పుష్ప, యానిమల్, చావా వంటి పాన్ ఇండియా చిత్రాలతో అగ్ర కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు సంపాందించుకున్న రష్మిక మందన ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఉందా? రష్మిక మందనకు 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రంతో మరో హిట్ దక్కిందా? ఈ సినిమా ఎలా ఉంది? సమీక్షలో తెలుసుకుందాం.
కథ: భూమా (రష్మిక మందన) ఎం.ఎ లిటరేచర్ను పూర్తిచేయడానికి సొంత ఊరు నుండి హైదరాబాద్‌కు వచ్చి ఓ పీజీ కాలేజీలో జాయిన్ అవుతుంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి) కూడా పీజీ చేస్తుంటాడు. భూమా చేసిన ఓ చిన్న యాక్సిడెంట్ కారణంగా విక్రమ్‌తో పరిచయం కలుగుతుంది. తొలి పరిచయంలోనే ఒకరికొకరు నచ్చేస్తారు. విక్రమ్‌ని దుర్గ ( అను ఇమ్మాన్యుయేల్) కూడా ప్రేమిస్తుంది. అయితే ఆమెది వన్‌సైడ్ ప్రేమ మాత్రమే. విక్రమ్ తనలో వాళ్ల అమ్మ ప్రేమ చూసుకుంటున్నాడని తెలుసుకున్న భూమ కూడా విక్రమ్‌ను ఇష్టపడుతుంది. ఇలా చదువుకుంటూ ప్రేమించుకుంటున్న వీళ్ల ప్రేమ ప్రయాణంలో, కొన్ని హద్దులు కూడా దాటాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొన్ని అనుకొని పరిణామాలు వల్ల విక్రమ్, భూమ మధ్య మనస్పర్థలు వస్తాయి. అసలు ఈ ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణమేమిటి? ఇద్దరూ విడిపోవాలని అనుకోవడానికి రీజన్ ఏమిటి? ఆ తరువాత ఏం జరిగింది? అనేది తెరపై చూడాలి.
విశ్లేషణ: ఇప్పటి వరకు తెలుగు తెరపై చాలా ప్రేమకథలు వచ్చాయి. అన్ని కథల్లో సారాంశం ఒకటే అయినా కథ, కథనాల్లో కొత్తదనంతో మన దర్శకులు ఎప్పటి కప్పుడూ మెప్పిస్తుంటారు. అయితే దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాతో నేటి అపరిక్వత ప్రేమలు, వాటి పరిణామాలను చూపించే ప్రయత్నం చేశాడు. ఎప్పుడూ భయపడుతూ ఇంట్రవర్ట్గా ఉండే అమ్మాయి, ఆధునిక భావాలు, స్వార్థపు ఆలోచనలు ఉన్న అబ్బాయిని ప్రేమిస్తే వాళ్ల మధ్య బంధం ఎలా ఉంటుంది? ఆ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు ఉంటాయి? ప్రేమికురాలికి, ఆ ప్రేమికుడు ఎలాంటి షరతులు పెడతాడు? ఇలాంటి విషయాలను దర్శకుడు ఈ సినిమాలో చర్చించాడు.
తొలిభాగం కాలేజీ సన్నివేశాలు, లవ్సీన్స్తో సరదగా కొనసాగినా సెకండాఫ్‌లో అసలైన కథ మొదలవుతుంది. ఈ ప్రేమ ప్రయాణంలో కథ మరో మలుపు తిరగడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ప్రేమ బంధంలో ఉన్న కథానాయిక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ప్రేమను కాదనలేక.. మనస్పూర్తిగా ఇష్టపడ లేక ఆమె పడే మానసిక సంఘర్షణ.. అతనితో ఆమె ప్రయాణం సినిమా చూసే ఆడియన్స్‌కు జాలి కలిగిస్తుంది. ఒక్కోసారి ఇష్టం లేదు అని అరిచి చెప్పాలి కదా..అని సినిమా చూసే ఆడియన్స్‌లో కూడా ఫీల్ కలుగుతుంది అంటే.. అది ఎలాంటి ప్రేమనో అర్థం చేసుకోవచ్చు.
