తమిళంలో అర్జున్ దాస్ కి మంచి క్రేజ్ ఉంది. ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను ఆయన చేస్తూ వెళుతున్నాడు. ఈ సారి రొటీన్ కి భిన్నంగా ఆయన చేసిన సినిమానే 'బాంబ్'. విశాల్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. అక్టోబర్ లో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. రీసెంటుగా తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.       

కథ: అది ఒక మారుమూల గ్రామం .. దాని పేరే 'కాలకమ్మాయి పట్టి'. అక్కడ కొన్ని కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. చదువులేని కారణంగా అక్కడ మూఢ నమ్మకాలు కూడ ఎక్కువగానే ఉంటాయి. వాళ్లంతా తమ ఊరును ఆనుకుని ఉన్న పర్వత శిఖరాన్ని దైవంగా భావిస్తూ ఉంటారు. ఏడాదికి ఒకసారి ఆ పర్వత శిఖరంపై 'నెమలి' వాలిన సమయంలో, ఒక వెలుగు ఆ ఊరుపై పడుతూ ఉంటుంది. ఆ వెలుగును భగవంతుడి ఆశీర్వాదంగా వాళ్లంతా భావిస్తూ ఉంటారు. ఆ తరువాత రెండు రోజుల పాటు, జాతర నిర్వహిస్తూ ఉంటారు. 

అయితే అనుకోకుండా జరిగిన ఒక సంఘటన కారణంగా ఆ ఊరు 'కాలపట్టి - కమ్మాయి పట్టి'గా  విడిపోతుంది.  రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ ఉంటుంది. తాము గీసుకున్న నియంత్రణ రేఖను దాటుకుని ఒకరి పరిధిలోకి ఒకరు ప్రవేశించకూడదు.  ప్రభుత్వ అధికారులు తమ విధుల్లో భాగంగా ఆ గ్రామాలకు వెళ్లడానికి భయపడుతూ ఉంటారు. తామంతా కలిసి ఉండాలని భావించే కథిర్ (కాళీ వెంకట్) బాధపడుతూ ఉంటాడు. 

కథిర్ .. అతని చెల్లెలు ప్రభావతి (శివాత్మిక రాజశేఖర్) అదే గ్రామంలో నివసిస్తూ ఉంటారు. ప్రస్తుతం వాళ్లు నివసించే భాగం 'కాలపట్టి' పరిధిలోకి వెళుతుంది. కాలపట్టికి చెందిన కుర్రాడు 'యోగేశ్' కి నిద్దర్లో నడిచే అలవాటు ఉంటుంది. పైగా అతనికి 'కమ్మాయి పట్టి' ప్రెసిడెంట్ గారి కుర్చీపై కూర్చోవాలనే ఆశ ఉంటుంది. అందువలన ఒకసారి అతను నిద్దర్లో నడుస్తూ వెళ్లి, ఆ కుర్చీపై కాళ్లు పెట్టి కూర్చుంటాడు. ఆ సంఘటన ఎలాంటి పరిణామలకు దారితీస్తుంది? అది కథిర్ కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేది కథ. 

విశ్లేషణ: సాధారణంగా మారుమూల గ్రామాలలో కొన్ని నమ్మకాలు కనిపిస్తూ ఉంటాయి. అవి మూఢ నమ్మకాలని వాళ్లకి నచ్చజెప్పడం కూడా కష్టమే. అంతగా అక్కడి వాళ్లంతా ఆ నమ్మకాలను అనుసరిస్తూ ఉంటారు. తాము నమ్మిన విషయం కారణంగా విడిపోయిన గ్రామస్తులు కలవాలంటే, అది వాళ్లు నమ్మే నమ్మకాల వైపు నుంచే జరగవలసి ఉంటుంది. అలాంటి ఒక బలమైన విశ్వాసం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది.

ఈ కథలో దైవానికి సంబంధించిన ఒక విషయంపై గొడవపడి గ్రామస్తులు విడిపోతారు. అయితే వాళ్లు తిరిగి ఒకటి కావడానికి దర్శకుడు ఎంచుకున్న మార్గం మాత్రం సరిగ్గా అనిపించదు. పైగా థియేటర్లలో గానీ .. టీవీలలో ఫ్యామిలీతో కలిసి గాని కలిసి చూడటానికి కాస్త ఇబ్బంది పడే కంటెంట్ ఇది. మరి దర్శకుడు ఈ అంశం దగ్గర థియేటర్లలో నవ్వులు పూస్తాయని అనుకున్నాడేమో తెలియదు.

గ్రామస్తుల ఆవేశం తగ్గడానికీ .. అర్థం చేసుకోవడానికీ .. ఒకరిపట్ల ఒకరు మానవత్వాన్ని చాటుకునేలా చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అలా కాకుండా ఒక ఇబ్బందికరమైన అంశాన్ని భుజానకెత్తుకుని, దానిని హైలైట్ చేస్తూ వెళ్లడం విడ్డూరంగా అనిపిస్తుంది. కథలో భాగంగా ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం చూపుతున్నప్పుడు ఇంతకుమించిన మార్గం మరొకటి లేదన్నట్టుగా ఉండాలి. అంతేకానీ ఇలాంటి సిల్లీ సీన్స్ ను అల్లుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయడం కరెక్టు కాదని అనిపిస్తుంది. 

పనితీరు: దర్శకుడు ఈ కథను ఆరంభించిన తీరు .. గ్రామీణ వాతావరణం ప్రేక్షకులకు నచ్చుతాయి. అయితే గ్రామంలోని సమస్యకు దర్శకుడిగా అతను చూపిన పరిష్కారం, సహజత్వానికి చాలా దూరంగా కనిపిస్తుంది. ఒకవేళ కామెడీ కంటెంట్ గా సర్దిచెప్పుకుందామని అనుకున్నా మనసొప్పదు. అందుకు కారణం దర్శకుడు ఎంచుకున్న ఇబ్బందికరమైన అంశం అనే చెప్పాలి. 

రాజ్ కుమార్ ఫొటోగ్రఫీ .. ఇమాన్ నేపథ్య సంగీతం .. ప్రసన్న ఎడిటింగ్ ఈ కథకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఆర్టిస్టులంతా చాలా సహజంగా నటించారు. నిజమైన గ్రామస్తుల మాదిరిగానే అనిపిస్తారు. 

ముగింపు: ఇది ఒక గ్రామం కథ .. గ్రామస్తుల విశ్వాసం చుట్టూ తిరిగే కథ. కలిసి బ్రతడంలోనే అసలైన ఆనందం ఉందంటూ ఇచ్చిన సందేశం బాగుంది. అయితే వాళ్లను కలపడానికి దర్శకుడు ఎంచుకున్న అంశమే అంత సమర్థనీయంగా అనిపించదు.