రొమాంటిక్ కామెడీ జోనర్ కి చెందిన ఒక సినిమా ఈ నెల 26వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా పేరే 'జింగిల్ బెల్ హీస్ట్'. ఒలీవియా హాల్ట్ .. కానర్ స్విండెల్స్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, మైఖేల్ ఫిమోగ్నారి దర్శకత్వం వహించాడు. క్రిస్మస్ నేపథ్యంలో నడిచే ఈ కథ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: నిక్ (కానర్ స్విండెల్స్) ఒక దొంగ. లండన్ లో దొంగతనాలు చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అతనికి భార్య .. కూతురు ఉంటారు. గతంలో అతను స్టెర్లింగ్ కి సంబంధించిన ఒక పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ లో పనిచేస్తాడు. స్టెర్లింగ్ స్వార్థానికి 'నిక్' జైలు జీవితం అనుభవించి బయటికి వస్తాడు. అప్పటి నుంచి అతని వైవాహిక జీవితం గందరగోళంగా మారుతుంది. భార్యా బిడ్డలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుకోవాలనే ఒక ఆలోచనలో అతను ఉంటాడు. 

ఇక సోఫియా ( ఒలీవియా హాల్ట్) విషయానికి వస్తే, ఆమె ప్రస్తుతం ఆమె అదే డిపార్టుమెంటల్ స్టోర్ లో పనిచేస్తూ ఉంటుంది. ఆమె తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె కోలుకోవాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుందని డాక్టర్లు చెబుతారు. దాంతో ఆ డబ్బును ఎలా సర్దుబాటు చేయాలా అని ఆమె ఆలోచనలో పడుతుంది. అలాంటి సమయంలోనే ఆమెకి 'నిక్' తారసపడతాడు. ఒకరి గురించిన విషయాలు ఒకరు చెప్పుకుంటారు. ఆ సమయంలోనే వారి మనసులు కలుస్తాయి కూడా.  

డిపార్ట్మెంటల్ స్టోర్ లోని ఒక సీక్రెట్ ప్లేస్ లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందనీ, ఆ డబ్బును కాజేస్తే తమ అవసరాలు తీరతాయని 'నిక్' తో సోఫియా చెబుతుంది. అయితే  సీక్రెట్ ప్లేస్ కి వెళ్లడం .. ఆ 'లాకర్' ను ఓపెన్ చేయడం చాలా కష్టమైన విషయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఎంత రిస్క్ అయినా తీసుకోక తప్పదని అంటాడు నిక్. ఆ డబ్బు కోసం వాళ్లు ఏం చేస్తారు? ఆ ప్రయత్నంలో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేది మిగతా కథ.

విశ్లేషణ: 'క్రిస్మస్' నేపథ్యంలో అల్లుకున్న ఒక చిన్న కథ ఇది. ఈ కథలో కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. అయితే అవి కూడా లైట్ గానే ఉంటాయి. అలాంటి ఎమోషన్స్ తో పాటు, కాస్త రొమాన్స్ .. కామెడీ టచ్ ఇస్తూ రూపొందించిన సినిమా ఇది. కథలో చివర్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఈ చిన్న కథకు మరికాస్త బలాన్ని జోడిస్తుంది అంతే.

కథలో ప్రధానమైన పాత్రలు రెండే. ఆ పాత్రలలో మనకి హీరో - హీరోయిన్ కనిపిస్తారు.  మిగతా పాత్రలలో రెండు మూడు మాత్రమే కాస్త ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. ప్రధానమైన ఈ పాత్రల చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. కథలో భారీతనం గానీ .. కథనంలో సస్పెన్స్ గాని లేకపోవడం వలన, సాదాసీదాగానే సన్నివేశాలు సాగిపోతూ ఉంటాయి. ఏం జరుగనుందా? అనే ఒక ఆసక్తి ఎక్కడా కలగనీయని కంటెంట్ ఇది. 

ఈ కథ అంతా కూడా హీరో ఇల్లు .. హీరోయిన్ ఇల్లు .. ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ చుట్టూ తిరుగుతుంది. ఎక్కువ డ్రామా డిపార్ట్మెంటల్ స్టోర్ లోనే నడుస్తుంది.  అయితే సింపుల్ కంటెంట్ కావడం వలన, లవ్ .. ఎమోషన్స్ .. కామెడీని లైట్ గానే టచ్ చేయడం వలన, పెద్దగా ప్రభావితం చేయలేకపోయింది. ఒక చిన్న డ్రామాను అక్కడక్కడే నడిపించడం వలన, ఇది సినిమా స్థాయి కంటెంట్ గా కూడా అనిపించదు.

పనితీరు: క్రిస్మస్ నేపథ్యంలో .. రాబరీ ప్రధానమైన అంశంగా దర్శకుడు ఈ కథను డిజైన్ చేసుకున్నాడు. క్రిస్మస్ సందడిలో జరిగే ఈ రాబరీకి ఆయన లైట్ గా కామెడీ టచ్ ఇచ్చాడు. అయితే ఈ రాబరీ కోసం హీరో - హీరోయిన్ వేసే ప్లాన్ పెద్దగా ఆకట్టుకోదు. ఈ తరహా దొంగతనాలు ఇంతకుముందు చాలానే చూశాం కదా అనే అనిపిస్తుంది. కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

ముగింపు: పరిమితమైన బడ్జెట్ లో .. పరిమితమైన పాత్రలతో .. ఒకానొక సందర్భంతో ముడిపడిన కథలు కొన్ని మనలను కదలనీయకుండా చేస్తూ ఉంటాయి. చిన్న కథ అయినప్పటికీ అది ఆడియన్స్ పై చూపించే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఒక ఫీల్ ను ఈ సినిమా మనకి కలిగించలేకపోతుంది.