దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'కాంత'. సెల్వమణి సెల్వ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. మలయాళం వైపు నుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన హీరో దుల్కర్ సల్మాన్. వరుస హిట్స్ తో ఉన్న దుల్కర్ నుంచి వచ్చిన సినిమా ఇది. ఇక సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే కి దుల్కర్ జోడీగా ఛాన్స్ తెచ్చిపెట్టిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఈ కథ 1950లలో .. మద్రాస్ నేపథ్యంలో నడుస్తుంది. సినిమా దర్శకుడిగా 'అయ్య' (సముద్రఖని)కి గతంలో మంచి పేరు ఉంటుంది. 12 ఏళ్ల కృతం ఆగిపోయిన ఒక సినిమాను ఆయన ఇప్పుడు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంటాడు. 12 ఏళ్ల క్రితం మహదేవన్ (దుల్కర్ సల్మాన్)ను హీరోగా పెట్టి ఆయన తన తల్లి పేరుతో 'శాంత' అనే ఒక సినిమా చేయాలనుకుంటాడు. అయితే ఆ సినిమా కొంత షూట్ జరుపుకున్న తరువాత ఆగిపోతుంది. అలా ఆగిపోయిన సినిమానే ఇప్పుడు అతను పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంటాడు. 

హీరోగా మహదేవన్ మళ్లీ చేయడానికి ఒప్పుకుంటాడు. హీరోయిన్ గా 'బర్మా'కి చెందిన కుమారి( భాగ్యశ్రీ బోర్సే)ని 'అయ్య' రంగంలోకి దింపుతాడు. షూటింగు సమయంలో మహదేవన్ .. దర్శకుడు ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు కోపంగా ఉండటాన్ని కుమారి చూస్తుంది. కారణం అడిగితే ఇద్దరూ చెప్పరు. కథ .. 'అయ్య' దైరెక్షన్ నచ్చకపోవడంతో, తానే మార్పులు చేసుకుంటూ మహదేవన్ లాగించేస్తూ ఉంటాడు. తన తల్లి పేరుతో తీస్తున్న సినిమాను టైటిల్ తో సహా  మార్చడం దర్శకుడికి ఎంతమాత్రం నచ్చదు. 

ఇక మహదేవన్ తో కుమారికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. వారి ప్రేమ .. పెళ్లి వరకూ వెళుతుంది. ఈ వ్యవహారం కూడా 'అయ్య'కి ఎంతమాత్రం నచ్చదు. ఇక కొత్తగా హీరోయిన్ గా పరిచయం కానున్న కుమారితో మహదేవన్ చనువుగా ఉండటం ఆయన భార్య 'దేవి'కి కూడా ఎంతమాత్రం నచ్చదు. ఈ విషయం మహదేవన్ మామగారి వరకూ వెళుతుంది. ఫలితంగా కుమారికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? మహదేవన్ తో ఆమె పెళ్లి జరుగుతుందా? అసలు మహదేవన్ కీ .. దర్శకుడికి మధ్య గొడవేంటి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ
: ఇది 1950లలో .. మద్రాస్ లో ఒక సినిమా స్టూడియో చుట్టూ తిరిగే కథ. ఒక దర్శకుడు .. హీరో .. హీరోయిన్ చుట్టూ తిరిగే కథ. ఈ కథలో .. హీరోను తెరకి పరిచయం చేసిన దర్శకుడే, హీరోయిన్ గా ఓ యువతిని పరిచయం చేయాలనుకుంటాడు. తాను మొదటిసారిగా ఛాన్స్ ఇచ్చిన హీరో జోడీగానే ఆమెను తెరపై చూపించాలని అనుకుంటాడు. అలా ఒక సినిమా ఈ ముగ్గురి జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం.

సినిమా మొదలైన దగ్గర నుంచి, అసలు హీరోగారికీ .. దర్శకుడికి మధ్య గొడవేంటి అనే సందేహం మనలను వెంటాడుతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కి సంబంధించిన సస్పెన్స్ సెకండాఫ్ లో మన ఆలోచనలను అనేక మలుపులు తిప్పుతూ ఉంటుంది. చివరికి వచ్చేసరికి ఒక ట్విస్ట్. ఈ ట్విస్ట్ ఎలా ఉంటుంది? అంటే బాగానే ఉంటుంది. కాకపోతే అక్కడివరకూ ఆడియన్స్ అలా వెయిట్ చేస్తూ కూర్చోవడమే కష్టం. 

తెరపై కథకు దర్శకుడు 'శాంత' అని టైటిల్ పెట్టుకున్నా, హీరో వచ్చి దానిని 'కాంత'గా మార్చినా ఆడియన్స్ కి ఒరిగిదేమీ లేదు. 1950ల నాటి నేపథ్యాన్ని ఎంచుకున్నారు గాబట్టి, అవుట్ డోర్ కి వస్తే ఇబ్బందే. అందువల్లనే ఫస్టాఫ్ ను.. సెకాండాఫ్ ను స్టూడియోకే పరిమితం చేశారు. షూటింగు హడావిడితో ఫస్టాఫ్ ను ..  పోలీస్ ఆఫీసర్ గా రానా హడావిడితో సెకండాఫ్ ను సాగదీయడం వలన ఆడియన్స్ కి కొంత ఇబ్బంది అయితే కలుగుతుంది. 

పనితీరు: దర్శకుడు తయారు చేసుకున్న ఈ కథ బాగానే ఉంది. కాకపోతే ఇది 'స్టేజ్ ప్లే'కి బాగుటుంది. కథగా చదువుకోవడానికి బాగుంటుంది. కానీ ఇలా సాగదీయడానికి ప్రయత్నిస్తే అసహనమే కలుగుతుంది. 12 ఏళ్ల క్రితం విడిపోయిన హీరో - దర్శకుడు, అదే పంతం ..  పట్టింపుతో ఉన్నప్పుడు కలిసి పనిచేయడానికి ఎలా ఒప్పుకుంటారు? అనే ఒక సందేహం ప్రేక్షకులలో అలాగే ఉండిపోతుంది. 

దుల్కర్ సల్మాన్ .. సముద్రఖని నటనకు వంక బెట్టవలసిన పనిలేదు. భాగ్యశ్రీ అందంగా మెరిసింది. పోలీస్ ఆఫీసర్ గా రానా తన మార్క్ సందడి చూపించాడు. ఇక మిగతా పాత్రలన్నీ ఇలా వచ్చి అలా పోయేవే. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ విషయానికి వస్తే,  ఫరవాలేదనిపిస్తాయి. 'ఒక్క అబద్ధం ఎన్నో నిజాలు తెలిసేలా చేస్తుంది' .. 'నాకు మీరిచ్చింది అవకాశమే .. జీవితం కాదు' వంటి కొన్ని డైలాగ్స్ బాగున్నాయి.  

ముగింపు: నిజానికి 'కాంత' అనేది చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్. 1950ల నాటి నేపథ్యం కూడా ఆసక్తిని కలిగించేదే. అయితే ఒకే సెట్లో .. నాలుగు గోడల మధ్య ఈ కథను నడిపించడం .. పదే పదే షూటింగు హడావుడి చూపించడం విసుగు తెప్పిస్తుంది. టైటిల్ పరంగా కుతూహలాన్ని రేకెత్తించిన ఈ సినిమా, కంటెంట్ పరంగా ఆశించినస్థాయి వినోదాన్ని అందించలేకపోయిందనే చెప్పాలి.