సుధీర్ బాబు ఎప్పటికప్పుడు కొత్త జోనర్ ను టచ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం మనకి అర్థమైపోతూనే ఉంటుంది. 'జటాధర' సినిమా విషయంలోను ఆయన అదే పద్ధతిని కొనసాగించాడు. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో, శిల్పా శిరోద్కర్ .. సోనాక్షి సిన్హా కీలకమైన పాత్రలను పోషించడం విశేషం. అలాంటి ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లలో విడుదలైంది. 

కథ: శివ (సుధీర్ బాబు) ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. తనకంటూ ఒక మంచి జాబ్ ఉంటుంది. అయితే అతను మరో పనిపై కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. అదేమిటంటే దెయ్యాలు లేవని నిరూపించడం. అలాంటి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టడం కోసం, దెయ్యాల బంగ్లాలుగా పేరుపడిన ప్రదేశాల చుట్టూ తిరుగుతుంటాడు. ఈ విషయంలో తల్లిదండ్రులు అతనిని వారిస్తూ ఉంటారు. ముఖ్యంగా అతను 'రుద్రారం' అనే విలేజ్ దిశగా వెళతాడేమోనని వాళ్లు ఆందోళన చెందుతుంటారు. 

శివకి తరచూ ఒక 'కల' వస్తూ ఉంటుంది. ఊయలలో పడుకున్న ఒక పసిబిడ్డను ఒక తల్లి కత్తితో చంపడానికి వస్తున్నట్టుగా అనిపించి అతను ఉలిక్కిపడి నిద్రలేస్తూ ఉంటాడు. అలా ఆ 'కల' ఎందుకు వస్తుందనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దెయ్యాల విషయంలో శివ దూకుడును అడ్డుకోవడానికి అతని తల్లిదండ్రులతో పాటు, మనసిచ్చిన 'సితార' కూడా అతనిని వారిస్తూ ఉంటుంది. అయినా అతను వాళ్లకి తెలియకుండా తన పనిని కొనసాగిస్తూనే ఉంటాడు. 

శివ కుటుంబం క్షేమాన్ని కోరుకునే నీలకంఠ శాస్త్రి (శుభలేఖ సుధాకర్), అతనికి మరణగండం ఉందని తెలుసుకుంటాడు. అదే సమయంలో శివ 'రుద్రారం' వెళతాడు. ఆ గ్రామంలో శివకి పరిచయమున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. ఒక మాంత్రికుడితో కలిసి అతను 'లంకెబిందెలు' తీయడానికి ప్రయత్నించగా, ఆ నిధికి కాపలాగా ఉన్న ధనపిశాచి (సోనాక్షి సిన్హా) అతనిని చంపేసిందనే వార్త శివకి తెలుస్తుంది. అక్కడ ఏం జరిగిందో పరిశోధించి బయట ప్రపంచానికి ఆ నిజం చెప్పాలనే ఉద్దేశంతో అతను ఆ గ్రామానికి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? ధనపిశాచి గురించి శివకి ఎలాంటి నిజం తెలుస్తుంది? అతని 'కల' వెనుక దాగిన నిజం ఏమిటి? అనేది మిగతా కథ.  

విశ్లేషణ: సాధారణంగా దెయ్యాల కథలు .. నిధి తాలూకు అన్వేషణకి సంబంధించిన కథలు .. దైవత్వానికి సంబంధించిన కథలు ఎప్పుడూ ఆసక్తికరంగానే అనిపిస్తూ ఉంటాయి. ఈ తరహా కథల పట్ల కుతూహలాన్ని కనబరిచేవారు ఎక్కువ. ఆసక్తికరమైన పై మూడు అంశాలను కలుపుకుని సుధీర్ బాబు చేసిన సినిమానే ఇది. ఈ కథలో నిధి ఉంది .. పిశాచి ఉంది .. ఆ పిశాచిని అడ్డుకునే కథానాయకుడు .. ఆయనకి సహకరించే దేవుడు ఉన్నారు. ఇక లేనిదల్లా ఎమోషన్ .. జరగనిదల్లా కథపై పూర్తిస్థాయి కసరత్తు.      

తెరపై కథానాయకుడు ఒక సమస్యను ఫేస్ చేస్తున్నప్పుడు, అందుకు పరిష్కార మార్గంగా అతను ఏం చేస్తున్నాడనేది ప్రేక్షకులకు తెలియాలి. అలా కాకుండా తాను ఏదో అనేసుకుని .. ఆ ప్లాన్ ను అరుణాచలంలోని అష్టలింగాలకు ముడిపెట్టడం, సామాన్య ప్రేక్షకులకు అయోమయాన్ని కలిగిస్తుంది. ఇక ఒక ధన పిశాచాన్ని కంట్రోల్ చేయడానికిగాను, కైలాసంలోని శివుడు కంగారుపడిపోయి నంది వాహనంపై కదిలిరావడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది.

హీరోకి ఫ్లాష్ బ్యాక్ తెలియజెప్పడం కోసం చాలా సమయాన్ని తీసుకున్నారు. చాలా నిదానంగా .. నింపాదిగా ఈ ఎపిసోడ్ నడుస్తుంది. ఇక క్లైమాక్స్ లో ధనపిశాచిని కట్టడి చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా కాకుండా, ఏదో షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ధనపిశాచితో ఫైట్ .. హిమశిఖరాలపై హీరో నృత్యం .. ఇలా కథ ఏటో .. ఎటెటో వెళ్లిపోతుంది. ఇంతా జరిగాక మళ్లీ మొదటికొచ్చాశాను అన్నట్టుగా, ధనపిశాచి నుంచి అదే అరుపు. 

పనితీరు: ఒక కథకు ఎక్కువ అంశాలను జోడిస్తున్నప్పుడు .. ఆ కథను అన్ని వైపుల నుంచి పెర్ఫెక్ట్ గా అల్లుకుంటూ రావలసి ఉంటుంది. అలాగే ఏ విషయాన్ని చెప్పడానికి ఎంత సమయం తీసుకోవాలనేది కూడా ముఖ్యమే. కథకి క్లైమాక్స్ అనేది ప్రాణం లాంటిది. ఆ క్లైమాక్స్ విషయంలో గందరగోళం లేకుండా చూసుకుంటే బాగుండేది.

ఇక కథాకథనాల విషయం అలా ఉంచితే, ధన పిశాచి మొదలు .. హీరోయిన్ .. మాంత్రికుల హెయిర్ స్టైల్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సమీర్ కల్యాణి ఫొటోగ్రఫీ .. రాజీవ్ రాజ్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. శివుడి గురించి నీలకంఠశాస్త్రి చెప్పేటప్పుడు ఆ స్థాయికి తగిన సంభాషణలు పడలేదని అనిపిస్తుంది. 

ముగింపు: నిజానికి 'జటాధర' అనేది చాలా పవర్ఫుల్ టైటిల్. అలాగే నిధి .. ధన పిశాచి .. దైవశక్తి అనేవి కూడా ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించే అంశాలే. అయితే సరైన కసరత్తు లేని కారణంగా, ఆశించిన స్థాయి సన్నివేశాలు తెరపై ఆవిష్కృతం కాలేదు. అందువలన అనవసరమైన సన్నివేశాలు .. అక్కడక్కడా కాస్త గందరగోళం తప్పలేదు.