టైటిల్‌తో ఆసక్తిని పెంచే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఆ జాబితాలో తెరకెక్కిన సినిమానే 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. జార్జి రెడ్డి,పలాస,మసూద,పరేషాన్ చిత్రాలతో నటుడిగా మెప్పించిన తిరువీర్ ఈ చిత్రంలో కథానాయకుడు. వివాహానికి ముందు జరిగే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ నేపథ్యంలో వినోదాన్ని జోడించి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? అసలు ఈ సినిమా కథ ఏమిటి? తిరువీర్ హిట్ అందుకున్నాడా? లేదా సమీక్షలో తెలుసుకుందాం..
కథ: శ్రీకాకుళం సమీపంలోని ఓ పల్లెటూరిలో రమేష్ (తిరువీర్) అనే యువకుడు జిరాక్స్ సెంటర్ షాప్‌తో పాటు ఫోటోగ్రాఫర్‌గా ఆ ఊర్లో ఏ ఫంక్షన్, వివాహాలు జరిగినా ఫోటోలు తీస్తుంటాడు. అదే గ్రామంలో పంచాయితీ ఆఫీస్‌లో సెక్రటరీగా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న హేమ (టీనా శ్రావ్య), రమేష్‌లు ప్రేమించుకుంటారు. ఇదిలా ఉండగా అదే గ్రామంలో రాజకీయ నాయకుడు శీను దగ్గర పీఏ లాంటి ఉద్యోగం చేసే ఆనంద్‌కు (నరేంద్ర రవి) సౌందర్య (యామిని)తో వివాహం కుదురుతుంది.
ఇక ఆనంద్ తన పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేసే కాంట్రాక్ట్‌ను రమేష్‌కు ఇస్తాడు. తన మండలంలోనే ఎవరూ చేయించుకోలేని విధంగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలని రమేష్‌కు చెప్పడం.. షూట్‌ను పూర్తిచేయడం జరిగిపోతుంది. అయితే అనుకోకుండా రమేష్ అసిస్టెంట్ (మాస్టర్ రోహన్) వల్ల షూట్ చేసిన ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్ కంటెంట్ చిక్కుల్లో పడుతుంది? అసలు జరిగిందేమిటి? ఆనంద్, సౌందర్య వివాహం జరిగిందా? వాళ్ల ప్రీ వెడ్డింగ్ షూట్‌కు జరిగిన ఇబ్బందులేమిటి? రమేష్, హేమల ప్రేమ ఫలించిందా? అనేది సినిమా మిగతా కథ
విశ్లేషణ: చాలా చిన్నపాయింట్ చుట్టూ అల్లుకున్న వినోదాత్మక చిత్రమిది. దర్శకుడు కథ, కథనాలను పల్లెటూరి నేపథ్యంలో ఎంతో సహజంగా అల్లుకున్నాడు. ప్రతి సన్నివేశం ఎంతో నేచురల్‌గా మన ఊరిలో జరుగుతుందా? అనే భావన కలుగుతుంది. యూట్యూబ్‌లో లఘు చిత్రాల ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ ఎటువంటి అతిశయోక్తులకు పోకుండా ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా ఈ కథను తీర్చిదిద్దాడు. కథ ప్రారంభం నుండి ఎంతో సరదాగా నవ్విస్తూ ప్రతి సన్నివేశాన్నిదర్శకుడు తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా పాత్రలకు తగ్గ ఆర్టిస్టులను ఎంపిక చేసుకోవడంలో ఆయన నూటికి నూరుశాతం సక్సెస్ అయ్యాడు.
ప్రథమార్థం సరదాగా సాగిపోతుంది..ఇక ద్వితీయార్థం హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఓ పాటలో చూపించే ప్రీవెడ్డింగ్ షో షూట్ సన్నివేశాలు ఎంతో క్యూట్‌గా ఉంటాయి. ఈ పాటలో వచ్చే ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్ చూస్తే పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్‌ను మిస్ అయిన వాళ్లు మళ్లీ చేసుకోవాలనిపించే ముచ్చటగా ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్ పాటను పిక్చరైజ్ చేశాడు దర్శకుడు. రమేష్ ఆయన అసిస్టెంట్ రోహన్ మధ్య వచ్చే సన్నివేశాలు, రమేష్, హేమ మధ్య ఉండే సీన్స్ ఆడియన్స్‌కు వినోదాన్నిపంచుతాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు అందరి హృదయాలను హత్తుకుంటాయి. ఇక ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ను దర్శకుడు డిజైన్ చేసిన విధానం అందరికీ నచ్చుతుంది. కొత్తదనం, వినోదం ఆశించే ప్రేక్షకులకు ఈ ప్రీవెడ్డింగ్ షోతో కాసేపు సేద తీరవచ్చు.
నటీనటుల పనితీరు: తిరువీర్ అమాయకమైన పాత్రలో ఎంతో సహజంగా నటించాడు. ప్రతి సీన్‌లో తన మార్క్ నటనను చూపెట్టాడు. ఇక ఆనంద్ పాత్రలో నటించిన నరేంద్ర రవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాత్రను అతను కాకుండా వేరే వాళ్లు ఎవరూ చేసిన అంతగా ఆకట్టుకునేది కాదు అనే విధంగా ఆ పాత్రను రక్తి కట్టించాడు. శ్రీకాకుళం యాసలో డైలాగ్ డెలివరీతో మెప్పించాడు.
ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకు అతనే హీరో అనే స్థాయిలో అతని పాత్రను దర్శకుడు మలిచాడు. హేమగా టీనా, సౌందర్యగా యామిని తమ పాత్రల్లో జీవించారు. మాస్టర్ రోహన్ తన పరిధి మేరకు వినోదాన్ని పంచాడు. సాంకేతిక విభాగంలో దర్శకుడిగా రాహుల్ శ్రీనివాస్ ప్రతిభను చూపాడు. నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసే విధంగా ఉన్నతంగా ఉంది. సోమశేఖర్ కెమెరా పనితనంతో..కథతో పాటు మనం కూడా ఆ ఊరిలో ఉన్న భావన కలిగించాడు.
ఫైనల్‌గా: పల్లెటూరి నేపథ్యంలో అల్లుకున్న వినోదాత్మక రూరల్ డ్రామా ఇది. సహజమైన పాత్రలతో, ఆ పాత్రలు అందించే వినోదంతో కొనసాగిన ఈ చిత్రం మంచి టైమ్ పాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. అందరూ తప్పకుండా ఈ సినిమాను థియేటర్‌లో ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఈ ప్రీ వెడ్డింగ్ షో ఈ వీకెండ్‌కు ఈ స్ట్రెస్ బస్టర్ లాఫింగ్ షోగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఓ పల్లెటూరికి వెళ్లి ఆ పాత్రలతో గడిపిన ఫీల్‌ను ఈ సినిమా కలిగిస్తుంది.
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మూవీ రివ్యూ
The Great Pre-Wedding Show Review
- ఆకట్టుకునే కథ, కథనాలు
- సహజమైన పాత్రలు
- టైమ్ పాస్ ఎంటర్టైన్మెంట్
Movie Details
Movie Name: The Great Pre-Wedding Show
Release Date: 2025-11-07
Cast: Thiruveer,Teena Sravya,Rohan Roy, Narendra Ravi, Yamini Nageswar, Waltair Vinay, Prabhavath, Kanthamma, Madhavi
Director: Rahul Srinivas
Music: Suresh Bobbili
Banner: 7PM Productions, Puppet Show Productions
Review By: Maduri Madhu
Trailer