అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమానే 'ఎలివేషన్'. క్రితం ఏడాది నవంబర్ లో ఈ సినిమాను విడుదల చేశారు. ఆంథోనీ మ్యాకీ .. మోరెనా బాకారీన్ ...మాడీ హసోన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, జార్జ్ నోల్ఫి దర్శకత్వం వహించాడు. ఈ నెల 1వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇంగ్లిష్ తో పాటు ఇతర భాషల్లోను అందుబాటులో ఉంది.

కథ: అది 'బోల్డర్' అనే సిటీకి దూరంగా ఉన్న ఒక కొండ ప్రాంతం. దాదాపు 8000 అడుగుల ఎత్తయిన ఆ ప్రదేశంలో కొంతమంది భయం గుప్పెట్లో బ్రతుకుతూ ఉంటారు. అందుకు కారణం 'రీపర్స్'గా చెప్పుకునే చిత్రమైన జంతువులు. చూడటానికి మొసలి మాదిరిగా కనిపించే ఈ జంతువులు చాలా వేగంగా పరిగెత్తగలవు. మనిషి శ్వాసను సైతం పసిగట్టి వెంటాడగలవు. మూడేళ్ల క్రితం అవి 'బోల్డర్' నగరంపై దాడిచేస్తాయి. చనిపోగా మిగిలిన కొంతమంది కొండపై తలదాచుకుంటారు.

చిత్రమైన ఆ జంతువులు 8000 అడుగులపైకి చేరుకోలేవు. అందువలన నియంత్రణ రేఖను ఏర్పాటు చేసుకుని, ఆ రేఖను దాటి ఎవరూ క్రిందికి రాకుండా జీవిస్తూ ఉంటారు. 'విల్' (ఆంథోని మ్యాకీ) రీపర్స్ కారణంగా తన భార్యను కోల్పోతాడు. అప్పటి నుంచి తన ఎనిమిదేళ్ల కొడుకు 'హంటర్' ఆలనా పాలన అతనే చూసుకుంటూ ఉంటాడు. హంటర్ కొంతకాలంగా శ్వాస సంబంధమైన వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అతనికి ఎప్పటికప్పుడు కుత్రిమ ఆక్సిజన్ అందించే 'ఫిల్టర్స్' మారుస్తూ ఉండాలి.

'విల్'కి సమీపంలోనే నీనా .. టీకే నివసిస్తూ ఉంటారు .. ఇద్దరూ ఒంటరివారే. రీపర్స్ కారణంగా తన ఫ్యామిలీని పోగొట్టుకున్నందుకు 'నీనా' ప్రతీకారంతో ఉంటుంది. రీపర్స్ ను అంతం చేయడానికి తగిన ఆయుధాలను కనుగొనే ప్రయత్నంలో ఆమె ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తన కొడుకు కోసం ఉపయోగించే ఫిల్టర్స్ కోసం 'విల్' కొండదిగవలసి వస్తుంది. 'బోల్డర్' సిటీలోని హాస్పిటల్ నుంచి వాటిని తీసుకురావాలసి ఉంటుంది.

అయితే కొండదిగితే ఆ జంతువులు చంపేస్తాయని నీనా - టీకే అతణ్ణి హెచ్చరిస్తారు. అయినా అతను వినిపించుకోకపోవడంతో తోడుగా తాము కూడా బయల్దేరతారు. రీపర్స్ వైపు నుంచి వాళ్లకి ఎలాంటి ప్రమాదం ఎదురవుతుంది? రీపర్స్ గురించి వాళ్లకి కొత్తగా తెలిసే విషయం ఏమిటి? తన కొడుకును కాపాడుకోవాలనే విల్ ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ
: కొడుకును రక్షించుకోవడం కోసం, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక తండ్రి చేసే పోరాటమే ఈ సినిమా. ఈ కథ మొత్తంలో మూడే పాత్రలు ప్రధానంగా కనిపిస్తాయి.మిగతా పాత్రలను గురించిన ప్రస్తావన తప్ప, వాళ్లు తెరపై కనిపించరు. కథ అంతా కూడా కొండ ప్రాంతంలోనే జరుగుతుంది. చాలా తక్కువ బడ్జెట్ లోనే తీశారనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది. 

ఈ తరహా కథల్లో చిత్రమైన జంతువులు .. వాటి ప్రత్యేకతలు .. అవి వెంటాడే దృశ్యాలు ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తించవలసి ఉంటుంది. వాటికి హీరో బృందం ఎక్కడ దొరికిపోతుందో అనే ఒక టెన్షన్ ఆడియన్స్ లో కలగాలి. కానీ ఆ స్థాయిలో కంగారు పెట్టేసే సన్నివేశాలు తెరపై మనకి పెద్దగా కనిపించవు. అందువలన ఆశించిన స్థాయిలో ఈ సినిమా హడావిడి చేసినట్టుగా అనిపించదు. 

పనితీరు: కొడుకు ప్రాణాల కోసం తండ్రి తెగించక తప్పని పరిస్థితిని తీసుకొచ్చి, అతణ్ణి ప్రమాదాల బాట పట్టించడమనే లైన్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అయితే ఆ మార్గంలోని  అవాంతరాలు .. వాటిని అధిగమించడం వంటి సన్నివేశాలు ఆడియన్స్ ఆశించిన రేంజ్ లో ఆవిష్కరించలేకపోయారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. 

ముగింపు
: విచిత్రమైన జంతువులు నగరాలపై విరుచుకు పడటం .. దాదాపు అందరినీ చంపేయడం .. మిగిలిన కొందరు వాటిని ఎదుర్కోవడం వంటి కథతో గతంలో చాలానే కథలు వచ్చాయి. ఆ తరహా కథనే కాస్త తక్కువ ఖర్చుతో చెప్పడానికి చేసిన ఈ ప్రయత్నం ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.