మొదటి నుంచి కూడా ఈ టీవీ కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వెళ్లడం కనిపిస్తుంది. ఓటీటీ ద్వారా కూడా ఈ తరహా కంటెంట్ ను ప్రోత్సహిస్తూ వెళుతోంది. అలా 'ఈటీవీ విన్' నుంచి వచ్చిన మరో సినిమాగా 'ఒక మంచి ప్రేమకథ' కనిపిస్తుంది. రోహిణి హట్టంగడి .. రోహిణి .. సముద్రఖని ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: అది ఒక అందమైన పల్లెటూరు. అక్కడ రంగమణి (రోహిణి హట్టంగడి) ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది. ఆ ఊళ్లో తనకున్న ఐదు ఎకరాల భూమిని కౌలుకు ఇచ్చి .. ఆ వచ్చిన డబ్బుతో రోజులు నెట్టుకొస్తూ ఉంటుంది. ఆ ఊరు వాళ్లకు తోచిన సాయం చేస్తూ, అందరి మంచినీ కోరుకుంటూ ఉంటుంది. ఆ ఊరు స్కూల్లో టీచర్ గా పనిచేసే శంకర్ .. వంటపని చేసి పెట్టే మహి రంగమణికి సాయంగా ఉంటారు. 

రంగమణి కూతురు సుజాత (రోహిణి) అల్లుడు ఈశ్వర్ (సముద్రఖని) బెంగుళూరులో ఉంటారు. మనవరాలు అనన్య ఫారిన్ లో చదువుతూ ఉంటుంది.  సుజాత - ఈశ్వర్ ఇద్దరూ కూడా కార్పొరేట్ సంస్థలలో పనిచేస్తూ, ఉరుకుల పరుగుల జీవితాలను గడువుతూ ఉంటారు. తన తల్లితోనే కాదు, తన కూతురుతోను మాట్లాడటానికి కూడా సుజాత సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా ఆ భార్యాభర్తల మధ్య .. ఆ ఇద్దరికీ కూతురుతోను సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.

రంగమణి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఆ విషయం ఆమెకి తెలుస్తూనే ఉంటుంది. తన కూతురుతో కలిసి ఒక నెల రోజుల పాటు హ్యాపీగా గడపాలనేది ఆమె చివరి కోరిక. అయితే తల్లి తనకి తరచూ కాల్స్ చేయిస్తూ ఇబ్బందిపెడుతోందనే ఉద్దేశంతో, ఆమెని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పించాలని సుజాత నిర్ణయించుకుంటుంది. ఆ ఉద్దేశంతోనే తల్లి దగ్గరికి వెళుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? తల్లి కోరిక నెరవేరుతుందా? కూతురు ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదగాలనీ .. ఎగరాలని కోరుకుంటారు. అయితే వృద్ధాప్యంలో తమ పిల్లలు తమ దగ్గర ఉండాలని భావిస్తారు. తమ పిల్లలతో కలిసి గడపాలని కోరుకుంటారు. ఉన్న ఊరును వదిలిపెట్టలేక .. తమ పిల్లలకు దూరంగా ఉండలేక భారంగా రోజులు గడుపుతూ ఉంటారు. ఇక ఈ పోటీ ప్రపంచంలో పరిగెడుతూ ఉద్యోగాలు కాపాడుకోవడమే గగనమైపోయిన ఈ రోజులలో, తల్లిదండ్రులను పట్టించుకునే సమయం లేని పిల్లల అవస్థ నాణానికి మరో వైపు. 

సమాజంలో చాలామంది ఫేస్ చేస్తున్న పరిస్థితి ఇది. అలాంటి ఈ సమస్యను ఆధారంగా చేసుకునే, 'ఓల్గా' ఈ కథను అల్లుకున్నారు. అవసరాన్ని బట్టి మారాలి .. అదే జీవితమని భావించే కూతురు పాత్ర, మార్పు మంచిదేగానీ .. అది బంధాలను దెబ్బతీయకూడదు అని నమ్మే తల్లి పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చివరికి ఎవరు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు? అనే అంశం చుట్టూ ఈ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. 

థ్రిల్లర్ జోనర్ .. హారర్ జోనర్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న ప్రేక్షకులను ఒకసారి అలా ఒడ్డుకు తీసుకుని వెళ్లి, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కంటెంట్ తో సేదతీర్చే సినిమా ఇది. సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరించడమే ప్రధానమైన ఉద్దేశంగా సన్నివేశాలు సాగుతాయి. కన్నవాళ్లకు సాయంగా ఉండటమంటే, పిల్లలు తమని తాము రీఛార్జ్ చేసుకోవడమే అనే విషయాన్ని కనెక్ట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. 

చివరి రోజులలలో తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవడం కోసం ఆయా సంస్థలు సెలవులు ఇవ్వాలనే ఆలోచన కూడా బాగుంది. జీవితంలో ఏం సంపాదిస్తున్నామనే విషయమే కాదు, ఏం కోల్పోతున్నామో కూడా గ్రహించగలగాలి అనే సందేశాన్ని ఇచ్చిన తీరు మెప్పిస్తుంది. వసారాలో వాలు కుర్చీలో కూర్చుని .. వేయించిన వేరుశనగలు తింటూ ఒక మంచి పుస్తకం చదివితే ఎలా ఉంటుందో .. ఈ సినిమా చూస్తుంటే అలా అనిపిస్తుంది.

పనితీరు: ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలలో మాదిరిగా ఈ కథలో హడావిడి కనిపించదు. కథ నిదానంగా నడుస్తుంది. సహజత్వంతో కూడిన సన్నివేశాలతో నడిచే ఈ కథ, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది. విటమిన్ల లోపం ఆరోగ్యాన్ని దెబ్బతీసినట్టుగానే, ప్రేమ లోపం కూడా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అనే అంశం చుట్టూ 'ఓల్గా' నడిపించిన కథ ఆలోచింపజేస్తుంది. చాలా తక్కువ పాత్రలతో .. బలమైన కథను చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

మధు అంబట్ ఫొటోగ్రఫీ .. రాధాకృష్ణన్ సంగీతం .. లెనిన్ ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తాయి. 'ప్రేమకు కూడా రోజూ పోషణ కావాలి' .. 'వికసించడం లోనే కాదు .. పండిపోవడంలో కూడా అందం ఉంది' అనే డైలాగ్స్ మనసుకు తాకుతాయి