అల్లరి నరేశ్ .. హాస్య కథానాయకుడిగా చకచకా 50 సినిమాలకి పైగా చేసేసిన నటుడు. ఆ తరువాత విలక్షణమైన కథలను ఎంచుకుంటూ, తనలోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే '12 A రైల్వే కాలనీ'. 'పొలిమేర' ఫేమ్ అనిల్ విశ్వనాథ్ కథ - స్క్రీన్ ప్లే - సంభాషణలు సమకూర్చిన సినిమా ఇది. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది.

కథ: కార్తీక్ (అల్లరి నరేశ్) ఓ అనాథ. వరంగల్ కి చెందిన కార్తీక్ ఎక్కువగా స్నేహితులతోనే తిరుగుతూ ఉంటాడు. వాళ్ల వీధిలోకి కొత్తగా ఆరాధన (కామాక్షి భాస్కర్ల) దిగుతుంది. తన తల్లితో కలిసి ఆమె అక్కడ నివసిస్తూ ఉంటుంది. ఆరాధనను చూడగానే కార్తీక్ మనసు పారేసుకుంటాడు. 'బ్యాడ్మింటన్' అంటే ఆమెకి చాలా ఇష్టమనే విషయాన్ని అతను గమనిస్తాడు. ఆమె ఆశయం నెరవేరడానికి అవసరమైన 3 లక్షలను ఏర్పాటు చేయాలని అనుకుంటాడు. 

వరంగల్ లో రాజకీయనాయకుడిగా ఎదగడానికి 'టిల్లు' (జీవన్ కుమార్) ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ సారి ఎన్నికలలో తాను తప్పకుండా గెలవాలనే పట్టుదలతో ఉంటాడు. 'టిల్లు'తో ఉన్న పరిచయం కారణంగా 3 లక్షలు అడగడానికి కార్తీక్ అతని దగ్గరికి వెళతాడు. అతను కార్తీక్ కి ఒక పార్శిల్ ఇచ్చి, దానిని జాగ్రత్తగా దాచమని చెబుతాడు. అతనికి అవసరమైన డబ్బును తాను సర్దుబాటు చేస్తానని మాట ఇస్తాడు. దాంతో కార్తీక్ ఆ పార్శిల్ ను తీసుకుని వెళతాడు. 

ఆరాధన వాళ్ల ఇంటికి తరచూ షిండే (అనీశ్ కురువిల్లా) వచ్చి వెళుతుండటం కార్తీక్ చూస్తాడు. అతను ఆమె తండ్రి అయ్యుండొచ్చని అనుకుంటాడు. ఆ రోజున ఆరాధన వాళ్ల ఇంటికి తాళం వేసి ఉంటుంది. దాంతో 'టిల్లు' ఇచ్చిన పార్శిల్ ను  ఆరాధన ఇంట్లో రహస్యంగా దాచడం మంచిదని భావిస్తాడు. ఆ రాత్రి రహస్యంగా ఆ ఇంట్లోకి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ సంఘటన అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుంది? ఆరాధనతో షిండేకిగల సంబంధం ఏమిటి?కార్తీక్ కి 'టిల్లు' ఇచ్చిన పార్శిల్ లో ఏముంది?  అనేదే కథ.

విశ్లేషణ: అల్లరి నరేశ్ .. నిజంగానే తెరపై హాస్య కథానాయకుడిగా ఒక రేంజ్ లో అల్లరి చేస్తూ వెళ్లాడు. రాజేంద్రప్రసాద్ తరువాత పూర్తిస్థాయి హాస్య కథానాయకుడుగా తనదైన దూకుడు చూపించాడు. అయితే కామెడీ చేసి చేసి మొహం మొత్తేసింది అంటూ, తనకి మంచి పట్టున్న కామెడీని పక్కన పెట్టేసి, డిఫరెంట్ జోనర్స్ లో చేస్తూ వెళుతున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన చేసిన మరో ప్రయోగమే ఈ సినిమా.

