెడద వదిలిపోయిందనుకుని తేలికగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. 

'హాకిన్స్' లోని ఒక ప్రదేశాన్ని ఆర్మీ పూర్తిగా అధీనంలోకి తీసుకుంటుంది. ఆర్మీ వాళ్ల రక్షణలో అక్కడ కొంతమంది సైంటిస్టులు   'వెక్నా'  అవశేషాలపై ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అయితే సైంటిస్టుల ఆదేశంతో ఆర్మీవాళ్లు ఒక యువతి కోసం గాలిస్తూ ఉంటారు. ఆ యువతి పేరే ఎలెవన్. ఆమెకి కొన్ని అతీత శక్తులు ఉంటాయి. గతంలో ఆ శక్తుల కారణంగానే ఆమె 'వెక్నా'తో పోరాడుతుంది. ఆ దుష్టశక్తిని కొంతవరకూ నియంత్రించడంలో సక్సెస్ అవుతుంది. 

 ఎలెన్ తండ్రి జిమ్ హాపర్ తన కూతురు ఆచూకీ ఆర్మీ వారికి తెలియకుండా చూసుకుంటూ ఉంటాడు, సాధ్యమైనంత త్వరగా ఆమెను ఆ ప్రాంతం నుంచి తరలించాలనే లోచనలో ఉంటాడు. అలాంటి పరిస్థితులలోనే మళ్లీ 'వెక్నా' అలజడి మొదలవుతుంది. మళ్లీ స్నేహితులంతా కలిసి దానిని అంతం చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ నేపథ్యంలోనే నాన్సీ చెల్లెలు 'హాలీ వీలర్'ను 'వెక్నా' ఎత్తుకు వెళుతుంది. ఆ పాపను కాపాడి తీసుకు రావడానికి ఎలెవన్ రంగంలోకి దిగుతుంది. ఆ తరువాత చోటుచేసుకునే సంఘటనలు ఎలాంటివి? అనేదే కథ. 

విశ్లేషణ: కొంతమంది టీనేజ్ అబ్బాయిలు .. అమ్మాయిలు కలిసి ఒక మిత్ర బృందంగా ఉండటం, వాళ్లలో కొందరు ఒకరి పట్ల ఒకరు ఇష్టాన్ని కలిగి ఉండటం .. అనుకోకుండా అందరూ ఒక ప్రమాదకరమైన పరిస్థితులలో చిక్కుకోవడం .. కలిసి కట్టుగా ఆ ఆపదలో నుంచి బయటపడటం అనే కాన్సెప్ట్ తో గతంలో చాలానే కథలు వచ్చాయి. అయితే టీనేజ్ వారితో పాటు ఇతర వర్గాల ఆడియన్స్ ను సైతం కట్టిపడేసే ట్రీట్మెంట్ ఈ సిరీస్ ప్రధానమైన బలంగా నిలిచిందని చెప్పచ్చు. 

సాధారణంగా టీనేజ్ బ్యాచ్ లో కనిపించే అబ్బాయిలు .. అమ్మాయిలలో ఒక రకమైన అమాయకత్వం .. బెరుకు .. భయం .. కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్లు తమకు ఎదురైన ఒక భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడటానికి చేసే పోరాటం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ .. హారర్ .. వంటి అంశాలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళ్లే తీరు మెప్పిస్తుంది. 

ఈ తరహా కంటెంట్ కి రహస్య పరిశోధనలు .. ఆర్మీ రక్షణ వలయం .. ఫారెస్టు నేపథ్యం .. నైట్ ఎఫెక్టులు మరింత బలాన్ని ఇస్తాయి. అలాంటి అంశాలన్నీ కూడా ఈ కథలో మనకి కనిపిస్తాయి. బలమైన ఈ కథకి .. స్క్రీన్ ప్లే .. వీఎఫ్ ఎక్స్ మరింత బలంగా నిలిచాయి. అందువలన నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికి, ప్రేక్షకుడు బోర్ ఫీలవకుండా కథను ఫాలో కావడం జరుగుతుంది.

పనితీరు: కథాకథనాలపై దర్శకుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో, అందుకు తగిన వీఎఫెక్స్ విషయంపై కూడా అంతే దృష్టి పెట్టాడు. ఇక నాలుగు సీజన్లుగా ఈ సిరీస్ అలరిస్తూ ఉండటం వలన, చాలా పాత్రల తీరు తెన్నులపై ఆడియన్స్ కి ఒక అవగాహన ఏర్పడిపోయి ఉంటుంది. ఆ పాాత్ర స్వరూప స్వభావాలను అలాగే కాపాడుకుంటూ రావడం విశేషం. 

ప్రధానమైన పాత్రలను పోషించిన నటీనటులంతా, తమ పాత్రలలో చాలా సహజంగా ఒదిగిపోయారు. సాంకేతిక నిపుణులు కూడా తమ వైపు నుంచి ఇచ్చిన అవుట్ పుట్ గొప్పగా అనిపిస్తుంది. కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం .. విజువల్స్ .. పోటీపడుతూ ముందుకు వెళ్లడం కనిపిస్తుంది. 

ముగింపు: అన్ని వైపుల నుంచి అల్లుకుంటూ వచ్చిన ఈ కథ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పాలి. కథ .. కథనం .. పాత్రలను డిజైన్ చేసిన విధానం .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. విజువల్స్ ఈ సిరీస్ కి ప్రధానమైన బలంగా నిలుస్తాయని చెప్పచ్చు.