హీరోతో, హీరోయిన్ బ్రేకప్ చెప్పినప్పుడు హీరోయిన్‌తో పాటు ఆడియన్స్ కూడా రిలాక్స్ అవుతారంటే ఆడియన్స్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ స్టేజీపై నాటకం ప్రదర్శించిన తరువాత హీరో సంభాషణలు, హీరో వాళ్ల అమ్మను పరిచయం చేసే సన్నివేశాల నుంచే కథలోని అసలు పర్వం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచే కథ మరో మలుపుకు ఆరంభం అవుతుంది. సినిమా అంతా ఊహకు తగ్గట్టే కొనసాగటం, సన్నివేశాల్లో ఎలాంటి నవ్యత లేకపోవడం, ఈ సినిమాకు మైనస్. ఇక పతాక సన్నివేశాల్లో రష్మిక మందనపై చిత్రీకరించిన సన్నివేశాలు అందరిని ఆలోచనలో పడేస్తాయి. అయితే ఈ సినిమాలోని పాత్రలను సరైన రీతిలో దర్శకుడు పరిపూర్ణంగా ఆవిష్కరించలేదు. సినిమాలోని ప్రధాన పాత్రలను మరింత బలంగా చూపించగలిగితే సన్నివేశాలు కన్వీన్సింగ్‌గా అనిపించేవి.
నటీనటుల పనితీరు: ఇప్పటి వరకు రష్మికను చూడని ఓ కొత్తపాత్రలో ఆడియన్స్ ఈ సినిమాలో చూస్తారు. భూమగా ఆమె నటన అందరిని అలరిస్తుంది. ముఖ్యంగా ఆ పాత్రలో ఉండే కన్ఫ్యూజన్.. క్లారిటి.. ఈ రెండూ ఎమోషన్స్‌లో పండించే సమయంలో ఆమె నటనలో పరిపక్వత కనిపించింది. ఈ సినిమాకు ఆమె నటన ప్రధాన బలం. దీక్షిత్ నటన పాత్రకు తగ్గట్టుగా ఉంది. ఆయన పాత్రను చూస్తున్నప్పుడు ప్రేక్షకుల్లో కోపం, ద్వేషం కలిగేంత నటనను కనబరిచాడు.
ఈ సినిమాలో రోహిణి పాత్రకు పెద్దగా సంభాషణలు లేకపోయినా,సినిమా కథలోని లోతుని ఆమె పాత్రలోనే తెలుస్తుంది. రాహుల్ రవీంద్రన్ లెక్చరర్‌గా డీసెంట్‌గా ఉన్నాడు. ఇక హీరో, హీరోయిన్ స్నేహితులుగా అంతా కొత్తవాళ్లను తీసుకోవడంతో కొన్నిసన్నివేశాలు పండలేదు. మరికొన్నిసన్నివేశాలు బలహీనంగా కనిపించాయి. ఈ విషయంలో దర్శకుడు, నిర్మాతలు దృష్టి పెట్టి ఉండే సినిమా మరింత రక్తికట్టేది. కథలో ఉన్న నవ్యత, బలం సన్నివేశాల్లో కూడా ఉండి ఉంటే 'ది గర్ల్‌ఫ్రెండ్'ను మరింత క్వాలిటీగా చూసేవాళ్లం. హేషమ్ స్వరాలు, ప్రశాంత్ ఆర్ విహారి నేపథ్య సంగీతం కథలోని మూడ్‌ని క్యారీ చేశాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా: సీరియస్ ప్రేమకథలు, ప్రేమ కథల్లోని భావోద్వేగాలను ఇష్టపడేవారికి, నిజాయితీ ప్రేమకథలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. రష్మిక మందన అభిమానులు, ఆమె నటన కోసం కూడా ఈ సినిమాను వన్‌టైమ్ వాచ్ లిస్ట్‌లో నిస్సందేహంగా చేర్చుకోవచ్చు. ఇక ఇది అందరూ అర్థం చేసుకునే మామాలు ప్రేమ మాత్రం కాదు..
'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీ రివ్యూ
The Girlfriend Review
- విభిన్నప్రేమకథ
- ఆకట్టుకునే రష్మిక నటన
- ఆలోచింపజేసే పతాక సన్నివేశాలు
Movie Details
Movie Name: The Girlfriend
Release Date: 2025-11-07
Cast: Rashmika Mandanna, Dheekshith Shetty, Rao ramesh, Anu Emmanuel
Director: Rahul Ravindran
Music: Hesham Abdul Wahab
Banner: Geetha Arts, Dheeraj Mogilineni Entertainment
Review By: Maduri Madhu
Trailer