ఏ దేశమైనా శత్రు దేశాల నుంచి ఎదురయ్యే దాడులను తిప్పికొట్టడానికీ ..తమ దేశాన్ని కాపాడుకోవడానికి చాలా అప్రమత్తంగా ఉంటుంది. ఏ వైపు నుంచి ఏ దాడి జరుగుతుందనేది ముందుగానే పసిగట్టగలిగే సాంకేతిక నైపుణ్యాన్ని ఆయా దేశాలు ఎప్పటికప్పుడు మెరుగుపరుకుంటూ ఉంటాయి. ఈ విషయంలో అమెరికా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అలా అమెరికన్ పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమానే 'ఎ హౌస్ ఆఫ్ డైనమైట్'. 

అక్టోబర్ 10వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ అవుతోంది. కేథరిన్ బిగ్లో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఇద్రిస్ ఎల్బా(ప్రెసిడెంట్) .. రెబెక్కా ఫెర్గుసన్ (కెప్టెన్ వాకర్) ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: అలాస్కా లోని మిలటరీ బేస్ లో కెప్టెన్ వాకర్ పనిచేస్తూ ఉంటుంది. అమెరికాలోని షికాగో దిశగా ఒక మిస్సైల్ దూసుకురావడాన్ని ఆమె 'రాడార్' లో చూస్తుంది. వెంటనే ఆమె తన టీమ్ తో ఈ విషయాన్ని గురించి అప్రమత్తం చేస్తుంది. తన పై అధికారులతో మాట్లాడుతుంది. వైట్ హౌస్ కి కాల్ చేసి అక్కడి వారిని అలర్ట్ చేస్తుంది. 

'పెంటగాన్' కి చెందిన టీమ్ అంతా రంగంలోకి దిగుతుంది. ఆ మిస్సైల్ షికాగోను టార్గెట్ చేస్తూ దూసుకురావడం గమనిస్తారు. దానిని నిరోధించడానికి వారు చేస్తూ వెళ్లిన ప్రయత్నాల వలన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. దాంతో అధికారులు కూడా తమ ప్రాణాలపై ఆశలు వదులుకోవడం మొదలుపెడతారు. తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఆ మిస్సైల్ ను ఎవరు ప్రయోగించి ఉంటారనేది అమెరికాకు అర్థం కాదు. 

సహజంగానే అమెరికా అనుమానం రష్యా .. చైనా .. పాకిస్థాన్ .. తదితర దేశాలపైకి వెళుతుంది.  షికాగోను టార్గెట్ చేసింది ఎవరైనా, ఈ అవకాశాన్ని ఆధారంగా చేసుకుని మిగతా దేశాలు దాడి చేయడానికి సిద్ధమవుతాయని అమెరికా భావిస్తుంది. అయితే ఈ దాడి తాము చేయలేదని రష్యా స్పష్టం చేస్తుంది. అయితే అమెరికాపై దాడికి పాల్పడింది ఎవరు?  అమెరికా ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయం ఏమిటి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: అమెరికా వంటి దేశంపై శత్రు దేశాలు దాడికి పాల్పడితే అక్కడి రక్షణ వ్యవస్థ ఎలా స్పందిస్తుంది? అధికార యంత్రాన్గమ్ ఎలా పనిచేస్తుంది? ఎవరు ఎవరిని ఎలా సంప్రదిస్తారు? ఏ వైపు నుంచి ఎవరి ఆదేశాలు అవసరమవుతాయి? తక్షణమే స్పందించవలసిన అధికారులు ఎవరు?  అనే విషయంలో డైరెక్షన్ టీమ్ కి పూర్తి అవగాహన ఉండవలసిన అవసరం ఉంటుంది. అప్పుడే ఈ కంటెంట్ ఆశించిన ఉత్కంఠను ఆవిష్కరించగలుగుతుంది. 

ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకురాలు ఈ విషయంలో కాస్త గట్టిగానే కసరత్తు చేసినట్టుగా కనిపిస్తుంది. రక్షణ వ్యవస్థ వైపు నుంచి ఆందోళన .. ఆదుర్దా .. నిర్ణయాలు .. అభిప్రాయాలు .. ఇలా ఒకరకమైన టెన్షన్ వాతావరణాన్ని ఆవిష్కరించడం వలన సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. అలాగే ప్రెసిడెంట్ .. ఆయన అనుచర వర్గానికి సంబంధించిన విషయాలను ఆవిష్కరించిన విధానం బాగుంది. 

అయితే 'రాడార్' కనిపించే ప్రయోగాలు .. క్యాబిన్లలో కనిపించే టెన్షన్ వాతావరణం అంతా కూడా నాలుగు గోడల మధ్యనే జరుగుతూ ఉంటుంది. ఫోన్ సంభాషణలలోనే కథ అంత నడుస్తుంది. కథ నాలుగు గోడలను దాటుకుని బయటికి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అందువలన యాక్షన్ జోలికి వెళ్లకుండా, ప్రేక్షకులకు హడావిడిని మాత్రమే చూపించినట్టుగా అనిపిస్తుంది.

పనితీరు: దర్శకత్వం వైపు నుంచి చూస్తే, పూర్తి ఫోకస్ ప్రధానమైన అంశంపైనే పెట్టినట్టుగా కనిపిస్తుంది. రాడార్ ను పరిశీలించడం .. ఫోన్ లో సంభాషించడం వంటి అంశాలకే ప్రాధాన్యతను ఇవ్వడం వలన పెద్దగా కిక్ ఇవ్వదు. నటీనటుల నటన మాత్రం  సహజత్వానికి దగ్గరగా అనిపిస్తుంది. 

 ముగింపు: అమెరికా రక్షణ విభాగంతో ముడిపడిన పొలిటికల్ థ్రిల్లర్ ఇది. అయితే ఎక్కడా యాక్షన్ అనేది లేకుండా,  సన్నివేశాలు సంభాషణల వరకే పరిమితం కావడం వలన ఓ మాదిరిగా అనిపిస్తుంది. అభ్యతరకరమైన సన్నివేశాలు లేకపోవడం వలన, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.