హీరో .. ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ .. తాగుబోతు బ్యాచ్ గా పరిచయమవుతారు. మొదటి సీన్ లోనే హారర్ పాళ్లు కలుస్తున్నట్టుగా అనిపించడంతో, కొంపదీసి ఇది దెయ్యాల సినిమానా? అనే డౌట్ వస్తుంది. 'ఏదో ఊరికే అలా భయపెట్టడానికి ట్రై చేశారు .. అలాంటిదేం లేదులే ..' అనుకుంటూ రిలాక్స్ అయిన ఆడియన్స్ , ఇంటర్వెల్ బ్యాంగ్ చూసి ఇదెక్కడి గోలరా బాబు అనుకుంటూ ఉలిక్కిపడతారు. ఆ తరువాత వరంగల్ కథ .. హైదరాబాద్ మీదుగా 'ముంబై' కూడా వెళ్లొస్తుంది.                   

 సాధారణంగా ఏ సినిమాలోనైనా ఒక ట్విస్ట్ తో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఆ ట్విస్ట్ నుంచి సెకండాఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. అయితే ఆ ట్విస్ట్ అక్కడ ఉంది కదా .. అప్పటివరకూ వెయిట్ చేయండి అనడం కరెక్ట్ కాదు. సెకండాఫ్ లో బోలెడు విశేషాలు ఉన్నాయంటూ,  ఇంటర్వెల్ బ్యాంగ్ వరకూ ఫస్టాఫ్ ను లాగకూడదు. ఈ సినిమా  విషయంలో జరిగింది అదే. ఫస్టాఫ్ నీరసంగా .. నిదానంగా సాగుతుంది. సెకండాఫ్ లో కథ పట్టాలు తప్పేసి పరిగెడుతుంది. హింసతో కూడిన హారర్ టచ్ ఇస్తుంది. 

పనితీరు: దర్శకుడు ఎంచుకున్న లైన్ బాగానే ఉంది. నిజంగానే ఇలా జరిగిందంటూ తెరపైకి తీసుకొచ్చిన ఆధారాలు బాగానే ఉన్నాయి. అయితే అసలు విషయంలోకి వెళ్లడానికి తీసుకున్న సమయమే ఇక్కడ మైనస్. లవ్వు .. రొమాన్స్ సంగతి అలా ఉంచితే, అల్లరి నరేశ్ కి బలమున్న కామెడీ వైపు నుంచి కూడా సరైన సన్నివేశాలు డిజైన్ చేసుకోకపోవడం కూడా మరో లోపంగా అనిపిస్తుంది.

అల్లరి నరేశ్ కామెడీ మాత్రమే కాదు, ఎలాంటి పాత్రలనైనా బాగా చేయగలడు. ఆ విషయాన్ని ఇంతకుముందే అతను నిరూపించుకున్నాడు. అయితే వేరే జోనర్ కథలను ఎంచుకునేప్పుడు మాత్రం, గట్టి కసరత్తు జరిగేలా చూసుకోవలసిన అవసరం ఉంది. కామాక్షి భాస్కర్ల లుక్ అంత ఆకర్షణీయంగా అనిపించలేదు. హీరో ఫ్రెండ్స్ గా ముగ్గురు కమెడియన్స్ కనిపిస్తారు. కానీ వాళ్ల పాత్రల ద్వారా ఎలాంటి ప్రయోజనం కనిపించదు. ఎమోషన్స్ ఎక్కడా కనెక్ట్ కాలేదు .. సంభాషణాలు మనసుకు పట్టుకోలేదు. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ ఓకే. భీమ్స్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. 
 
ముగింపు: కథాకథనాల పరంగా దర్శకుడు ఫస్టాఫ్ ను .. సెకండాఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఫస్టాఫ్ ను ఇంటర్వెల్ బ్యాంగ్ వరకూ సాదాసీదాగా వదిలేసి, సెకండాఫ్ లో ట్విస్టులపై ట్విస్టులు ఇవ్వడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది. ఈ స్పీడ్ మీదే కథ అదుపుతప్పినట్టు అర్థమైపోతుంది.