'ఒండు సరళ ప్రేమకథే' .. కన్నడంలో రూపొందిన ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. 2024లో ఫిబ్రవరి 8వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. వినయ్ రాజ్ కుమార్ .. మల్లికా సింగ్ .. స్వాతిష్ఠ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. 'సుని' దర్శకత్వం వహించిన ఈ సినిమా, కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లోను అందుబాటులోకి వచ్చింది.
కథ: అతిశయ్ (వినయ్ రాజ్ కుమార్) ఓ మిడిల్ క్లాస్ కి చెందిన యువకుడు. తల్లి .. తండ్రి .. చెల్లి .. బామ్మ .. ఇదే అతని కుటుంబం. అయితే వాళ్లతో పాటు అనురాగ (స్వాతిష్ఠ) ఆమె తల్లి కూడా ఉంటారు. గతంలో అనురాగ తండ్రి అతిశయ్ తండ్రితో కలిసి బిజినెస్ చేస్తాడు. అయితే కొన్ని కారణాల వలన అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అప్పటి నుంచి అనురాగ .. ఆమె తల్లి ఇద్దరూ కూడా అతిశయ్ ఇంట్లోనే ఆశ్రయం పొందుతారు.
అతిశయ్ కి సంగీతం అంటే ఇష్టం. ఎప్పటికైనా మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతని ఆశయం. అలాగే సంగీత జ్ఞానం .. మంచి స్వరం కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేది అతని ఆలోచన. ఇతరులకు సాయపడే మంచి మనసున్న అబ్బాయిని చేసుకోవాలనేది అనురాగ ఉద్దేశం. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ అతిశయ్ కి .. అనురాగకి చిటపటలు నడుస్తూ ఉంటాయి. సంగీతం మానేసి బిజినెస్ లో తనకి సాయం చేయమని అతిశయ్ ని తండ్రి ఒత్తిడి చేస్తూ ఉంటాడు. ఇక అనురాగ జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది.
ఒకసారి అతిశయ్ ఒక ఫంక్షన్లో ఒక చక్కని స్వరాన్ని వింటాడు. తాను విన్న ఆ పాట పాడింది 'మధుర' (మల్లికా సింగ్) అని తెలుసుకుంటాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, పరిచయం పెంచుకోవడం మొదలుపెడతాడు. అతిశయ్ నాయనమ్మ అంటే ఆ ఇంట్లో అందరికీ గౌరవమే. ఆమె తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతుంది. తాను బ్రతికుండగానే అనురాగ మెడలో తాళి కట్టమని, తన చివరి కోరికను బయటపెడుతుంది. అప్పుడు అతిశయ్ ఏం చేస్తాడు? అతని నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది మిగతా కథ.
విశ్లేషణ: 'ఒండు సరళ ప్రేమకథే' అంటే, 'ఒక సాధారణ ప్రేమకథ' అని అర్థం. 'ప్రేమ' అనేది ఈ కథలో ప్రధానమైన అంశం అయినప్పటికీ, ఆశ .. అభిరుచి .. ఇష్టం .. ప్రేమ .. పెళ్లి అనే అంశాలను టచ్ చేస్తూ ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. హీరో - హీరోయిన్ కి సంబంధించిన ట్రాక్ లో మధ్యమధ్యలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా తోడవుతూ ఉంటాయి.
సాధారణంగా చాలా కథల్లో హీరో - హీరోయిన్ మధ్య చిటపటలతోనే ప్రేమకథ మొదలవుతూ ఉంటుంది. ఈ కథ కూడా ఆరంభంలో ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఆ తరువాత జరిగిన అనూహ్యమైన సంఘటనతో కథ ముంబై మీదుగా రాజస్థాన్ చేరుకుంటుంది. కొత్త పాత్రలు .. కొత్త ప్రదేశాలతో, సెకండాఫ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చి పడుతూ ఉంటాయి.
అయితే ఇటు హీరో ప్రొఫెషన్ వైపు నుంచి .. అటు హీరోయిన్ ప్రొఫెషన్ వైపు నుంచి .. ఈ ఇద్దరి కాంబినేషన్ వైపు నుంచి వచ్చే సన్నివేశాలలో పెద్దగా బలం కనిపించదు. లవ్ .. ఎమోషన్స్ ఏ మాత్రం మనసుకు పట్టుకోవు. ఫీల్ వర్కౌట్ కాకపోడం వలన, కథ నిదానంగా సాగుతున్న భావన కలుగుతుంది. ట్విస్టులు కూడా ఆడియన్స్ ను పెద్దగా ప్రభావితం చేయలేకపోతాయి.
పనితీరు: ఈ సినిమాకి దర్శకుడు సుని. ఆయన ఎంచుకున్న ఈ కథ, ప్రేక్షకులకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ను అందించకుండానే చాలా దూరం వరకూ వెళ్లిపోతుంది. ఒక లవ్ స్టోరీ నుంచి ప్రేక్షకులు ఆశించే లవ్ .. రొమాన్స్ .. కనిపించవు. కామెడీ టచ్ ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం మరో లోపంగా అనిపిస్తుంది. కార్తీక్ శర్మ ఫొటోగ్రఫీ .. వీర్ సమర్ధ్ సంగీతం .. ఆది ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. నటీనటుల నటన విషయానికి వస్తే, ఆ స్థాయిలో మలిచిన పాత్రలేవీ మనకి కనిపించవు.
ముగింపు: ప్రేమకథలు ప్రేక్షకులకు కనెక్ట్ కావడంలో కథలోని ఫీల్ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. అలాగే చిత్రీకరణ .. లొకేషన్స్ .. బాణీలు .. ఇవన్నీ కూడా ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. కానీ ఈ కథలో అలాంటి అంశాలేవీ ఆ స్థాయిలో ప్రభావితం చేయలేకపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు, 'నిజంగానే ఇది చాలా సాధారణమైన ప్రేమకథ ..' అని అనుకునే అవకాశాలే ఎక్కువ.
'ఒండు సరళ ప్రేమకథే' (జీ 5) మూవీ రివ్యూ!
Ondu Sarala Prema Kathe Review
- కన్నడలో రూపొందిన సినిమా
- తెలుగులోనూ అందుబాటులోకి
- ఫీల్ లోపించిన ప్రేమకథ
- కనిపించని లవ్ .. రొమాన్స్
- ఆసక్తిని రేకెత్తించలేకపోయిన ట్విస్టులు
Movie Details
Movie Name: Ondu Sarala Prema Kathe
Release Date: 2025-11-21
Cast: Vinay Rajkumar, Mallika Singh ,Swathishta,Rajesh Nataranga,Aruna Balraj
Director: Suni
Music: Veer Samarth
Banner: Ram Movies
Review By: Peddinti
Trailer