ఒకవైపు కమెడియన్‌గా నటిస్తూనే మరో వైపు కథానాయకుడిగా నటిస్తున్నాడు ప్రియదర్శి. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'ప్రేమంటే'. ఆనంది నాయికగా నటించిన ఈ చిత్రం ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌కు 'థిల్ల్‌ ప్రాప్తిరస్తు' అనే ఉపశీర్షికను జత చేశారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ప్రేమంటే' చిత్రంలో ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? ఈ చిత్రం ప్రియదర్శి హిట్‌ ఖాతాలో పడిందా? లేదా రివ్యూలో తెలుసుకుందాం. 

కథ: తండ్రి అనారోగ్యం కారణంగా చేసిన అప్పులను తీర్చడం కోసం, తండ్రి అపురూపంగా కట్టుకున్న ఇంటిని తాకట్టు నుంచి విడిపించడం కోసం స్నేహితులతో కలిసి  చిన్న వ్యాపారాన్ని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటాడు మదుసూదన్‌ అలియాస్‌ మది (ప్రియదర్శి). పెళ్లి తరువాత జీవితం థ్రిల్లింగ్‌గా ఉండాలని కోరుకునే అమ్మాయి రమ్య (ఆనంది). ఈ ఇరువురు కుటుంబాలు కూడా వీరి కోసం పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. 

అయితే ఈ ఇద్దరు, ఈ ఇరువురు కుటుంబాలు అనుకోకుండా ఓ పెళ్లిలో కలుసుకుంటారు.. అక్కడే వారి అభిప్రాయాలు కూడా కలవడంతో మది, రమ్యలకు పెళ్లి జరుగుతుంది. ఇక వివాహాం తరువాత కథ అనుకోని మలుపు తిరుగుతుంది. ఆ మలుపుతో రమ్య జీవితం థ్రిల్లింగ్‌గా ఉంటుందా? ఇంటి అప్పులు తీర్చడానికి మది మరో దారిని ఎంచుకుంటాడు? ఆ దారి ఏమిటి? దానిని గురించి తెలిశాక రమ్య ఎలా స్పందించింది? వీరిద్దరి కాపురం ఎలా సాగింది? ఇద్దరూ కలిసి ఉంటారా? లేదా ఈ ఇద్దరి జీవితల్లోకి ఆశామేరి (సుమ) ఎలా ప్రవేశించింది? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: అనుకోకుండా కలిసిన ఓ జంట.. పెళ్లితో ఒక్కటైన తరువాత వాళ్ల జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలతో రూపొందిన సినిమా ఇది. పెళ్లితో కలిసి జీవితం మొదలుపెట్టిన తరువాత ఒకరి గురించి మరొకరికి అన్నీ విషయాలు తెలిసిపోతాయి. ఆ తప్పొప్పులను అర్థం చేసుకుని ముందుకు సాగితే జీవితం బాగుంటుంది. ఆ రిలేషన్‌ నిలబడుతుంది ఈ నేపథ్యంలోనే కొనసాగే ఈ కథలో పెళ్లి తరువాత మది, రమ్యల మధ్య కొనసాగే క్యూట్‌ రొమాన్స్‌, ఒకరి గురించి మరొకరికి తెలిసిన నిజాలు.. ఆ తరువాత ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు అనేది ఈ సినిమా కథ. సరదాగా, ఆహ్లాదంగా కొనసాగే సన్నివేశాలతో ఫస్టాహాఫ్‌ సరదాగా కొనసాగుతుంది. 

పెళ్లి తరువాత జరిగే రొమాన్స్‌, ఆ తరువాత భర్త మీద కలిగే అనుమానం.. దాంతో తెలిసే నిజం.. ఇవన్నీ తొలిభాగంలో కీలకం. ఇక మది గురించి నిజం తెలిసిన తరువాత సెకండాఫ్‌లో హీరోయిన్‌ ఇచ్చే ట్విస్ట్‌ ఆడియన్స్‌తో పాటు సినిమాలో హీరోకి  కూడా షాకే. ఇక్కడే మనం ఓ కొత్తకథను చూస్తున్నామా.. అనే  భావన కలుగుతుంది. కానీ ఆ ఫీల్‌ ఎంతో సేపు ఉండదు. సినిమాలో  కొన్ని బ్యాంకు రాబరీ సన్నివేశాలు, మరికొన్నిసన్నివేశాల్లో దర్శకుడు పూర్తిగా లాజిక్‌ను వదిలేశాడు. 

సినిమా ప్రారంభంలో ఉన్న గ్రిప్‌ ఆద్యంతం కొనసాగించక లేకపోయాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ ఆశా మేరీ (సుమ కనకాల), సీఐ సంపత్‌ (వెన్నెల కిషోర్‌)ల మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్నీగా ఉంటాయి కానీ ఓ సినిమాలో సన్నివేశాల తరహాలో కాకుండా జబర్థస్త్‌ స్కిట్‌ల తరహాలో ఉంటాయి. అందువల్ల సుమ కనకాల పాత్ర అంతా గొప్పగా ఏమీ అనిపించదు. ఈ సినిమా కథాపరంగా కొత్తగా ఉన్నప్పటికి,దానిని కొత్తగా ప్రజెంట్‌ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. 


నటీనటుల పనితీరు: మధ్య తరగతి యువకుడిగా,భర్తగా ప్రియదర్శి నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆనందికి అభినయానికి ఆస్కారమున్న పాత్ర దొరికింది. తన పరిధి మేరకు ఆమె నటన బాగుంది. సుమ కనకాల పాత్ర టీవీ యాక్టర్‌గానే... స్కిట్‌ చేసిన ఫీలింగ్‌ కలిగింది. అంతే తప్ప నవ్యత ఏమీ లేదు. సిఐ వెన్నెల కిషోర్‌ నవ్వించే ప్రయత్నం చేశాడు,హైపర్‌ ఆది, రాంప్రసాద్‌ పాత్రలను వినోదం కోసం దర్శకుడు పూర్తిగా వాడుకోలేదు. అక్కడక్కడా అవుట్‌డేటెడ్‌ పంచ్‌లు మాత్రం వదిలారు. 

దర్శకుడు నవనీత్‌ శ్రీరామ్‌ కొత్త కథ ఎంచుకున్నప్పటికి, ఆ పాయింట్‌ డీల్‌ చేయడంలో తడబడ్డాడు. సినిమాలోని ట్విస్ట్‌లు రివీల్‌ అయిన తరువాత కథనం నడపడంలో విఫలమయ్యాడు. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. ముఖ్యంగా సినిమాలో ఎమోషన్‌ మిస్‌ అవ్వడమే పెద్ద మైనస్‌. భార్య భర్తల మధ్య ఉండే భావోద్వేగాలు, వారి మధ్య ఎమోషన్స్‌ మిస్‌ అయ్యాయి. విశ్వనాథ్‌ రెడ్డి సినిమాటోగ్రఫీతో ప్రతి ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. 

ఫైనల్‌గా: కథగా చెప్పుకుంటే కొత్తగా అనిపించే ఈ కాన్సెప్ట్‌ తెర మీదికి వచ్చేసరికి బలహీనమైన కథనంతో నీరసపడిపోయింది.