ఓటీటీలలో కొరియన్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అందువల్లనే ఈ మధ్య కాలంలో వివిధ భాషలలోకి కొరియన్ కంటెంట్ దిగిపోతోంది. అలా లేటెస్ట్ గా ఓటీటీకి వచ్చిన కొరియన్  సినిమానే 'డార్క్ నన్స్'. వాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది జనవరి 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. ప్రస్తుతం 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేక్షకులను ఈ  సినిమా ఎంతవరకూ భయపెట్టిందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: సిస్టర్ జునియా .. సిస్టర్ మైకలా నన్స్ గా ఉంటారు. చర్చ్ నేపథ్యంలో వారి జీవితం కొనసాగుతూ ఉంటుంది. జునియాకి ఆత్మలు కనిపిస్తాయి. ఆత్మలతో మాట్లాడే శక్తి ఆమెకి ఉంటుంది. అందువలన ఎవరినైనా ప్రేతాత్మలు ఆవహిస్తే, వాటిని హెచ్చరించి పంపించేస్తూ ఉంటుంది. అయితే కొంతకాలంగా ఆమె కేన్సర్ తో పోరాడుతూ ఉంటుంది. ఇక మైకలాకు కూడా ఆత్మల విషయంలో అవగాహన ఉంటుంది. అందువలన వారి మధ్య స్నేహం కుదురుతుంది. 

జునియా ఎలాంటి పరిస్థితులలో ఉందనేది మైకలాకు తెలుసు. కాకపోతే ఆమె చర్చి ఫాదర్ 'పాలో'కి భయపడుతూ ఉంటుంది. అందుకు కారణం అతను దెయ్యాలను నమ్మకపోవడమే. మానసికపరమైన రుగ్మతలతో బాధపడేవారిని ఒక డాక్టర్ గా .. ఫాదర్ గా బయటపడేయడానికే తాను ప్రయత్నిస్తానని అతను అంటాడు. దుష్టశక్తుల పేరుతో పక్కదారి పట్టించడానికి తాను ఎంతమాత్రం ఒప్పుకోనని అతను తేల్చి చెబుతాడు.

ఈ నేపథ్యంలోనే 'హీ జూన్' అనే ఒక కుర్రాడిని దెయ్యం ఆవహిస్తుంది. ఆ ప్రేతాత్మను వదిలించడానికి ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ  నేపథ్యంలోనే ఆ కుర్రాడి తల్లి చర్చి హాస్పిటల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఆ కుర్రాడిని ఆవహించినది చాలా మొండి దెయ్యమని గ్రహించిన జునియా, మైకలా సాయంతో ఆ దెయ్యాన్ని వదిలించడానికి రంగంలోకి దిగుతుంది. ఫలితంగా ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? ఆ ప్రేతాత్మ ఎవరిది? దాని ఉద్దేశం ఏమిటి? అనేదే కథ.         

విశ్లేషణ: దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం కాస్త కష్టమైన విషయమే. బలహీనమైన మన మనసులో నుంచి .. భయంలో నుంచి పుట్టుకొచ్చేవే దెయ్యాలు అని కొందరు అంటారు. దెయ్యాలు ఉన్నాయంటూ కొంతమంది తమకి ఎదురైన అనుభవాలను గురించి చెబుతూ ఉంటారు. ఏదేమైనా దెయ్యం అనే నేపథ్యం చుట్టూ అల్లుకున్న సినిమాలు చూడటానికి ఆసక్తిని కనబరిచే ఆడియన్స్ కాస్త ఎక్కువ మందే ఉంటారు.

ఇద్దరు నన్స్ .. ఒక ఫాదర్ .. దెయ్యం ఆవహించబడిన కుర్రాడు. ఈ నాలుగు పాత్రలే ఈ సినిమాలో ప్రధానమైనవిగా కనిపిస్తాయి. కథ ఈ నాలుగు పాత్రల చూట్టూనే తిరుగుతూ ఉంటుంది. దెయ్యం ఏం చేయబోతోంది? నన్స్ దానిని ఎలా ఎదుర్కోబోతున్నారు? అనే విషయాన్ని తెలుసుకోవడానికే ప్రేక్షకులు ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటివారు చివరివరకూ వెయిట్ చేయవలసిందే. 

సాధారణంగా దెయ్యాలకు సంబంధించిన కథలలో కెమెరా వర్క్ ... నేపథ్య సంగీతం చాలావరకూ భయపెడుతూ ఉంటాయి. ఈ సినిమాలో అలాంటి హడావిడి చివర్లోనే కనిపిస్తుంది. అక్కడి వరకూ సంభాషణలతోనే సాగదీయడం బోర్ అనిపిస్తుంది. ప్రేతాత్మలకు సంబంధించి,  సౌత్ - నార్త్ కథలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఆ సినిమాల హాడావిడి చూసిన ప్రేక్షకులకు ఈ తరహా ట్రీట్మెంట్ నచ్చకపోవచ్చు.       
 
పనితీరు: ఈ కొరియన్ సినిమా ..  నిదానంగా మొదలవుతుంది .. నింపాదిగా నడుస్తుంది. కథలో కీలకమైన మలుపు ఎక్కడ ఉంటుంది? ఎక్కడి నుంచి కథ పుంజుకుంటుంది? అని ఎదురుచూసే ప్రేక్షకులను చాలాసేపు వెయిటింగులో పెట్టడమే దర్శకుడు చేసిన పొరపాటుగా అనిపిస్తుంది. ప్రేతాత్మ ఆవహించిన కుర్రాడికి తప్ప, నటించడానికి మిగతావారికి పెద్దగా అవకాశం లేదు కూడా. 

నార్త్ .. సౌత్ సినిమాలలో దెయ్యం కాన్సెప్ట్ తో కూడిన సినిమాలలో ఫొటోగ్రఫీ .. రీ రికార్డింగ్ ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. కానీ సహజత్వంలో భాగంగా, ఈ సినిమా విషయంలో వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ ఇవ్వలేదు. అందువలన దెయ్యాన్ని వదిలించే సన్నివేశం మనకు అంత ఎఫెక్టివ్ గా ఏమీ అనిపించదు. 

ముగింపు: దెయ్యం నేపథ్యంలో సాగే కథలలో, ప్రేతాత్మ ఎవరికి సంబంధించింది? ఎవరిని టార్గెట్ చేసి వచ్చింది? దానిని నియంత్రించే విధానం ఎలాంటిది? అనే విషయాలు ఉత్కంఠను రేకెత్తించడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ఆ విషయాలను చివర్లో రివీల్ చేయడం వలన కలిగే ప్రయోజనం తక్కువగా ఉంటుంది. ఇక్కడి హారర్ సినిమాల స్థాయిలో ఇది ప్రభావితం చేయలేకపోయినట్టుగా అనిపిస్తుంది.