చిన్న బడ్జెట్ లో .. పరిమితమైన పాత్రలతో రొమాంటిక్ కామెడీ జోనర్లో సినిమాలు చేయడంలో తమిళ మేకర్స్ కి  ఒక ప్రత్యేకత ఉంది. ఈ తరహా సినిమాలు అటు థియేటర్లలో సందడి చేయడమే కాకుండా, ఇటు ఓటీటీ వైపు నుంచి కూడా మంచి మార్కులు కొట్టేస్తున్నాయి. అలాంటి ఒక సినిమానే 'ఆన్ పావమ్ పొల్లతత్తు'. అక్టోబర్ 31వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 28 నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: శివ (రియో రాజ్) మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. ఐదు అంకెల జీతమే సంపాదిస్తూ ఉంటాడు. తల్లి .. తండ్రి .. తమ్ముడు .. ఇదే అతని కుటుంబం. ఇక శక్తి (మాళవిక మనోజ్) ప్లస్ టూ దాటడానికి నానా తంటాలు పడుతుంది. క్రమశిక్షణ .. పద్ధతి అంటూ తండ్రి పెట్టే ఆంక్షలు ఆమెకి ఇబ్బందిగా మారతాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకి శివతో వివాహం జరుగుతుంది. ఇద్దరూ కలిసి వేరు కాపురం పెడతారు. 

భర్త అంటే బాస్ .. భార్య అంటే బానిస అనే మాటలు శివకి నచ్చవు. ఇద్దరూ సమానమే అనేది అతని అభిప్రాయం. స్త్రీకి స్వేచ్ఛ అవసరమే అని భావించేవాళ్లలో ఆయన ఒకడు. శక్తికి పెద్దగా తెలివి తేటలు లేకపోయినా, ఈ తరం అమ్మయినని నిరూపించుకోవడానికి తపన పడుతూ ఉంటుంది. ఆమె మీద సినిమాల ప్రభావం .. సోషల్ మీడియా ప్రభావం ఉన్నాయనే విషయం శివకి అర్థమైపోతుంది. అయినా అతను సర్దుకుపోతుంటాడు. 

కొత్త ఇంట్లో రీల్స్ చేస్తూ శక్తి కాలక్షేపం చేస్తూ ఉంటుంది. తనని అర్థం చేసుకునే భర్త దొరికినందుకు సంతోషపడుతుంది. 400 ఏళ్లపాటు అతనితోనే కలిసి ఉండాలనిపిస్తుందని చెబుతుంది. అయితే 400 రోజులు దాటగానే ఇద్దరి మధ్య వ్యవహారం చెడుతుంది. ఒక వైపు నుంచి శివ.. మరో వైపు నుంచి శక్తి కోర్టు మెట్లు ఎక్కుతారు. అందుకు కారణం ఏమిటి? కారకులు ఎవరు? చివరికి వాళ్లిద్దరూ కలిసున్నారా? విడిపోయారా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: వైవాహిక జీవితాన్ని అమ్మాయిలు ఎంతో అందంగా ఊహించుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు లేని జీవితాన్ని కోరుకుంటారు. తమని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే భర్త లభించాలని ఆశపడతారు. అలాగే అబ్బాయిలు కూడా, భార్య పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు. తనని అర్థం చేసుకోవాలనీ, నలుగురిలో తమ కుటుంబ గౌరవం కాపాడేలా నడుచుకోవాలని ఆశపడతారు. అయితే రెండు వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చిన అబ్బాయి - అమ్మాయి ఒక్కసారిగా సర్దుకుపోవడం కష్టమేననే విషయాన్ని చాటే కథ ఇది. 

అమ్మాయిలపై వెస్ట్రన్ కల్చర్ ప్రభావం ఎక్కువగా పడుతోంది. వాళ్లను సోషల్ మీడియా ఎక్కువగా ప్రభావితం చేస్తూ వస్తోంది. చిన్నప్పటి నుంచి తన ముందు తరాన్ని చూస్తూ పెరిగిన అబ్బాయిలు, ఈ జనరేషన్ అమ్మాయిల తీరును అర్థం చేసుకునే లోగానే విషయం విడాకుల వరకూ వెళ్లిపోతోంది. హక్కులు .. పోరాటాలు అంటూ మిగతా వారు వాళ్లను మరింత దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం అవసరమంటూ దర్శకుడు ఈ కథను డీల్ చేసిన విధానం బాగుంది.

'సమానత్వమంటే పనులు పంచుకోవడం కాదు, ఒకరి పరిస్థితిని మరొకరు అర్థం చేసుకోవడం' .. 'ఈ కాలంలో స్విచ్ వస్తే అన్ని పనులూ అయిపోతాయి. కాకపోతే ఈ స్విచ్ కూడా భార్యనే వేయాలి' వంటి డైలాగ్స్ ఇరువైపుల వారిని ఆలోచింపజేస్తాయి. భార్యాభర్తల మధ్య హక్కుల గురించిన ఆలోచనలు రాకుండా ఉండాలంటే, వాళ్లిద్దరి మధ్య అంతకు మించిన ప్రేమ ఉండాలని స్పష్టం చేసే ఈ కథ, ఈ తరం ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుంది.

పనితీరు
: దర్శకుడు ఈ కథను అన్ని వైపుల నుంచి అందంగా .. అర్థవంతంగా అల్లుకుంటూ వచ్చాడు. ఒక వైపున భార్యాభర్తలు .. ఒక వైపున వాళ్ల తల్లి తండ్రులు .. మరో వైపున కోర్టు .. ఇంకో వైపున ఈ సమాజం వైపు నుంచి ఈ కథను ఆవిష్కరించిన విధానం .. పరిష్కారాన్ని చూపించిన తీరు సంతృప్తికరంగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల వైపు నుంచి మాత్రమే కాకుండా,  లాయర్ల వైపు నుంచి కూడా ఎమోషన్స్ ను .. కామెడీని ప్లాన్ చేసుకోవం ఈ కథకు మరింత బలాన్ని చేకూర్చింది. 

శివ పాత్రలో రియో రాజ్ బాగా చేశాడు. ఇక అతని భార్య పాత్రలో మాళవిక మనోజ్ గొప్పగా చేసింది. ఆమె రూపం .. సహజమైన అభినయం చూస్తే, ఒకప్పటి 'షావుకారు జానకి' గుర్తొస్తుంది. ఆమె నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. మిగతా ఆర్టిస్టులు కూడా పాత్ర పరిధిలో మెప్పించారు. మాదేశ్ ఫొటోగ్రఫీ .. సిద్ధు కుమార్ సంగీతం .. వరుణ్ ఎడిటింగ్ కథను మరింత సహజంగా కనెక్ట్ చేస్తాయి. 

ముగింపు
: వేరు వేరు కుటుంబ నేపథ్యాలలో పెరిగిన అమ్మాయిలు .. అబ్బాయిలు, పెళ్లి తరువాత ఒక కప్పు క్రింద బ్రతకాల్సి వస్తుంది. ఈ కొత్త ప్రపంచంలో సర్దుకుపోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలోనే సహనంతో మసలు కోవాలి. కాస్త ఈగోను .. మరికాస్త సోషల్ మీడియాను పక్కన పెట్టాలి. భార్యాభర్తలలో ఎవరూ ఎక్కువా కాదు .. తక్కువా కాదు అని చాటిచెప్పే ఈ కథ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.