మలయాళం నుంచి వచ్చిన ఒక యాక్షన్ కామెడీ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి రంగంలోకి దిగిపోయింది. ఆ సినిమా పేరే 'ది పెట్ డిటెక్టివ్'. అక్టోబర్ 16వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. షరాఫ్ యు దీన్ - అనుపమా పరమేశ్వరన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: జోస్ అలూలా ( రెంజి పనికర్) మెక్సికోలో డిటెక్టివ్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ సిటీలో సాంబాయ్ ( విజయ రాఘవన్) డాన్ గా ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడనేది కూడా ఈ ప్రపంచానికి తెలియదు. దాంతో ఆయన ఫొటో సంపాదించినా చాలు అనే ఉద్దేశంతో, అలూలా ధైర్యం చేస్తాడు. సాంబాయ్ ఫొటో తీస్తాడు.. కానీ ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయి 'కొచ్చి' వచ్చేస్తాడు. ఇక్కడ డిటెక్టివ్ ఏజెన్సీని పెడతాడు.

జోస్ కొడుకు టోనీ (షరాఫ్ యు దీన్)కి ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో తాను డిటెక్టివ్ గా మారతాడు. అతను కైకేయి (అనుపమా పరమేశ్వరన్)ను ప్రేమిస్తూ ఉంటాడు. డిటెక్టివ్ గా నిరూపించుకుని, అప్పుడు వచ్చి పెళ్లి విషయాన్ని తన తండ్రితో మాట్లాడమని తనితో కైకేయి చెబుతుంది. తప్పిపోయిన పెట్స్ జాడ కనుక్కుని తీసుకొచ్చే పనిచేస్తున్న టోనీ, సరయిన కేసు దొరకాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకి ఒక తీగ దొరుకుతుంది. 

30 కోట్ల రూపాయల విలువైన చేపల బాక్స్ ఒకటి చేతులు మారుతున్నట్టుగా అతనికి తెలుస్తుంది. అరుదైన రకానికి చెందిన ఆ చేపలను గురించి అతను లోతుగా అధ్యయనం చేస్తాడు. ఆ చేపల బాక్స్ తో పాటు ఒక స్కూల్ పాప కనిపించకుండా పోవడం ఆయనలో అనేక అనుమానాలను రేకెత్తిస్తుంది. ఆ చేపల స్మగ్లింగ్ వెనుక ఎవరున్నారు? టోనీకి తెలిసే నిజాలేమిటి? ఒక డిటెక్టివ్ గా ఆయన ఈ కేసు విషయంలో విజయం సాధిస్తాడా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: మెక్సికోతో ముడిపడిన ఈ కథ, 'కొచ్చి'లో కొనసాగుతుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికిగాను డిటెక్టివ్ గా మారిన ఒక యువకుడి కథ ఇది. ఆమెతో హీరో అనిపించుకోవడం కోసం అతను ఎంచుకున్న మార్గం ఇది. ప్రధానమైన ఈ అంశం చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. యాక్షన్ కామెడీ జోనర్ లో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. మొదటి నుంచి చివరివరకూ అదే జోనర్ కి కట్టుబడి ఈ కథ నడుస్తుంది.

 ఖరీదైన చేపల బాక్స్ 'కొచ్చి' చేరుకోవడం .. దానిని సొంతం చేసుకోవడానికి గాను మాఫీయా గ్యాంగులు ఒకదాని తరువాత ఒకటిగా రంగంలోకి దిగడం .. అన్ని గ్యాంగుల మధ్య పోటీ పెరిగిపోవడం జరుగుతుంది. ఆ గ్యాంగులను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనే విషయంలో కామెడీని పరిగెత్తించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అయితే ఆ కామెడీ వర్కౌట్ అయిందా అంటే లేదనే చెప్పాలి.

సాధారణంగా ఒక నిధిని గానీ .. ఖరీదైన వస్తువును గాని దక్కించుకునే క్రమంలో, గ్రూపుల మధ్య ఒక గందరగోళమైన కామెడీని క్రియేట్ చేస్తుంటారు. తెరపై ఈ తరహా ఎపిసోడ్ చాలాసేపు కొనసాగుతుంది. అలాంటి కొన్ని ఎపిసోడ్స్ నాన్ స్టాప్ గా నవ్వించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ కథ విషయానికి వచ్చేసరికే కామెడీ కనెక్ట్ కాకపోయేసరికి గందరగోళం మాత్రమే మిగిలిపోయింది.

పనితీరు: ఇది యాక్షన్ కామెడీ సినిమా. కాకపోతే సిల్లీ కామెడీతో ఉండటం వలన, యాక్షన్ పెద్దగా ఎక్కదు. ఎంత కామెడీ సినిమా అయినా ఆ కామెడీ పేలడానికి ఒక సమయం .. సందర్భం అనేవి ఉంటాయి. కానీ ప్రతి సన్నివేశంలోను ఆడియన్స్ ను నవ్వించడానికి ట్రై చేయకూడదు. ఈ  సినిమా విషయంలో అతి కామెడీయే అసహనాన్ని కలిగిస్తుంది.

నటీనటుల నటన గురించి మాట్లాడుకునే స్థాయిలో వాళ్ల పాత్రలను డిజైన్ చేయలేదు. అనేంద్ చంద్రన్ ఫొటోగ్రఫీ .. రాజేశ్ మురుగేశన్ నేపథ్య సంగీతం .. అభినవ్ సుందర్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. 

ముగింపు
: కథ మొదలైన దగ్గర నుంచి కొత్త పాత్రలు ఎంటరవుతూ ఉంటే .. కథా పరిధి పెరుగుతూ  ఉంటే ..  విషయం ఆసక్తికరంగా మారుతూ ఉండాలి. కానీ తెరపై ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసి, ఆ కన్ఫ్యూజన్ లో నుంచి కామెడీని పిండటానికి ప్రయత్నించారు .. అది కాస్తా ఆశించిన స్థాయిలో పేలలేదు అంతే.