అమెజాన్ ప్రైమ్ లో బ్రిటీష్ హారర్ మూవీ 'బాంబి: ది రెకనింగ్' ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. హారర్ సినిమాలను ఇష్టపడేవారికి సైతం ఈ సినిమా చెమటలు పట్టిస్తోంది. డాన్ అలెన్ దర్శత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది జులై 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. 1923లో రాయబడిన 'బాంబి ఎ లైఫ్ ఇన్ ది వుడ్స్' అనే నవల ఆధారంగా నిర్మితమైన ఈ సినిమా, ఆగస్టు 29వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోను ఈ సినిమా అందుబాటులో ఉంది.  

కథ: జానా ఆమె కొడుకు బెంజి ఒక రాత్రివేళ ఒక అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. కొంతకాలంగా తమకి దూరంగా ఉంటున్న భర్త సైమన్ దగ్గరికి కొడుకును తీసుకుని ఆమె వెళుతూ ఉంటుంది. మార్గ మధ్యంలో వాళ్ల కారును ఒక 'దుప్పి' వెంటాడుతుంది. కారు డ్రైవర్ ను ఆ దుప్పి చంపేస్తుంది. ఒక దుప్పి అంత క్రూరంగా అరవడం .. ప్రవర్తించడం వాళ్లు చూడటం అదే మొదటిసారి. అతి కష్టం మీద ఆ తల్లీ కొడుకులు తప్పించుకుని, సైమన్ తల్లి మేరీ ఇంటికి చేరుకుంటారు. 

సైమన్ తల్లి మేరీకి అడవిలో తిరుగుతున్న ఆ భయంకరమైన దుప్పిని గురించి తెలుసు. అందువలన ఆమె ఆ ఇంట్లో ఎంతో భయంతో బ్రతుకుతూ ఉంటుంది. రాక్షస మృగంలా మారిన ఆ దుప్పి ఆ ఇంటిపై ఎప్పుడు దాడి చేస్తుందో అనే భయంతో ఆమె కాలం గడుపుతూ ఉంటుంది. ఆమె ఆ దుప్పి బొమ్మలు గీస్తూ .. ఇంట్లోవారిని హెచ్చరిస్తూ ఉంటుంది. ఒక రాత్రి వేళ ఆ దుప్పి వాళ్ల ఇంటిపై దాడి చేస్తుంది.

ఆ దుప్పి బారి నుంచి తప్పించుకుని ఆ ఇంట్లో నుంచి వాళ్లు బయటపడతారు. సాధ్యమైనంత త్వరలో ఆ అడవిలో నుంచి బయటపడాలనే ఉద్దేశంతో వ్యానులో బయల్దేరతారు. అయితే ఆ దుప్పి వదలకుండా వాళ్ల వెంటపడుతుంది. ఆ దుప్పి ఎందుకు అంత క్రూరంగా మారిపోయింది? మనుషులను ఎందుకు అంతలా వెంటాడుతోంది? దాని బారి నుంచి 'జానా' కుటుంబ సభ్యులు బ్రతికి బయటపడతారా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: మనిషి అడవులను అన్ని వైపుల నుంచి ఆక్రమిస్తున్నాడు. అడవిలోని జంతువులను వేటాడటం .. సరదాగా అడవులలో విహరిస్తూ వాటికి ప్రాణహాని కలిగించడం .. అవి త్రాగే నీటిని కలుషితం చేయడం .. పరిశోధనల పేరుతో వాటిని హింసించడం చేస్తూ వస్తున్నాడు. 'దుప్పి' వంటి ఒక సాధు జంతువు, మనిషి ఆగడాల కారణంగా రాక్షస మృగంగా మారితే ఎలా ఉంటుంది? అనే కథతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. 

పరిమితమైన పాత్రలను ఎంచుకుని దర్శకుడు ఈ కథను నడిపించాడు. ఈ తరహా కథలు .. కాన్సెప్టులు అక్కడ కొత్తకాకపోయినా, చూస్తున్నంత సేపు ఉత్కంఠకు లోనయ్యేలా ఈ సినిమా నడుస్తుంది. అడవిలో ఆపదలో పడిన కుటుంబ సభ్యులు .. ప్రాణభయంతో వాళ్లు తప్పించుకునే తీరు .. దుప్పి ఒక్కొక్కరినీ అడవిలో వెంటాడే విధానం ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులు తామే అడవిలో చిక్కుబడిన అనుభూతికి లోనవుతారు. 

ఇక మనుషులను దుప్పి చంపే సన్నివేశాలను చూసి తట్టుకోవడం చాలా కష్టమైన విషయమనే చెప్పాలి. ఆ రక్తపాతం జుగుప్స కలిగిస్తుంది. అందుకు సంబంధించిన క్లోజప్ షాట్స్ ను అస్సలు చూడలేం. ఈ జోనర్ కి సంబంధించిన కథలను ఇష్టపడేవారికి మాత్రం ఈ కంటెంట్ నచ్చే అవకాశం ఉంది. 

పనితీరు: ఏ కథ చాలా సాదాసీదాగా .. చిన్నపిల్లల సినిమా మాదిరిగా మొదలవుతుంది. ఆ తరువాత టెన్షన్ పెడుతూ ముందుకు సాగుతుంది. కథలో కొత్తదనం .. భారీతనం పెద్దగా లేకపోయినా, చూస్తున్నంత సేపు ఉత్కంఠను రేకెత్తించే సినిమా ఇది. ఫారెస్టు ఏరోయాను కవర్ చేసిన విధానం .. లైటింగ్ .. నైట్ ఎఫెక్ట్ సీన్స్ ను తెరపైకి తీసుకుని రావడంలో కెమెరా పనితనం గొప్పగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా ఈ కంటెంట్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. 

ముగింపు: బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇది పెద్ద సినిమా ఏం కాదు. అయినా అవుట్ పుట్ చెమటలు పట్టిస్తుంది. తెరపై రక్తపాతం ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ జోనర్ కి అలవాటు పడిన ప్రేక్షకులు తప్ప, మిగతావారు చూసి తట్టుకోవడం కష్టమే.