కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఈసారి తనకు కలిసొచ్చిన పోలీస్ పాత్రను నమ్ముకుని ఒప్పుకున్న కథతో చేసిన సినిమా 'మాస్ జాతర' అయితే ఈ సినిమాలో కాస్త వైవిధ్యంగా రైల్వే పోలీస్‌గా పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా? రవితేజ కోరుకున్న కమర్షియల్ విజయం పొందే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయా? లేదా అనేది తెలుసుకుందాం.
కథ: చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్న లక్ష్మణ్ భేరి (రవితేజ) కొన్ని కారణాలతో రైల్వే పోలీస్‌గా ఉద్యోగం సంపాందించుకుంటాడు. సమాజంలో జరిగే అన్యాయాలను తన పరిధిలోకి తెచ్చుకుని మరీ వాళ్లకు న్యాయం చేస్తుంటాడు. వరంగల్‌లో పనిచేసే క్రమంలొ ఓ మంత్రి కొడుకు చేసే అక్రమాలను తన రైల్వే పరిధిలోకి తెచ్చుకుని బుద్దిచెబుతాడు. ఆ తరువాత అల్లూరి జిల్లాలోని అడవి వరంకు ట్రాన్స్‌ఫర్ అవుతాడు.
అక్కడ గంజాయి సాగు చేయించి ఎక్స్‌పోర్ట్ చేసే శివుడు(నవీన్ చంద్ర) అక్రమాలను అడ్డుకుంటాడు. రాజకీయ నాయకులతో పాటు పోలీస్ వ్యవస్థ కూడా శివుడుకు సపోర్ట్ చేస్తుంది. ఇక ఓ సాధారణ రైల్వే పోలీస్ శివుడు అక్రమాలను ఎలా అడ్డుకున్నాడు? అతని గంజాయి వ్యాపారాన్ని ఎలా దెబ్బతీశాడు? తులసి (శ్రీలీల)కి, లక్ష్మణ్ భేరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? హనుమాన్ భేరి (రాజేంద్రప్రసాద్) కథలో ఎలాంటి పాత్ర? అన్నది మిగతా కథ
విశ్లేషణ: సాధారణంగా రవితేజతో సినిమా అనగానే ఆయన పాత్ర చిత్రణ పూర్తి ఉత్సాహంతో, ఎనర్జీతో ఉంటుంది. ఆయన ఎనర్జీ నటనకు ఏ మాత్రం కాస్త కొత్త కథ తోడుగా ఉన్న ప్రేక్షకాదరణ మినిమమ్ గ్యారంటి ఉంటుంది. కానీ ఈ సినిమాలో రవితేజ ఎప్పటిలాగే ఎంతో చలాకీగా ఉన్నాడు. సరైన కథ, కథనాలు లేకపోవడంతో తన నటనతో, చురుకుదనంతో సినిమా అంతా తన భుజస్కందాలపై మోశాడు. సన్నివేశంలో కొత్తదనం కనిపించకపోయినా రవితేజ నటనతో ఆ సన్నివేశం చూడాలనిపించే విధంగా ఉంటుంది. కథలో కొత్తదనం లేకపోవడంతో దర్శకుడు కూడా తన పరిధిని దాటలేకపోయాడు. కథలో ఎలాంటి లాజిక్‌లు కూడా ఉండవు.
రైల్వే పోలీస్ చట్టం తన చేతుల్లోకి తీసుకుని తన ఇష్టరీతిలో మనుషులను చంపుకుంటూ వెళ్లిపోతుంటాడు. సినిమా అంతా ఓ చిన్నపాయింట్ చుట్టే తిరుగుతుంది. హీరో, రాజేంద్రపసాద్ మధ్య వచ్చే సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. శ్రీలీల, రవితేజల మధ్య సన్నివేశాలు ఫర్వాలేదనిపించాయి. సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌కు థ్రిల్ల్‌ను పంచుతాయి. కథ రొటిన్‌గా ఉన్నా రవితేజ ఎనర్జీఫుల్ నటనకు సరిపోయే విధంగా సన్నివేశాల రూపకల్పనలో నవ్యత ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ థ్రిల్ల్‌గా ఫీలయ్యేవారు. దర్శకుడు రవితేజ లాంటి హీరోతో సినిమా చేస్తున్నప్పుడు పెట్టాల్సిన ఎఫర్ట్‌ను బలంగా పెట్టి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి మేకింగ్‌తో ప్రేక్షకులను అలరించేవాడు.
నటీనటుల పనితీరు: లక్ష్మణ్ భేరిగా రవితేజ ఉత్సాహవంతమైన నటనే ఈ చిత్రానికి అతిపెద్ద ప్లస్ పాయింట్. ఆయనలోని ఎనర్జీ ప్రతి సన్నివేశంలో బలహీనతను కవర్ చేయడానికి ప్రయత్నించింది. మాస్ పాటలు,ఫైట్స్, కామెడీ టైమింగ్స్ ఇలా అన్ని అంశాల్లో రవితేజ ప్రతిభ , హుషారు ప్రశంసనీయం. శ్రీలీల క్యూట్‌గా, అందంగా కనిపించింది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. శివుడి పాత్రలో నవీన్‌చంద్ర నటన బాగుంది. హీరో తాతగా రాజేంద్రపసాద్ నవ్వించే ప్రయత్నం చేశాడు. హైపర్ ఆది, వీటీ గణేష్‌లు అక్కడక్కడా నవ్వులు పూయించారు. కెమెరా వర్క్, నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటల్లో ఎనర్జీ ఉన్నా, నేపథ్య సంగీతం విసిగించింది.
ఫైనల్‌గా: రొటిన్ కథతో, విసుగు పుట్టించే సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు రవితేజ నటన, ఎనర్జీ ప్లస్ పాయింట్స్. రవితేజ అభిమానులను ఓ మోస్తరుగా అలరించినా..సగటు ప్రేక్షకులకు మాత్రం ఈ మాస్ జాతర మెప్పించదు.. ఒప్పించదు..
'మాస్ జాతర' సినిమా రివ్యూ
Mass Jathara Review
- కొత్తదనం లేని కథ
- మితిమీరిన హింస
- ఆకట్టుకోని సన్నివేశాలు
- రవితేజ వన్‌మ్యాన్ షో
Movie Details
Movie Name: Mass Jathara
Release Date: 2025-10-31
Cast: Ravi Teja, Sreeleela, Rajendra prasad, Hyper aadi
Director: Bhanu Bhogavarapu
Music: Bheems Ceciroleo
Banner: Sithara Entertainments
Review By: Maduri Madhu
Trailer