'జబర్దస్త్' కామెడీ షో ద్వారా కమెడియన్స్ గా చాలామంది పాప్యులర్ అయ్యారు. అలా వెలుగులోకి వచ్చిన అభినయ కృష్ణ (అదిరే అభి), దర్శకుడిగా వ్యవహరించిన సినిమానే 'చిరంజీవ'. రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఆయన ఈ సినిమాను రూపొందించాడు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: శివ (రాజ్ తరుణ్) దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. అతని తల్లి గాయత్రికి భక్తి ఎక్కువ. ఎప్పుడూ పూజలు చేస్తూ ఉంటుంది. తండ్రి తాగుబోతు .. కుటుంబం పట్ల ఎంతమాత్రం బాధ్యత లేని వ్యక్తి. దాంతో శివ అంబులెన్స్ డ్రైవర్ గా కుదురుతాడు. అయితే ఆ పనిలోకి దిగిన తరువాతనే అందులోని సాధకబాధలు ఎలా ఉంటాయనేది అతనికి అర్థమవుతుంది. అదే కాలనీలో ఉండే భవ్య అతనిని ప్రేమిస్తూ ఉంటుంది. 

ఇక అక్కడ స్థానిక నాయకుడిగా ఎదగడానికి శ్రీను యాదవ్ - సత్తు పహిల్వాన్ ఇద్దరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం వాళ్లిద్దరూ ఎమ్మెల్యే రాజన్న (రాజా రవీంద్ర) ను నమ్ముకుంటారు. శ్రీను యాదవ్ వడ్డీకి డబ్బులు తిప్పుతూ, రౌడీయిజంతో తిరిగి వసూలు చేస్తూ ఉంటాడు. ఇక సత్తు పహిల్వాన్ భూకబ్జాలు .. ఆక్రమణలకు పాల్పడుతూ ఉంటాడు. అక్కడి వాళ్లందరూ ఆ ఇద్దరికీ భయపడుతూ ఉంటారు. 

ఈ నేపథ్యంలోనే ఒకసారి శివకు యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పటి నుంచి అందరి తలలపై అతనికి ఏవో అంకెలు కనిపిస్తూ ఉంటాయి. అలా ఎందుకు కనిపిస్తున్నాయనేది అతను పరిశీలిస్తాడు. ఎవరు ఏ రోజున ఏ సమయానికి చనిపోతారనేది తనకి ముందుగానే తెలిసిపోతున్నట్టు అతనికి అర్థమవుతుంది. ఆ శక్తిని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించాలని అతను నిర్ణయించుకుంటాడు. అందుకోసం అతను ఏమేం చేస్తాడు? అనేదే కథ.

విశ్లేషణ: ఫాంటసీ వైపు నుంచి చెప్పుకోవాలనుకుంటే, అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనల వలన కొంతమందికి మానవాతీత శక్తులు సొంతమవుతూ ఉంటాయి. సాధారణ మనుషులకు సాధ్యం కానివి వారికి సాధ్యమవుతూ ఉంటాయి. నుదుటి రాత తెలియడం .. ఎప్పుడు ఏం జరుగుతుందనేది తెలియడం .. ఎవరి మనసులో ఏమనుకుంటున్నారో తెలియడం వంటి అంశాలపై గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అలా ఎవరికి ఎంత ఆయుష్షు ఉందనేది తెలిసే ఒక యువకుడి కథ ఇది. 

అయితే హీరోకి వచ్చిన ఈ శక్తి కారణంగా అతను  ఏం చేస్తాడు? ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తాడు? అనే దిశగా ఈ కథను అల్లుకోవడానికి దర్శకుడు ప్రయత్నించాడు. తనకి బాగా అలవాటైన కామెడీ టచ్ తో వినోదాన్ని అందిచాడనికి ప్రయత్నించాడు. కాకపోతే ఆ ప్రయత్నంలో అతను సక్సెస్ కాలేకపోయాడనే చెప్పాలి. రాజ్ తరుణ్ మినహా ఈ కథలో చెప్పుకోదగిన ఆర్టిస్టులు లేకపోవడం ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. 
             
అభినయకృష్ణ తనకి స్క్రిప్ట్ వర్క్ పై కూడా మంచి ప్రవేశం ఉన్నట్టుగా చెబుతూ ఉంటాడు. కానీ మరి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చాలా బలహీనంగా కనిపిస్తుంది. ఆయన అందించిన సంభాషణలు కూడా అంతంత మాత్రంగానే అనిపిస్తాయి. కథపై మరికాస్త కసరత్తు చేసి, కాస్త నిర్మాణ విలువలతో బరిలోకి దిగితే బాగుండేదేమో.

పనితీరు: అభినయకృష్ణ అనుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో తెరకెక్కించలేకపోవడం కనిపిస్తుంది. అందుకు తగిన వనరులు అందుబాటులో లేకపోవడం కూడా ఒక కారణం అనుకోవచ్చునేమో. లవ్ .. మదర్ సెంటిమెంట్ .. డివోషనల్ టచ్ ఉన్నప్పటికీ వాటిని ఆయన హైలైట్ చేసే అవకాశాన్ని ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది.

రాకేశ్ నారాయణ్ ఫొటోగ్రఫీ .. అచ్చు రాజమణి నేపథ్య సంగీతం .. సాయి మురళి ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. రాజ్ తరుణ్ తన మార్క్ యాక్టింగ్ చూపించాడు. మిగతా పాత్రలను చెప్పుకోదగిన స్థాయిలో డిజైన్ చేయలేదు. ముఖ్యంగా ఈ కంటెంట్ కి అవసరమైన కామెడీ వర్కౌట్ కాలేదని చెప్పాలి. 

ముగింపు: లవ్ .. ఎమోషన్ .. కామెడీని కలిపి నడిపిస్తూ ఫాంటసీ టచ్ ఇచ్చిన కథ ఇది. అయితే ఏ వైపు నుంచి కూడా ఏ అంశం కనెక్ట్ కాకపోవడం కనిపిస్తుంది. అందువల్లనే వినోదాన్ని అందించే విషయంలో ఈ సినిమా నిరాశపరుస్తుంది.