ఇన్ పెర్టిలిటీ అనే సెన్సిటివ్ ఇష్యూకు ఎంటర్టైన్మెంట్ను జోడించి రూపొందించిన చిత్రం 'సంతాన ప్రాప్తిరస్తు'. ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రంలో ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? ఇలాంటి సున్నితమైన అంశాన్ని ఎవరి మనోభావాలు గాయపరచకుండా ఈ దర్శకుడు ఎలా తెరకెక్కించారు? ఈ సినిమాతో హీరో విక్రాంత్‌కు హిట్ వచ్చిందా? లేదా ఈ సమీక్షలో తెలుసుకుందాం.
కథ: చైతూ అలియాస్ చైతన్య (విక్రాంత్) చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంటాడు.సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ బ్యాచ్‌లర్‌గా, ఒంటరిగా ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌కు పరీక్ష రాయడానికి వచ్చిన కల్యాణి ( చాందిని చౌదరి)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. వరంగల్‌లో ఉండే కల్యాణి కోసం వరంగల్ వెళ్లి ఆమెకు తన ప్రేమను తెలియజేయాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు. మొదట్లో కల్యాణి ఇష్టపడక పోయినా, అతని మనస్తత్వం నచ్చి తండ్రి ఈశ్వరరావు (మురళీధర్ గౌడ్)ను ఎదిరించి, ఆయనకు ఇష్టం లేకపోయినా చైతూను పెళ్లి చేసుకుంటుంది.
అయితే పెళ్లి తరువాత ఓ బిడ్డను కనేసి తండ్రి చేతిలో పెడితే అన్ని సమస్యలు పోతాయని భావిస్తుంది కల్యాణి. కానీ పిల్లల విషయంలో ఈ జంట చేసే అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. పిల్లల కోసం వైద్యురాలిని సంప్రదించి కొన్ని పరీక్షలు చేయించుకోగా, చైతన్యకు ఓ సమస్య ఉందని బయటపడుతుంది. ఆ సమస్య ఏమిటి? ఈ సమస్య వల్ల అతను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చైతూ నుంచి తన కూతురిని విడదీసి, మరో పెళ్లి చేయాలనుకున్న కల్యాణి తండ్రి ఆశలు ఫలించాయా? చివరికి చైతన్య, కల్యాణిలు తల్లిదండ్రులు కాగలిగారా? ఈ కథకు జాక్ రెడ్డి (తరుణ్ భాస్కర్)కు సంబంధం ఏమిటి? భ్రమరంగా వెన్నల కిషోర్ ఎలాంటి వినోదాన్ని అందించాడు అనేది మిగతా కథ
విశ్లేషణ: ప్రస్తుతం సమాజంలో యువత ఎదుర్కొంటున్న సంతానలేమి సమస్య చుట్టు అల్లుకున్న కథ ఇది. ఇలాంటి ఓ సున్నితమైన సమస్య చుట్టు వినోదాన్ని జోడించి దర్శకుడు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి కథలో తప్పకుండా బోల్డ్ సన్నివేశాలు యాడ్ చేయడం తప్పనిసరి. ఈ సినిమాలో కూడా అలాంటి సన్నివేశాలు, సంభాషణలు ఉన్నా కూడా అవి ఎక్కడా శృతిమించక పోవడం ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్. అయితే ఇలాంటి కథాంశంకు హిలేరియస్ ఫన్ అవసరం, దర్శకుడు ఈ సినిమాలో వినోదం నవ్వించే ప్రయత్నం చేసినా అది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు.
తండ్రి, కూతుళ్ల మధ్య భావోద్వేగాలను పండించడంలో తడబడ్డాడు. తండ్రి, కూతుళ్ల ఎమోషన్‌ను మరింత బలంగా రాసుకుని ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. ఎంటర్టైన్మెంట్ డోస్‌ను పెంచితే సినిమా స్పీడుగా అనిపించేంది. ప్రథమార్థం పర్వాలేదనిపించినా, సెకండాఫ్ వినోదం అలరిస్తుంది. ముఖ్యంగా భ్రమరం పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పూయించాడు. అయితే హీరోకు, కథానాయిక తండ్రికి మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త అసహనానికి గురిచేస్తాయి. ఆ సన్నివేశాలు సినిమాలో సాగతీతగా అనిపిస్తాయి. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ విషయంలో రచనా పరంగా మరింత పదును పెడితే బాగుండేది అనిపిస్తుంది.
నటీనటుల పనితీరు: చైతన్య పాత్రలో విక్రాంత్ నటన పర్వాలేదనిపిస్తుంది. ఎమోషన్ పండించే సన్నివేశాల్లో నటనలో తడబడినట్లు కనిపిస్తుంది. కల్యాణిగా చాందిని చౌదరి ఆమె పాత్ర పరిధి మేరకు నటించారు. కథానాయిక తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ మెప్పిస్తాడు. అభినవ్ గోమఠం పాత్ర సినిమాను స్పీడ్‌గా ముందుకు నడిపించడంలో ఉపయోగపడింది. డాక్టర్ భ్రమరంగా వెన్నెల కిషోర్ వినోదాన్ని అందించాడు.
ఫైనల్‌గా: ఇన్ ఫెర్టిలిటీ అనే సెన్సిటివ్ ఇష్యూకు వినోదాన్ని జోడించి ప్రేక్షకులను అలరించడంలో 'సంతాన ప్రాప్తిరస్తు' టీమ్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులకు 'సంతాన ప్రాప్తిరస్తు' మంచి టైమ్ పాస్ ఎంటర్టైనర్గా అనిపిస్తుంది.
'సంతాన ప్రాప్తిరస్తు' మూవీ రివ్యూ
Santhana Prapthirasthu Review
- సంతానలేమి సమస్య చుట్టు అల్లుకున్న కథ
- అలరించే వినోదం
- కొరవడిన భావోద్వేగాలు
- టైమ్ పాస్ ఎంటర్టైనర్
Movie Details
Movie Name: Santhana Prapthirasthu
Release Date: 2025-11-14
Cast: Vikranth, Chandini Chowdary, Vennela Kishore, Tharun Bhascker, Abhinav Gomatam, Muralidhar Goud, Harshavardhan, Bindu Chandramouli, Jeevan Kumar, Satya Krishna, Tagubothu Ramesh, Abhay Bethiganti, Kireeti, Anil Geela, Saddam, Riaz
Director: Sanjeev Reddy
Music: Sunil Kashyap
Banner: Madhura Entertainment, Nirvi Arts
Review By: Maduri Madhu
Trailer