మలయాళ దర్శకుడిగా జీతూ జోసెఫ్ కి మంచి పేరు ఉంది. ఆయన నుంచి వచ్చిన 'దృశ్యం' .. 'దృశ్యం 2' సినిమాలు, మోహన్ లాల్ - అనశ్వర రాజన్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'నేరు' సినిమాలు కథకుడిగా జీతూ జోసెఫ్ కి గల పట్టును చాటిచెబుతాయి. అలాంటి ఆయన నుంచి వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ 'మిరాజ్'. సెప్టెంబర్ 19వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: అభిరామి (అపర్ణ బాలమురళి) రాజశేఖర్ అనే వ్యాపార వేత్తకి సంబంధించిన ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటుంది. అక్కడే ఆమెకి కిరణ్ (హకీమ్ షాజహాన్) పరిచయమవుతాడు. ఇద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడతారు. కిరణ్ అంత నమ్మదగిన వ్యక్తి కాదని అభిరామితో ఆమె స్నేహితురాలు 'రీతూ' చెబుతూ ఉంటుంది. అయినా ఆమె మాటలను అభిరామి పట్టించుకోదు. 'పాలక్కాడ్' దగ్గర జరిగిన రైలు ప్రమాదంలో కిరణ్ చనిపోయాడని తెలిసి అభిరామి షాక్ అవుతుంది.
కిరణ్ వస్తువులను అభిరామి గుర్తిస్తుంది. అయితే డెడ్ బాడీ గుర్తుపట్టలేనంతగా దెబ్బతినడంతో చూడలేకపోతుంది. కిరణ్ జ్ఞాపకాల నుంచి బయటపడటం కోసం రీతూ ఇంటికి వస్తుంది. ఒక రోజున ఎస్ పి ఆర్ముగం (సంపత్ రాజ్) అభిరామిని కలుసుకుంటాడు. కిరణ్ దగ్గర ఒక 'హార్డ్ డిస్క్' ఉందనీ, దాని గురించి ఏమైనా తెలుసా? అని అడుగుతాడు. తెలిస్తే తనకి కాల్ చేయమని చెప్పివెళ్లిపోతాడు. ఆ వెంటనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అశ్విన్ (అసిఫ్ అలీ) ఆమెను కలుస్తాడు.
అశ్విన్ కూడా ఆమెను ఆ 'హార్డ్ డిస్క్' గురించే అడుగుతాడు. పోలీసులను నమ్మొద్దనీ, హార్డ్ డిస్క్ తనకి మాత్రమే ఇవ్వమని చెప్పి వెళతాడు. అంతలో రాజశేఖర్ ప్రధాన అనుచరుడు 'రియాజ్' అక్కడికి వస్తాడు. అతను కూడా హార్డ్ డిస్క్ గురించి ఆమెను బెదిరిస్తాడు. అది మీడియావారికి ఇచ్చినా .. పోలీస్ వారికి ఇచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తాడు. ఆ 'హార్డ్ డిస్క్' లో ఏముంది? అది తెలుసుకున్న అభిరామి ఏం చేస్తుంది? ఆమె నేపథ్యం ఏమిటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ: జీతూ జోసెఫ్ తయారు చేసుకునే కథలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. మధ్యతరగతి జీవితాల నుంచి తీసుకునే ఆ కథాంశాలు ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆయన సినిమాలలోని ట్విస్టులను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందువలన దర్శకుడిగా ఆయన పేరు కనిపించగానే ఆడియన్స్ ఆ సినిమాలను చూడటానికి ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలా వచ్చిన సినిమానే 'మిరాజ్'.
నేరస్థులు .. బాధితులు .. రౌడీయిజంతో కూడిన రాజకీయం .. పోలీస్ డిపార్టుమెంటు చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. అరడజను ప్రధానమైన పాత్రలతోనే ఈ కథ పరిగెడుతూ ఉంటుంది. దర్శకుడు ప్రతి పాత్రను చాలా నీట్ గా డిజైన్ చేశాడు. అలాగే కథ చెప్పిన విధానం .. సంభాషణలు రాసుకున్న తీరు ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కథ అర్థమయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ .. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ దృశ్యాలు ఈ కథా బలాన్ని పెంచుతాయి.
ఈ కథలో చకచకా మలుపులు చోటుచేసుకుంటాయి. సన్నివేశాలు లొకేషన్స్ మార్చుకుంటూ వెళుతూ ఉంటాయి. ఆ మలుపులను ఆడియన్స్ ఇంట్రస్టింగ్ గానే ఫాలో అవుతుంటారు. ఏం జరుగుతుందా? అనే క్యూరియాసిటీ తప్ప, ప్రధానమైన పాత్రకి ఏమౌతుందో అనే ఆందోళన కలగదు. అందుకు కారణం ఎమోషన్స్ వైపు నుంచి ఈ కథ కనెక్ట్ కాకపోవడమే. 'దృశ్యం' .. 'దృశ్యం 2' .. 'నేరు' సినిమాలకి .., ఈ సినిమాకి ఉన్న తేడా ఇదే.
పనితీరు: జీతూ జోసెఫ్ దర్శక ప్రతిభ గురించి .. స్క్రీన్ ప్లేపై ఆయనకి గల పట్టు గురించి ఆయన గత చిత్రాలు చెబుతూ ఉంటాయి. ఆడియన్స్ ఊహకి అందని మలుపులు తెరపై ఆవిష్కరించడంలో ఆయన తరువాతనే ఎవరైనా అనిపిస్తుంది. ఈ సినిమా విషయంలోను అదే పోకడ కనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ బిత్తరపోయేలా చేస్తుంది.
అసిఫ్ అలీ .. అపర్ణ బాలమురళి .. సంపత్ రాజ్ .. వీళ్లంతా సీనియర్ ఆర్టిస్టులు. తెరపై తమ పాత్రలు మాత్రమే కనిపించేలా నటించారు. సతీశ్ కురుప్ ఫొటోగ్రఫీ బాగుంది. అవకాశం దొరికినప్పుడల్లా అందమైన లొకేషన్స్ ను తెరపైకి తీసుకుని వచ్చారు. విష్ణు శ్యామ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. అనవసరమైన సన్నివేశాలు ఎక్కడా లేకుండా, వినాయాక్ష్ ఎడిటింగ్ మెప్పిస్తుంది.
ముగింపు: ఇది జీతూ జోసెఫ్ సినిమా .. కథలోని ప్రతి మలుపులోను మనకి ఆ ముద్ర కనిపిస్తూనే ఉంటుంది. అనూహ్యమైన మలుపులు ఆకట్టుకుంటాయి. అయితే ఎమోషన్స్ వైపు నుంచి కనెక్ట్ కాకపోడం వలన, గత సినిమాల స్థాయిలో మనకి కనిపించదు అంతే.
'మిరాజ్' (సోనీ లివ్) మూవీ రివ్యూ!
Mirage Review
- మలయాళంలో రూపొందిన 'మిరాజ్'
- ఆకట్టుకునే కథాకథనాలు
- అనూహ్యమైన మలుపులు
- హైలైట్ గా నిలిచే క్లైమాక్స్ ట్విస్ట్
- కనెక్ట్ కాలేకపోయిన ఎమోషన్స్
Movie Details
Movie Name: Mirage
Release Date: 2025-10-19
Cast: Asif Ali,Aparna Balamurali,Hakim Shahjahan,Hannah Reji Koshy,Saravanan
Director: Jeethu Joseph
Music: Vishnu Shyam
Banner: Naad Sstudios - E4 Experiments
Review By: Peddinti
Trailer