తెలుగులో పలు చిత్రాల్లో నటించినా అనీష్‌కు టాలీవుడ్‌లో సక్సెస్‌ దక్కలేదు. అయితే కన్నడ సినీ పరిశ్రమలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు హీరో ఈ సారి తెలుగు, కన్నడ భాషల్లో 'లవ్‌ ఓటీపీ' పేరుతో ఓ ద్విభాషా చిత్రాన్ని హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించాడు. ఈ చిత్రం ఎలా ఉంది? అనీష్‌కు తెలుగులో 'లవ్‌ ఓటీపీ'తో హిట్‌ వచ్చిందా? లేదా అనేది  సమీక్షలో తెలుసుకుందాం.

కథ: కాలేజీ టీమ్‌ తరపున క్రికెట్‌ ఆడుతూ ఉండే అక్షయ్‌ (అనీష్‌) ఎప్పటికైనా రంజీ ప్లేయర్‌గా ఆడాలని ప్రయత్నిస్తుంటాడు. కాలేజీలో అనీష్‌ను చూసిన సన (ఆరోహి నారాయణ్‌) ప్రేమలో పడుతుంది. అక్షయ్‌తో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ అక్షయ్‌ తండ్రి (రాజీవ్‌ కనకాల)కి ప్రేమ అంటే అస్సలు పడదు. తండ్రికి భయపడి అక్షయ్‌ ప్రేమించడానికి జంకుతాడు. అయితే తనను ప్రేమించకపోతే చనిపోతానని సన బెదిరించడంతో తప్పక లవ్‌ చేయాల్సి వస్తుంది. 

తనకు ఇష్టం లేకపోయినా సన పెట్టే మానసిక ఒత్తిడిని తట్టుకుంటూ ఇష్టం లేకుండా ప్రేమిస్తుంటాడు. ఈ తరుణంలోనే ఫిజియోథెరపిస్ట్‌ నక్షత్ర (జాన్విక) పరిచయం అవుతుంది. అక్షయ్‌ ఆమె ప్రేమలో పడతాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఇక అక్షయ్‌, సనల ప్రేమ నక్షత్రకు తెలుస్తుందా? అక్షయ్‌ తండ్రికి ఈ ప్రేమ గురించి తెలిసినప్పుడు ఎలా రియాక్ట్‌ అయ్యాడు?  చివరకు అక్షయ్‌ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మిగతా కథ 

విశ్లేషణ:  ఇదొక ముక్కోణపు ప్రేమకథ. ఈ ప్రేమకథకు వినోదాన్ని జోడించి తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. గర్ల్‌ఫ్రెండ్‌ టార్చర్‌ చేస్తే ఎలా ఉంటుది అనేది గతంలో మనం పలు సినిమాల్లో చూశాం. ఈ చిత్రంలో సన క్యారెక్టర్‌ ఇటీవల విడుదలైన కెర్యాంప్‌ సినిమాలో హీరోయిన్‌ పాత్రను పోలీ ఉంటుంది. ఆమె అక్షయ్‌ని పెట్టే టార్చర్‌ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. ఫస్టాఫ్‌ చాలా సరదాగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. ప్రతి సన్నివేశాన్ని ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసే విధంగా ఉంటుంది. తొలిభాగం ముగియగానే రెండోభాగాన్ని దర్శకుడు ఎలా హ్యాండిల్‌ చేస్తాడో అనే క్యూరియాసిటీ అందరిలో కలుగుతుంది. 

అందరూ ఊహించినట్టుగానే సెకండాఫ్‌ కాస్త సాగతీతగా స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌ హ్యాండిల్‌ చేసినంత ఈజీగా సెకండాఫ్‌ను డీల్‌ చేయాలేక పోయాడు. ద్వితీయర్థానికి సరైన ముగింపు  ఇచ్చి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఇలాంటి కథలను డీల్‌ చేయడం ప్రేక్షకుల మెప్పు పొందటం అంత ఈజీ కాదు. అయితే ఈ విషయంలో దర్శకుడు అనీష్‌ పూర్తిగా సక్సెస్‌ కాలేక పోయినా ఎవరినీ డిజప్పాయింట్‌ మాత్రం చేయడు. ప్రతి సన్నివేశంలో కొత్తదనం కోసం ప్రయత్నించాడు. ఆడియన్స్‌కు భిన్నమైన అనుభూతిని ఇవ్వాలనే ఆయన ప్రయత్నం ప్రశంసనీయం. 

నటీనటుల పనితీరు: అక్షయ్‌గా అనీష్‌ నటన, సంభాషణలు పలికే తీరు అలరిస్తుంది. అయితే ఎమోషన్స్‌ సన్నివేశాల్లో ఇంకాస్త బెటర్‌మెంట్‌ కావాల్సిన అవసరం ఉంది. సనగా ఆరోహి నారాయణ, నక్షత్రగా జాన్వికలు తమ పరిధి మేరకు నటించారు. రాజీవ్‌ కనకాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆయన పాత్ర,నటన సినిమాకు బిగ్గెస్ట్‌ ప్లస్‌ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమాకు పాటలు మైనస్‌. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. అనీష్‌ స్క్రీన్‌ప్లే విషయంలో మరింత వర్క్‌ చేసి ఉంటే బాగుండేది. 

తన పాత్ర మీద పెట్టిన ఫోకస్‌ మిగతా పాత్రలపై పెడితే బాగుండేది. అయితే ఓ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీకి ఆయన రాసుకున్న సన్నివేశాలు యువతను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. లవ్‌లో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిల విషయంలో ఎలాంటి టార్చర్‌ అనుభవిస్తున్నారో ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపిన విధానం బాగుంది. టోటల్‌గా అనీష్‌ హీరోగా, దర్శకుడిగా డిస్టింక్షన్‌లో పాస్‌ కాకపోయినా  మంచి మార్కులే సంపాందించుకున్నాడు. 

ఫైనల్‌గా: ఈ లవ్‌ ఓటీపీ విభిన్న ప్రేమకథలు ఇష్టపడే వారికి టైమ్‌ పాస్‌ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తుంది.