రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన సినిమానే 'పాంచ్ మినార్'. రాశి సింగ్ ఆయన జోడీకట్టింది. రామ్ కడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, నవంబర్ 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఒక వారంలోనే ఓటీటీకి వచ్చేసింది. నవంబర్ 28వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: కిట్టూ (రాజ్ తరుణ్) తన తల్లిదండ్రులు .. చెల్లెలితో కలిసి హైదరాబాదులో నివసిస్తూ ఉంటాడు. కిట్టూ వాళ్లది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కూతురు పెళ్లి చేయడానికి అవసరమైన డబ్బు కోసమే కిట్టూ వాళ్ల నాన్న (బ్రహ్మాజీ) నానా పాట్లు పడుతూ ఉంటాడు. ఎక్కడా జాబ్ దొరక్కపోవడంతో, బిజినెస్ చేయడానికి ట్రై చేసిన కిట్టూ, తన చెల్లెలి కోసం తండ్రి దాచిన డబ్బు కాస్తా పోగొడతాడు. అతనికి జాబ్ వస్తే తమ పెళ్లికి తండ్రిని ఒప్పించాలని ఖ్యాతి (రాశి సింగ్) వెయిట్ చేస్తూ ఉంటుంది.
హైదరాబాదులో ఛోటు (రవి వర్మ) గ్యారేజ్ ముసుగులో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటాడు. ఆయన ప్రధానమైన అనుచరుడిగా మూర్తి ( అజయ్ ఘోష్) ఉంటాడు. 'ఛోటూ'కి దక్కవలసిన 5 కోట్ల రూపాయలను గణేశ్ అనే ఒక అనుచరుడు ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టి చనిపోతాడు. అప్పటి నుంచి 'ఛోటూ' ఆ డబ్బు కోసం గాలిస్తూనే ఉంటాడు. అతనికి మూర్తి కదలికలపై కూడా కాస్త అనుమానంగా ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే 'క్యాబ్' డ్రైవర్ గా మారిన కిట్టూ, మూర్తి గ్యారేజి నుంచి ఒక కారును తీసుకుంటాడు. ఆ క్యాబ్ లో వెళ్లిన ఇద్దరు కిరాయి హంతకులు, 'ఛోటూ'ను షూట్ చేసి చంపేస్తారు. డ్రైవర్ గా ఉన్న కిట్టూ షాక్ అవుతాడు. ఈ కేసు విషయంలో మూర్తిని బ్లాక్ మెయిల్ చేయడానికి సీఐ గోవింద్ అయ్యర్ ట్రై చేస్తుంటాడు. ఒక పెద్ద ఎమౌంట్ 'పాంచ్ మినార్' అనే కోడ్ పై ఒకచోటున భద్రపరచబడి ఉందని కిట్టూ తెలుసుకుంటాడు. అప్పుడతను ఏం చేస్తాడు? ఫలితంగా అతని ఫ్యామిలీ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుంది? అనేది మిగతా కథ.
విశ్లేషణ: కొంతమంది కుర్రాళ్లు బద్దకంతో కలిసి బ్రతుకుతుంటారు. తాపీగా తాగేసి .. కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూల్ గా బ్రతికేయడానికే వాళ్లు ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లు బరువు బాధ్యతలకు దూరంగా పారిపోతుంటారు. అలాంటి ఒక కుర్రాడు ఈజీగా డబ్బు సంపాదించాలనీ .. తాను ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈజీ మనీ ఎలాంటి కష్టాలు తెచ్చి పెడుతుందనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది.
ఈ కథలో డబ్బు కోసం హీరో పరుగులు పెడుతూ ఉంటాడు. అతణ్ణి పట్టుకోవడానికి ఒక వైపున లోకల్ రౌడీ గ్యాంగ్ .. మరొక వైపున కిరాయి హంతకులు .. ఇంకొక వైపున అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ వెంటాడుతూ ఉంటారు. వాళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి హీరో వేసే వేషాలు .. తమాషాలకు కామెడీ టచ్ ఇస్తూ దర్శకుడు ఈ కథను నడిపించాడు. ఈ గ్యాంగుల మధ్య గందరగోళం .. తికమకల మధ్య ఫన్ వర్కౌట్ చేయడానికి ప్రయత్నించారు.
ఈ తరహా కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే కథను నడిపించే విధానాన్ని బట్టి చూస్తే, బోర్ అనిపించకుండా సాగిందనే చెప్పాలి. అయితే ఎక్కడా ఎమోషన్స్ వైపు వెళ్లకపోవడం వెలితిగా అనిపిస్తుంది. లవ్ .. రొమాన్స్ దిశగా అవకాశం ఉన్నప్పటికి, ఆ కోణాలను టచ్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించకపోవడం కనిపిస్తుంది. వినోదానికి అవసరమైన కొన్ని పాళ్లు తగ్గాయనే భావన కలుగుతుంది.
పనితీరు: ఒక విలువైన వస్తువు కోసమో .. డబ్బు కోసమో .. కీలకమైన ఆధారం కోసమో, ఒకరి వెనుక ఒకరు పడే కథలతో కొన్ని సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. ఆ దారిలో ఈ కథను పరిగెత్తించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం కొంతవరకు మాత్రమే ఫలించిందని చెప్పాలి.
రాజ్ తరుణ్ .. అజయ్ ఘోష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆదిత్య జవ్వాది ఫొటోగ్రఫీ .. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం .. పవన్ పూడి ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తాయి.
ముగింపు: లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ కి అవకాశం ఉండి కూడా, వాటికి దూరంగా నడిపించిన కథ ఇది. పూర్తిగా కామెడీని మాత్రమే నమ్ముకుని వెళ్లారు. అయితే ఆ కామెడీ విషయంలో మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. వినోదానికి అవసరమైన అన్ని పాళ్లు కుదరనందు వలన, ఓ మాదిరిగా అనిపిస్తుంది అంతే.
'పాంచ్ మినార్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Paanch Minar Review
- రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన 'పాంచ్ మినార్'
- నవంబర్ 28 నుంచి మొదలైన స్ట్రీమింగ్
- కామెడీని మాత్రమే నమ్ముకున్న కంటెంట్
- లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ కి దూరంగా సాగే కథ
- ఓ మాదిరిగా అనిపించే సినిమా
Movie Details
Movie Name: Paanch Minar
Release Date: 2025-11-28
Cast: Rajtarun, Rasi Singh, Ajay Ghosh, Nithin Prasanna, Brahmajim Ravivarma
Director: Ram Kadumula
Music: Sekhar Chandra
Banner: Connect Movies
Review By: Peddinti
Trailer