తమిళంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఒక సిరీస్ రూపొందింది. టీనేజ్ లైఫ్ తో ముడిపెడుతూ,  బాస్కెట్ బాల్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ కి నరు నారాయణన్ దర్శకత్వం వహించాడు. సూర్య సేతుపతి కీలకమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ లో, శశికుమార్ .. రెజీనా .. ఆశా శరత్ .. ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సిరీస్ నుంచి ఈ రోజున 7 భాషాల్లో 3 ఎపిసోడ్స్ వదిలారు. కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: ప్రదీప్ కుమార్ టీనేజ్ లోకి అడుగుపెడతాడు. తండ్రి కథిర్ ఓ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. వాళ్లది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అయినా తన స్థాయికి మించి తండ్రి అతనిని చదివిస్తూ ఉంటాడు. ప్రదీప్ కుమార్ బాస్కెట్ బాల్ ప్లేయర్. జాతీయస్థాయిలో పేరు తీసుకురాగలిగిన ఆటగాడు అతను. ఈ విషయంలోను అతనికి తండ్రి నుంచి బలమైన మద్దతు ఉంటుంది. అయితే కొన్ని కారణాల వలన అతను తాను చదువుతున్న స్కూల్ నుంచి బయటకి రావలసి వస్తుంది. 

 తరువాత తనకి అందుబాటులో ఉన్న ఒక సాధారణ స్కూల్ లో చేరవలసి వస్తుంది. అది మాస్ ఏరియాలోని స్కూల్ కావడం వలన, అక్కడి స్టూడెంట్స్ చాలా రఫ్ గా ఉంటారు. స్కూల్ స్థాయిలోనే వాళ్లంతా మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారు. గ్రూపులు .. గ్రూపుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ స్కూల్ కి చాలా వరకూ చెడ్డపేరే ఉంటుంది. అలాంటి స్కూల్ ప్రాంగణంలో ప్రదీప్ అడుగుపెడతాడు. అతనికి అక్కడి వాతావరణం ఎంతమాత్రం నచ్చదు.

ప్రదీప్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అని వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్న పార్వతి (ఆశా శరత్)కి తెలుస్తుంది. అతని ద్వారా మిగతా కుర్రాళ్లకి బాస్కెట్ బాల్ పై ఆసక్తిని కలిగించి, ఒక మంచి బాస్కెట్ బాల్ టీమ్ ను రెడీ చేయడం వలన, తమ స్కూల్ కి మంచి పేరు వస్తుందని ఆమె భావిస్తుంది. ఆ దిశగా తనవంతు ప్రయత్నాలు మొదలెడుతుంది. ఎవరితోను ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని ప్రదీప్ ను హెచ్చరిస్తుంది. అయితే ఆ క్లాస్ కుర్రాళ్లు అతనిని రెచ్చగొడతారు. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ. 

విశ్లేషణ: టీనేజ్ లోకి అడుగుపెట్టిన తరువాత స్కూల్ వాతావారణం పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. ఒక వైపున పేరెంట్స్ కి .. మరో వైపున టీచర్స్ కి భయపడుతున్నట్టుగా నటిస్తూనే, తాము చేయవలసిన పనులు చేసేస్తూ ఉంటారు. ఈ వయసులో లవ్ .. ఫ్రెండ్షిప్ .. స్పోర్ట్స్ వారిపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అలాంటి దశలో ఉన్న ఓ కుర్రాడి చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఆశ .. ఆవేశం .. ఆశయం ఉన్న ఓ కుర్రాడితో ముడిపడిన కథ ఇది. 

టీనేజ్ లో ఇటు పిల్లలకు .. అటు వారి తల్లిదండ్రులకు ఒక రకమైన గందరగోళం ఉంటుంది. పిల్లలను ఎటువైపు నడిపించాలనే అయోమయంలో పేరెంట్స్, తాము ఏ దారిలో నడవాలో తేల్చుకోలేని స్థితిలో పిల్లలు ఉంటారు. ఈ సమయంలోనే స్నేహాలు .. ఆకర్షణలు వాళ్లను మరింత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి ఒక వాతావరణాన్ని సృష్టించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. 
                   
ఈ సమయంలో పిల్లలు రౌడీయిజాన్ని హీరోయిజంగా భావించి గొడవలకు సిద్దపడుతూ ఉంటారు. ఆటల్లో హీరోలుగా వెలగాలని అనుకుంటే మంచిదే. కానీ గొడవలలో హీరోగా నిలబడాలని అనుకుంటే మాత్రం భవిష్యత్తు దెబ్బతింటుందనే సందేశాన్ని ఇస్తూ ఈ కథ నడుస్తుంది. మొదటి మూడు ఎపిసోడ్స్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఇక మిగతా ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేది చూడాలి. 

పనితీరు:  బాస్కెట్ బాల్ ప్లేయర్ గా ఎదగాలని అనుకున్న ఒక టీనేజ్ కుర్రాడు, అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వలన మాస్ కుర్రాళ్ల మధ్య వచ్చిపడతాడు. ఒక ఆశయమనేది లేని ఆ కుర్రాళ్లలో అతను ఒకడిగా కలిసిపోతాడా? తన ఆశయం దిశగా వాళ్లందరినీ నడిపిస్తాడా? అనే ఒక లైన్ ను దర్శకుడు తయారు చేసుకున్న తీరు బాగుంది.

సీనియర్ ఆర్టిస్టుల నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. టీనేజ్ పిల్లలు మాత్రం చాలా సహజంగా నటించారు. జోసెఫ్ ఫొటోగ్రఫీ .. విశాల్ చంద్రశేఖర్ సంగీతం .. వెంకట్రామనన్ ఎడిటింగ్ ఫరవాలేదు అనిపిస్తాయి.        

ముగింపు: టీనేజ్ లో పిల్లలకు ఇంటి దగ్గర .. స్కూల్ క్యాంపస్ లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేక రకాల అలవాట్లు .. ఆకర్షణలు దాటుకుని వాళ్లు ముందుకు వెళ్లాలి అంటే ఏం చేయాలి? అనే ఒక ఆలోచనను రేకెత్తిస్తూ నడిచే సిరీస్ ఇది. మొదటి మూడు ఎపిసోడ్స్ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ, మిగతా ఎపిసోడ్స్ మరింత బెటర్ గా వుండే అవకాశం ఉంది.