దిలీప్ కథానాయకుడిగా మలయాళంలో రూపొందిన సినిమానే 'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ'.ఈ ఏడాది మే 9వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. దర్శకుడిగా బింటో స్టీఫెన్ కి ఇది మొదటి సినిమా. ఈ సినిమాతోనే కథానాయికగా 'రానియా రాణా' పరిచయమైంది. జూన్ లోనే ఓటీటీకి వచ్చేసిన ఈ సినిమా, ఇప్పుడు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.

కథ: ప్రిన్స్ (దిలీప్) మధ్యతరగతి కుటుంబీకుడు. తల్లీ .. తండ్రి .. ఇద్దరు తమ్ముళ్లు. ఇదే అతని కుటుంబం. అయితే కుటుంబ బాధ్యతల కారణంగా అతని కంటే ముందుగానే ఇద్దరు తమ్ముళ్లకు పెళ్లి జరిగిపోతుంది. తమ్ముళ్లకు ఉద్యోగాలు లేకపోవడంతో వాళ్ల కుటుంబాలను కూడా ప్రిన్స్ పోషిస్తూ ఉంటాడు. అందుకోసం అతను 'బొటిక్' నడుపుతూ కష్టపడుతూ ఉంటాడు. బొటిక్ కి సంబంధించిన  వ్యవహారాలను అతని స్నేహితుడు కేకే చూసుకుంటూ ఉంటాడు. 

తన గురించి .. తన వాళ్ల గురించి .. ముఖ్యంగా తన కుటుంబ పరువు ప్రతిష్ఠలను గురించి ఆలోచించే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ప్రిన్స్ ఉంటాడు. ఆ సమయంలోనే అతనికి సింధు (రానియా రాణా) తారసపడుతుంది. ఆమె అందం .. చలాకీదనం తనకి బాగా నచ్చుతాయి. కాస్త ముదిరిపోయిన తనలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఆమె అంగీకరించడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

సింధుతో పెళ్లికి సమయం దగ్గర పడుతూ ఉన్న సమయంలోనే, ఆమె యూట్యూబర్ అనే విషయం ప్రిన్స్ కి తెలుస్తుంది. అయితే ఈ రోజులలో అది కామన్ అనుకుని అతను సరిపెట్టుకుంటాడు. గుట్టుగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ప్రిన్స్ జీవితంలోకి భార్యగా సింధు అడుగుపెడుతుంది. యూ ట్యూబ్ వీడియోస్  .. సబ్ స్క్రైబర్లు .. లైకులు .. వ్యూస్ అంటూ ఆమె చేసే హడావిడి ప్రిన్స్ ను ఎలా ఇబ్బంది పెడుతుంది? అప్పుడతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: స్మార్ట్స్ ఫోన్ చేతిలోకి వచ్చాక అది చేసే వింతలు .. విచిత్రాలు ఒకటి కాదు .. రెండు కాదు. షార్ట్స్ మొదలు సినిమాల వరకూ స్మార్ట్ ఫోన్ తోనే కానిచ్చేస్తున్నారు. యూ ట్యూబ్ అనేది కొంతమందికి హాబీ అయితే, మరికొంతమందికి ఉపాథిగా మారిపోయింది. ముఖ్యంగా యూత్ లో చాలామంది యూ ట్యూబ్ తో కలిసి పరిగెడుతున్నారు. పోస్టులు .. వ్యూస్ లు .. లైకులు .. ఇవి చూస్తూనే రోజులు గడిపేస్తున్నారు.
             
ఈ విధమైన ఒక లైఫ్ స్టైల్ ద్వారా యువత కోరుకుంటున్నదేమిటి? కోల్పోతున్నదేమిటి? అనే అంశం చుట్టూనే ఈ కథ నడుస్తుంది. జీవితంలోని ఎమోషన్స్ ను వ్యూవర్స్ తో పంచుకోవడం వేరు .. వ్యూస్ కోసం ఎదుటివారి ఎమోషన్స్ ను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం వేరు. అనే విషయాన్ని ఈ కథ ద్వారా దర్శకుడు చెప్పడానికి ప్రయత్నించాడు. పరిమితమైన పాత్రలతో ఆయన ఈ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. 

నెగెటివిటీకి సంబంధించిన విషయాలకు ఎక్కువ వ్యూస్ వస్తాయని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఆ నెగెటివిటీకి అవసరమైన కంటెంట్ ను క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? జీవితాలు ఎలాంటి ప్రమాదంలో పడతాయి? అనే విషయాన్ని దర్శకుడు కామెడీ టచ్ తో చెప్పిన తీరు కనెక్ట్ అవుతుంది. అలాగే ఏ అంశాన్ని కామెడీ టచ్ తో చెప్పాలి .. ఎక్కడ కథ సీరియస్ గా సాగాలి .. ఎక్కడ ఎమోషన్స్ ను తట్టి లేపాలనే విషయంలో దర్శకుడికి పూర్తి క్లారిటీ ఉందనే విషయం మనకి అర్ధమవుతుంది. 

పనితీరు: బింటో స్టీఫెన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్టాఫ్ చాలా సరదాగా .. సందడిగా సాగుతూ వెళుతుంది. ఆ తరువాతనే కథ మలుపు తిరుగుతుంది. ప్రీ క్లైమాక్స్ లో కాస్త టెన్షన్ పెట్టేసిన దర్శకుడు, సంతృప్తికరమైన క్లైమాక్స్ ను అందించగలిగాడు. 

ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలు చాలా పరిమితంగా కనిపిస్తాయి. అయితే ప్రతి పాత్ర సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళుతుంది. దిలీప్ చాలా సీనియర్ ఆర్టిస్ట్. అందువలన ఆయన గొప్పగా చేశాడని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అయితే నాయికగా నటించిన 'రానియా' గురించి మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి. 

'రానియా రాణా'కి ఇదే ఫస్టు మూవీ. తెరపై చూడటానికి కాస్త 'పూజ హెగ్డే' మాదిరిగా అనిపిస్తుంది. కానీ  తన యాక్టింగ్ తో కట్టిపడేస్తుంది. అందం .. అల్లరి .. ఆకతాయితనం .. అసూయ .. పశ్చాత్తాపం ..  వంటి లక్షణాలు కలిగిన ఈ పాత్రలో ఆమె నటన నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ బాగున్నాయి.

ముగింపు: వినోదంతో పాటు సందేశం కలగలసిన కంటెంట్ ఇది. వ్యూస్ కోసం .. లైక్స్ కోసం ఎదుటివారి ఎమోషన్స్ తో ఆడుకోకూడదు. ప్రతి ఒక్కరికీ మనసుంటుంది .. వాళ్లకి ఒక కుటుంబం ఉంటుంది. సమాజం పట్ల బాధ్యతతో నడచుకోవలసిన అవసరం అందరికీ ఉంది అనే సందేశాన్ని ఇచ్చే ఈ సినిమా ఆలోచింపజేస్తుంది .. ఆకట్టుకుంటుంది.