అథర్వ మురళి హీరోగా తమిళంలో రూపొందిన సినిమానే 'థనల్'. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాలో అథర్వ మురళి జోడీగా లావణ్య త్రిపాఠి నటించింది. జాన్ పీటర్ నిర్మించిన ఈ సినిమాకి రవీంద్ర మాధవ్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 12వ విడుదలైన ఈ సినిమా, 'టన్నెల్' పేరుతో తెలుగులోను విడుదలైంది. అలాంటి ఈ సినిమా ఈ నెల 17వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: అఖిల్ (అథర్వ మురళి) అనూ (లావణ్య త్రిపాఠి) ప్రేమించుకుంటారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకుని వెళతారు. అయితే అఖిల్ ప్లస్ టూ దాటక పోవడంతో, అతనితో అనూ పెళ్లి జరిపించడానికి ఆమె తండ్రి నిరాకరిస్తాడు. దాంతో అఖిల్ తన స్నేహితులతో కలిసి కానిస్టేబుల్ జాబ్ తెచ్చుకుంటాడు. రెండేళ్ల క్రితం ఒక ట్రాన్స్ ఫార్మర్ పేలిపోయిన ప్రమాదంలో ఆరుగురు పోలీసులు చనిపోతారు. ఆ ప్లేస్ లో అఖిల్ మిత్ర బృందం జాయిన్ అవుతుంది.
అఖిల్ తల్లి ఒక సర్జరీ కోసం హాస్పిటల్లో చేరుతుంది. అందుకు అవసరమైన డబ్బు ఎకౌంటులో ఉంటుంది. అయితే అందుకు సంబంధించిన బ్యాంక్ ప్రాసెస్ ను పూర్తిచేసే పనిలో అఖిల్ ఉంటాడు. అయితే జాయినింగ్ రోజే అఖిల్ మిత్ర బృందానికి ఒక అనూహమైన సంఘటన ఎదురవుతుంది. ఆ రోజు రాత్రి వాళ్లు ఒక రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉండగా, ఒక వ్యక్తి రోడ్డుపై నున్న డ్రైనేజ్ ప్లేట్ తొలగించుకుని పైకి రావడం చూస్తారు.
ఆ వ్యక్తిని ఫాలో అవుతూ ఆరుగురు కానిస్టేబుల్స్ ఒక స్లమ్ ఏరియాకు వెళతారు. అక్కడ ఒక గ్యాంగ్ వారి కంటపడుతుంది. ఆ గ్యాంగ్ ఏం చేస్తుందన్నది అఖిల్ అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ విషయం బయట ప్రపంచానికి చెప్పాలంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. తాము అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడటం కూడా కష్టమేననే విషయం అఖిల్ బ్యాచ్ కి అర్థమవుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? ఆ గ్యాంగ్ కి లీడర్ ఎవరు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? అనేది కథ.
విశ్లేషణ: కొన్ని కథలు ఒకే ఒక్క రాత్రిలో జరుగుతుంటాయి. తెల్లవారేలోగా ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠతో ఈ తరహా కథలు పరిగెడుతూ ఉంటాయి. అలాంటి ఒక కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఇది. ఒకే పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ గా పోస్టింగ్ తీసుకున్న ఆరుగురు యువకులు ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటారు? అనే కథ ఇది. ఈ సినిమా మొదలైన 45 నిమిషాల తరువాత నుంచి దాదాపుగా చీకటిలోనే నడిచే ఈ కథ, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి.
చీకటి అనేది ఒక ప్రత్యేక ప్రపంచం. చీకటికి అవతల ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. అందువలన చీకటి నేపథ్యంలో జరిగే కథల పట్ల ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. చీకట్లో ఏం జరుగుతుందనేది కనిపించేలా చిత్రీకరించడం ఒక ఆర్ట్ అనే చెప్పాలి. అయితే సహజత్వం కోసం దర్శకుడు చేసిన ప్రయత్నం కారణంగా, ఆ చీకట్లో ఏం జరుగుతుందనేది మనకు తేలికగా అర్థం కాదు.
ఇక అసలు కథను గాడిలో పెట్టడానికి దర్శకుడు 45 నిమిషాల సమయం తీసుకున్నాడు. ఈ సమయంలో హీరో - హీరోయిన్ వైపు నుంచి లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్స్ ఎంతో కొంత వర్కౌట్ చేయవచ్చు. కానీ అలా జరగలేదు. ఇక ఆరంభంలోనే తనలో రాక్షసత్వాన్ని పీక్స్ లో చూపించిన విలన్, ఆ తరువాత చాలా సేపు తెరపైకి రాడు. విలన్ ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఆయన ఎంచుకున్న మార్గం .. తెరపై అవసరానికి మించిన చీకటి అసహనాన్ని కలిగిస్తాయి.
పనితీరు: రవీంద్ర మాధవ రాసుకున్న ఈ కథలో, ఒక్కరాత్రిలో జరిగే సంఘటన అనేదే కుతూహలాన్నిరేకెత్తించేదిగా కనిపిస్తుంది. అయితే ఆ దిశగా సాగే ఆ కథలో పెద్దగా ట్విస్టులు కనిపించవు. ఫస్టాఫ్ లో చాలా సమయాన్ని వృథా చేసినట్టుగా అనిపిస్తుంది. ఆర్టిస్టులంతా ఎవరి పాత్రలో వారు బాగానే చేశారు. విలన్ .. ఆరుగురు కానిస్టేబుల్స్ మినహా మిగతా ఏ పాత్రలకి పెద్దగ ప్రాధాన్యత లేదు.
శక్తి శరవణన్ ఫొటోగ్రఫీ బాగానే ఉంది. కాకపోతే చీకట్లో ఏం జరుగుతుందనేది మరింత స్పష్టంగా చూపిస్తే బాగుండేది. జస్టిన్ ప్రభాకరన్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. కళావన్నన్ ఎడిటింగ్ వర్క్ నీట్ గానే అనిపిస్తుంది.
ముగింపు: రాత్రివేళ .. చీకట్లో నడిచే ఈ కథలో తెరపై ఏం జరుగుతుందనేది ప్రేక్షకుడికి అంత తేలికగా అర్థం కాదు. కథలోగానీ .. కథనంలోగాని అంత బలం కనిపించదు. లవ్ .. రొమాన్స్ వైపు నుంచి అవకాశం ఉన్నప్పటికీ, దృష్టి పెట్టకపోవడం మరో మైనస్ గా అనిపిస్తుంది.
'టన్నెల్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Tunnel Review
- అథర్వ మురళి హీరోగా 'టన్నెల్'
- సర్వైవల్ థ్రిల్లర్ జోనర్ లో సాగే కంటెంట్
- ఆకట్టుకోని కథాకథనాలు
- కనెక్ట్ కాని ఎమోషన్స్
Movie Details
Movie Name: Tunnel
Release Date: 2025-10-17
Cast: Atharvaa Murali, Lavanya Tripathi, Ashwin Kakumanu, Shah Ra, Barani, Dileepan
Director: Radha Madhava
Music: Justion Prabhakaran
Banner: Annai Film Production
Review By: Peddinti
Trailer