రవిబాబు నటుడిగా  .. దర్శకుడిగా కూడా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. విలక్షణమైన నటుడిగా .. విభిన్నమైన చిత్రాల దర్శకుడిగా ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందినదే 'ఏనుగుతొండం ఘటికాచలం'. ఆయనే నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: ఘటికాచలం (నరేశ్) 65 ఏళ్లకి దగ్గరలో ఉంటాడు. భార్య దుర్గా (రాజ్యలక్ష్మి)ని కోల్పోయిన ఆయన, తన కొడుకులు .. కోడళ్లతో కలిసి హైదరాబాదులో నివసిస్తూ ఉంటాడు. పెద్ద కొడుకు అరుణాచలం (గిరిధర్) పెద్ద కోడలు దేవి (ప్రశాంతి) చిన్న కొడుకు భద్రాచలం (విజయ్ భాస్కర్) చిన్నకోడలు రాణి (శిరీష) ఒకే ఇంట్లో ఉంటూ ఉంటారు. కొడుకులిద్దరూ ఎలాంటి ఉద్యోగం చేయకపోవడంతో, ఘటికాచలానికి ప్రతి నెలా వచ్చే 'పెన్షన్' పైనే ఇల్లు నడుస్తూ ఉంటుంది.

ఘటికాచలానికి ఆ ఇంట్లో ఎలాంటి ప్రేమానురాగాలు .. గౌరవ మర్యాదలు ఉండవు. ఆయన పెన్షన్ తోనే తప్ప, ఆయనతో ఎవరికీ పనుండదు. ఒంటరితనంతో బాధపడుతున్న ఆయన, తనకి ఓ తోడు అవసరమని భావిస్తాడు. పనిమనిషిగా ఉన్న భవాని (వర్షిణి) మాత్రమే తనని కాస్త పట్టించుకోవడం ఆయనకు ఊరట కలిగిస్తుంది. దాంతో ఆ ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా, ఆయన భవానిని వివాహం చేసుకుంటాడు. 

ఇకపై 'పెన్షన్ కూడా భవానియే తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటి అనే ఆలోచన మిగతా వాళ్లకు ఆందోళన కలిగిస్తుంది. ఘటికాచలంతో ఇన్సూరెన్స్ చేయించి, ఆయనను చంపేయాలని నిర్ణయించుకుంటారు. భవానితో పెళ్లి రిజిస్టర్ కాలేదు గనుక, ఆమెను తేలికగానే వెళ్లగొట్టొచ్చని అనుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? వాళ్లు తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా .. ఎటువంటి కష్టం తెలియకుండా పెంచుతుంటారు. అందుకోసం ఎన్నో కష్టాలను ఆనందంగా భరిస్తుంటారు. అయితే ఆ తల్లిదండ్రులలో ఎవరు తోడును కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయినా, ఆ బాధను ఇతర కుటుంబ సభ్యులెవరూ అర్థం చేసుకోరు. తమ సుఖాల కోసం పెద్ద దిక్కును కూడా అడ్డు తప్పించుకోవాలనే ఆలోచన చేస్తారు. అలాంటి ఒక కుటుంబం చుట్టూ తిరిగే ఈ కథను రవిబాబు ఆసక్తికరంగా ఆవిష్కరించాడు.

చాలా తక్కువ పాత్రలతో రవిబాబు ఈ కథను రాసుకున్నాడు. అయితే అనవసరంగా ఏ పాత్ర కనిపించదు. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత .. ప్రయోజనం ఉంటాయి. పిల్లలపై ప్రేమ .. డబ్బు పట్ల ఆశ .. పరస్త్రీల పట్ల వ్యామోహం అనే బలహీనతల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఆయా బలహీనతల వెంట పరిగెత్తే ఆ పాత్రలు సరదాగా నవ్వులు పూయిస్తూ ఉంటాయి. అలీ .. చిత్రం శ్రీను .. రఘుబాబు పోషించిన అతిథి పాత్రలు కూడా సందర్భానుసారం సందడి చేస్తాయి.

జీవితంలో ప్రతి ఒక్కరికీ అవసరాలు ఉంటాయి .. ఆశలు ఉంటాయి ... సమస్యలు ఉంటాయి .. వ్యామోహాలు ఉంటాయి. అయితే చివరికి వచ్చేసరికి వాటన్నిటికీ కావలసిందే డబ్బే. ఆ డబ్బు కోసం మనుషులు ఎలా మారిపోతారనేది రవిబాబు ఈ చిన్న కథలోనే ఇంట్రెస్టింగ్ గా చెప్పాడు. సహజత్వానికి దగ్గరగా ఆయన డ్రామాను నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. 

పనితీరు: ఒక చిన్న సినిమా ద్వారా బలమైన కంటెంట్ ను ఆవిష్కరించడంలో రవిబాబుకి మంచి నైపుణ్యం ఉంది. ఆయన గత చిత్రాలే అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. అదే విషయాన్ని మరోసారి నిరూపించేదిగా ఈ సినిమా కనిపిస్తుంది. చాలా నీట్ గా .. కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా చూసేలా ఆయన ఈ సినిమాను రూపొందించిన తీరు మెప్పిస్తుంది. 

ఇక ఈ సినిమాలో నరేశ్ మొదలు వాసు ఇంటూరి .. శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులంతా చాలా బాగా చేశారు. చరణ్ మాధవన్ ఫొటోగ్రఫీ .. సత్యనారాయణ భల్లా ఎడిటింగ్ .. రాజేశ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచాయి.      
              
ముగింపు: పరిమితమైన పాత్రలతో .. ఒక చిన్న ఇంట్లో జరిగే చిన్న డ్రామా ఇది. మొదలైన దగ్గర నుంచి చివరివరకూ సందడిగా సాగుతుంది. ఎక్కడా బోర్ అనిపించదు. వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే ఈ సినిమా, ఫైనల్ ట్విస్ట్ తో మరిన్ని మార్కులు కొట్టేస్తుంది.