'నెట్ ఫ్లిక్స్'లో నేరుగా విడుదలైన సినిమానే 'బారాముల్లా'. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చింది. మానవ్ కౌల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, హిందీతో పాటు ఇతర భాషాల్లోను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. కశ్మీర్ లోని 'బారాముల్లా' ప్రాంతం నేపథ్యంలో నడిచే ఈ సినిమాకి ఆదిత్య జంభాలే దర్శకత్వం వహించాడు. ఆదిత్య ధర్ నిర్మించిన ఈ సినిమా, సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ: 'బారాముల్లా' ప్రాతంలో 'జఫార్' అనే వ్యక్తి ఒక మేజిక్ షో నిర్వహిస్తాడు. షోలో భాగంగా ఒక కుర్రాడిని అదృశ్యం చేస్తాడు. పదేళ్ల ఆ కుర్రాడు నిజంగానే కనిపించకుండాపోతాడు. అతను మాజీ ఎమ్మెల్యే 'అన్సారీ' కొడుకు 'షోయబ్' కావడంతో, వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసును పరిష్కరించడం కోసం స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా డిఎస్పీ రిద్వాన్ (మానవ్ కౌల్) 'బారాముల్లా' చేరుకుంటాడు. భార్య గుల్నార్ .. పిల్లలు అయాన్ .. 'నూరి'తో పాటు ఒక పాత ఇంట్లోకి దిగుతాడు. ఆ ఇంటి వ్యవహారాలను ఇక్బాల్ చూసుకుంటూ ఉంటాడు.

షోయబ్ అనే కుర్రాడు ఎలా మాయమైపోయాడో తెలియదని రిద్వాన్ తో మెజీషియన్ చెబుతాడు. ఆ కుర్రాడు దాక్కున్న పెట్టెలో కట్ చేసిన అతని 'జుట్టు' మాత్రం దొరికిందని రిద్వాన్  తెలుసుకుంటాడు. ఒక వైపున రిద్వాన్ ఈ విషయంపై ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉండగానే, ఒకరి తరువాత ఒకరిగా పిల్లలు అదృశ్యమవుతూ ఉంటారు. అయితే పిల్లలు అదృశ్యమయ్యే తీరు చాలా చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో రిద్వాన్ కి ఖలీద్ - జునైద్ అనే వారిపై అనుమానం వస్తుంది.

ఇక రిద్వాన్ ఉంటున్న పాత ఇంట్లో చిత్రమైన శబ్దాలు వస్తుంటాయి. తమతో పాటు వేరెవరో తమ ఇంట్లో ఉంటున్నారని వారికి అనిపిస్తుంది. 'నీడ'లాంటి ఒక ఆకారాన్ని అయాన్ చూస్తాడు. తరచూ తన గదిలోకి కుక్క వాసన వస్తుండటాన్ని 'నూరి' గ్రహిస్తుంది.రాత్రివేళలో ఇక్బాల్ ఎవరికో రహస్యంగా ఆహారాన్ని తీసుకుని వెళ్లడాన్ని ఆమె చూస్తుంది. ఆ తరువాత 'నూరి' కనిపించకుండా పోతుంది. పిల్లలు కనిపించకుండా పోవడానికి కారకులు ఎవరు? రిద్వాన్ ఇంట్లో ఏం జరుగుతోంది? 'బారాముల్లా'లోని తీవ్రవాదానికీ .. ఈ పాత ఇంటికి మధ్యగల సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.

విశ్లేషణ
: కశ్మీర్ లోని తీవ్రవాదంపై చాలానే సినిమాలు వచ్చాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ పైనా,  అలాగే పగతో రగిలిపోయే ఆత్మల గురించి చాలానే సినిమాలు వచ్చాయి. అయితే తీవ్రవాదాన్ని ఆత్మల నేపథ్యంలో ముడిపెట్టిన అరుదైన ప్రయత్నంగా 'బారాముల్లా' కనిపిస్తుంది. తీవ్రవాదుల నుంచి 'బారాముల్లా'ను .. ఆత్మల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవలసిన పరిస్థితులలో ఒక పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు? అనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఆసక్తికరంగా అనిపిస్తుంది. 

యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ .. హారర్ టచ్ ఇస్తూ దర్శకుడు ఈ కథను నడిపించిన విధానం బాగుంటుంది. చాలా సేపటి వరకూ అసలు ఏం జరుగుతుందనేది ప్రేక్షకులకు అర్థం కాదు. అయినా ఏం జరుగనుందా అనే ఒక టెన్షన్ ను బిల్డప్ చేస్తూ వెళ్లడం వలన, ప్రేక్షకులు ఫాలో అవుతారు. దాదాపు ప్రీ క్లైమాక్స్ వరకూ అసలు విషయాన్ని హోల్డ్ లో పెడుతూ దర్శకుడు ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది.

సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ ను హ్యాండిల్ చేయడం చాలా కష్టమైన విషయమనే చెప్పాలి. ప్రేక్షకులు ఊహించలేని అంశాలను కలుపుకుంటూ .. ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చూసుకుంటూ .. ఆసక్తిని రేకెత్తించడం అంత ఆషామాషీ విషయమమేం కాదు. అయినా ఈ కంటెంట్ ను పెర్ఫెక్ట్ గా అందించడంలో దర్శకుడు తన ప్రతిభను చూపించాడనే చెప్పాలి.

పనితీరు: కథా కథనాలు ఈ సినిమా విషయంలో ప్రధానమైన పాత్రను పోషించాయని చెప్పాలి. అలాగే ప్రధానమైన పాత్రలను మలచిన విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.  ప్రస్తుతం జరుగుతున్న కథను ఆపేసి ఫ్లాష్ బ్యాక్ ను చెప్పడం కాకుండా, ప్రస్తుత పాత్రల మధ్యనే ఫ్లాష్ బ్యాక్ ను చూపించడం కొత్తగా అనిపిస్తుంది. 

కథ - స్క్రీన్ ప్లే తరువాత, నేపథ్య సంగీతం ఎక్కువ మార్కులు కొట్టేసిందని చెప్పాలి. తెరపై సన్నివేశాలకి సంబంధించిన వేరియేషన్స్ చకచకా మారిపోతూ ఉంటాయి. అందుకు తగినట్టుగానే బీజీఎమ్ మెప్పిస్తుంది. ఇక ఫొటోగ్రఫీ కూడా తనవంతు పాత్రను పోషించింది. ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ తమ పాత్రలలో జీవించారు. 

ముగింపు: హారర్ టచ్ తో కూడిన సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. కథను అల్లుకున్న తీరు .. తెరపై ఆవిష్కరించిన విధానం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అభ్యంతరకరమైన సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన కంటెంట్ గా ఈ సినిమా ఆకట్టుకుంటుందని చెప్పచ్చు.