అర్షద్ వార్సీ ప్రధానమైన పాత్రను పోషించిన క్రైమ్ థ్రిల్లర్ 'భగవత్ చాప్టర్ 1: రాక్షస్'. నేరుగా జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. జితేంద్ర కుమార్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, అక్షయ్ షేర్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 17వ తేదీన స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా, రీసెంటుగా తెలుగులోను  అందుబాటులోకి వచ్చింది. జియో స్టూడియో - బవేజా స్టూడియో నిర్మించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: పోలీస్ ఆఫీసర్ విశ్వాస్ భగవత్ కి 'లక్నో' నుంచి 'రాబర్ట్స్ గంజ్'కి బదిలీ అవుతుంది. భగవత్ తీరు పైఅధికారులకు నచ్చకపోవడంతో ఆయనకి ఈ బదిలీ జరుగుతుంది. భగవత్ తన భార్యాబిడ్డలతో కలిసి 'రాబర్ట్స్ గంజ్'కి మకాం మారుస్తాడు. అప్పటికి అక్కడి పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. పూనమ్ అనే అమ్మాయి అదృశ్యం కావడం .. ఆ గొడవలోకి రాజకీయ నాయకులు అడుగుపెట్టడమే అందుకు కారణమని అతను తెలుసుకుంటాడు.

పూనమ్ విషయంలో విచారణ మొదలుపెట్టిన భగవత్ కీ, కౌసల్య .. సంధ్య .. మాలతి .. పూజ .. ఇలా 19 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారనే విషయం తెలుస్తుంది. టీనేజ్ అమ్మాయిలు .. పెళ్లికాని యువతులు మాత్రమే అదృశ్యం కావడం అతను గమనిస్తాడు. అయితే వాళ్లంతా ప్రేమించిన వ్యక్తితో పారిపోయారనే ప్రచారం ఆ ఊళ్లో జరుగుతూ ఉండటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ విచారణలో ఆయన మరింత ముందుకు వెళతాడు. 

కనిపించకుండా పోయిన అమ్మాయిలు వేశ్యా గృహాలకు తరలించబడుతున్నారా? అనే అనుమానంతో ఆ దిశగా తన ఇన్వెస్టిగేషన్ ను కొనసాగిస్తాడు. అయితే అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు అతనికి లభించవు. ఆ సమయంలోనే అతనికి సమీర్ అనే ఒక వ్యక్తిపై సందేశం కలుగుతుంది. సమీర్ ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? అదృశ్యమైపోయిన అమ్మాయిలంతా ఏమవుతున్నారు? అనేది మిగతా కథ.

విశ్లేషణ: ఆడపిల్లలు గడప దాటితే తిరిగి వచ్చేవరకూ తల్లిదండ్రులు టెన్షన్ పడే రోజులు ఇవి. ఇక నగరాలలో నివసించే తల్లిదండ్రులలో ఆందోళన మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అరాచక శక్తుల తీవ్రత ఎక్కువ. తప్పించుకునే మార్గాలు ఎక్కువ. అందువలన 'వల' విసిరే దుర్మార్గులను కనిపెట్టడం కష్టం. అలాంటి ఓ దుర్మార్గుడి చుట్టూ తిరిగే ఈ కథను దర్శకుడు తయారు చేసుకున్న విధానం ఆసక్తికరంగా ఉంటుంది. 

యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించడం వలన, సాధ్యమైనంత సహజత్వానికి దగ్గరగా దర్శకుడు ఈ కథను ఆవిష్కరించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. సాధారణంగా కిడ్నాపర్లు ఒక గ్యాంగ్ గా రంగంలోకి దిగితే పోలీసులకు కాస్త సుళువే అవుతుంది. అయితే ఆ కిడ్నాపర్ ఒక 'సైకో' అయితే పట్టుకోవడం ఎంత కష్టమవుతుందనే విషయాన్ని దర్శకుడు చూపించిన విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ఇక పోలీస్ కథల్లో సాధ్యమైనంత వరకూ ఒక రకమైన హడావిడి కనిపిస్తుంది. ఛేజింగ్ లు .. కాల్పులు .. ఫైట్లు గట్రా కంగారు పెట్టేస్తూ ఉంటాయి. కానీ ఈ కథలో అలాంటి ఉరుకులు పరుగులు కనిపించవు. నిదానంగా ఆలోచన చేస్తూ .. తెలివిగా పావులు కదపడం కొత్తగా అనిపిస్తుంది. 'సైకో'లు మన మధ్యలోనే ఉన్నారనే విషయాన్ని హెచ్చరిస్తుంది.

పనితీరు: సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ లు .. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథల్లో అసలు పాత్రను వదిలేసి చుట్టూ ఉన్న పాత్రలపై అనుమానాన్ని కలిగిస్తూ వెళుతుంటారు. అలాంటి పద్ధతులను పక్కన పెట్టేసి దర్శకుడు ఈ కథను చాలా నీట్ గా చెబుతూ వెళ్లాడు. అందువలన  ఈ కథ మన ముందు జరుగుతున్నట్టుగా ఉంటుంది. 

అమోఘ్ దేశ్ పాండే కెమెరా పనితనం .. హేమల్ కొఠారి ఎడిటింగ్ తో పాటు, నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా, ఈ కథను సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్లడానికి తమవంతు ప్రయత్నం చేశారు. 

ముగింపు: యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను, సహజత్వానికి దగ్గరగా ఉండేలా దర్శకుడు చూసుకున్నాడు. నేరస్థుడు ఎలా ప్లాన్ చేశాడు అనే విషయాలపై కంటే కూడా, ఇన్వెస్టిగేషన్ వైపు నుంచి ఈ కథను నడిపించాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ను ఇష్టపడేవారు ఈ సినిమాను చూడొచ్చు.