మొదటి నుంచి కూడా కిరణ్ అబ్బవరం మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందినదే 'కె - ర్యాంప్'. రాజేశ్ దండ - శివ బొమ్మక్ నిర్మించిన ఈ సినిమాకి, జైన్స్ నాని దర్శకత్వం వహించాడు. యుక్తి తరేజా కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: హైదరాబాదులోని ఓ శ్రీమంతుడి కొడుకే కుమార్ (కిరణ్ అబ్బవరం). తల్లిలేని కారణంగా తండ్రి అతణ్ణి గారంగా పెంచుతాడు. ఖరీదైన జీవితం కళ్లముందు ఉన్నప్పటికీ, కుమార్ కి మాస్ లైఫ్ స్టైల్ ఇష్టం. ఫ్రెండ్స్ తో కలిసి మందు పార్టీలతో కాలక్షేపం చేస్తున్న కుమార్ ను ఇక లోకల్ లో ఉంచడం మంచిది కాదని భావించిన తండ్రీ, కేరళలోని 'కొచ్చిన్'లో ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ చేస్తాడు.

'కొచ్చిన్' లోనే కుమార్ మేనమామ (నరేశ్) ఉంటాడు. అతను కుమార్ అక్కడ ఉండటానికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తాడు. అతను కాస్త రొమాంటిక్ అనే విషయాన్ని కుమార్ గమనిస్తాడు. కొచ్చిన్ వెళ్లినా కుమార్ తాగుతూనే లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ కాలేజ్ లోనే మెర్సీ (యుక్తి తరేజా) తారసపడుతుంది. మెర్సీని చూడగానే కుమార్ మనసు పారేసుకుంటాడు. అప్పటి నుంచి ఆమె చుట్టూ తిరగడం మొదలుపెడతాడు.

మెర్సీకి ఒక సమస్య ఉందనీ, ఆ సమస్య ఏమిటో తెలుసుకోమని ఆమె స్నేహితురాలు ప్రియా చెబుతున్నప్పటికీ కుమార్ లైట్ తీసుకుంటాడు. మెర్సీని చాలా గాఢంగా లవ్ చేస్తూ వెళతాడు. అటు వైపు నుంచి మెర్సీ పెదనాన్నను .. ఇటు వైపు నుంచి తన తండ్రిని ఈ పెళ్లికి ఒప్పిస్తాడు. అప్పుడు అతనికి మెర్సీ కి ఉన్న సమస్య గురించి తెలుస్తుంది. ఆ సమస్య ఏమిటి? అది తెలుసుకున్న కుమార్ ఏం చేస్తాడు? ఆయన జీవితం ఎలాంటి మార్పులకు లోనవుతుంది? అనేది కథ. 

విశ్లేషణ: ప్రేమకి .. ఆకర్షణకి మధ్య ఉన్న సన్నని గీత చాలామందికి అర్థం కాదు. నిజంగా ప్రేమించడమంటూ జరిగితే అవతల వ్యక్తిలోని లోపాలను .. బలహీనతలను అర్థం చేసుకోవాలి .. వాళ్లకి భరోసాగా నిలవాలి అనే ఒక ప్రధానమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు వాళ్లను ఎంతగా ప్రభావితం చేస్తాయో, ఎదిగిన పిల్లలను నియంత్రించలేక తల్లిదండ్రులు పడే బాధ ఎలా ఉంటుందనేది చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు.

అయితే దర్శకుడు తాను చెప్పదలచుకున్న కథను ఆసక్తికరంగా చెప్పాడా లేదా? అంటే, చెప్పలేదనే అనుకోవాలి. కొన్ని కథలు మొదటి నుంచి చివరివరకూ కుతూహలంతో కొనసాగుతాయి. మరికొన్ని కథల్లో ఎక్కడో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. అక్కడివరకూ కథను లాగుతూ వెళతారు. ఈ రెండో కేటగిరికి చెందిన కథగా మనకి ఇది తోస్తుంది. అక్కడివరకూ కథకంటే హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. 

సెకండాఫ్ లో మరింత వినోదం ఉంటుందని ఆడియన్స్ ఆశించడం సహజం. కానీ సెకండాఫ్ అంతా కూడా హీరోను హీరోయిన్ టెన్షన్ పెట్టడమే సరిపోతుంది. అందుకు సంబంధించిన సన్నివేశాలలో వినోదం లోపించడంతో, తెరపై గందరగోళ వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుంది. 'ఇంత టార్చర్ పెట్టే అమ్మాయిని చేసుకోవడం అవసరమా?' అని హీరో అంటే, మీ నాన్నను నువ్వు పెట్టిన టార్చర్లో ఇది ఎంతరా?' అంటాడు హీరోగారి మేనమామ. ఇదెక్కడి లాజిక్కో అర్థం కాక ఆడియన్స్ అయోమయంలో పడతారు.

కిరణ్ అబ్బవరం మాస్ లుక్ .. యాక్షన్ .. డాన్సులు గట్రా బాగానే ఉన్నాయి. మాస్ ఆడియన్స్ ను అలరించాలనే ఆయన ఉద్దేశం కూడా మంచిదే. అలాంటప్పుడు ఆ తరహా కంటెంట్ ను సెట్ చేసుకుంటే బాగుండేది. అవకాశం లేని కథలో .. ఇలాంటి ఒక అవకాశాన్ని సృష్టించుకోవడమే పొంతన లేనిదిగా అనిపిస్తుంది. 

పనితీరు: దర్శకుడు ఈ కథ ద్వారా ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడనే విషయం ఆడియన్స్ కి అర్థమవుతుంది. కాకపోతే ప్రధానమైన అంశం వైపుకు ఆడియన్స్ ను లాక్కెళ్లే వినోదం లోపించింది. చివరికి వెన్నెల కిశోర్ ను రంగంలోకి దింపినా ప్రయోజనం లేకుండా పోయింది. క్లైమాక్స్  కి వచ్చేశాం గదా అని పాత్రలు ఒకదాని తరువాత ఒకటిగా మారిపోవడం నాటకీయంగా అనిపిస్తుంది. 

కిరణ్ అబ్బవరం కాస్త ఒళ్లు చేశాడు .. మాస్ యాక్షన్ తో మెప్పించాడు. హీరోయిన్ యుక్తి తరేజా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నరేశ్ పాత్ర ద్వారా నవ్వించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. సాయికుమార్ .. మురళీధర్ గౌడ్ పాత్రలు కూడా పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. సతీశ్ రెడ్డి ఫొటోగ్రఫీ .. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఓకే. చైతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం, సన్నివేశాలకు మించి సాగినట్టుగా అనిపిస్తుంది. 

ముగింపు: ఈ కథలో లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ ఉన్నాయి. అయితే కథలో వాటిని కలపడం కుదరలేదు. అందుకు అవసరమైన కసరత్తు జరగలేదు. కిరణ్ అబ్బవరం ఎంచుకున్న ఈ కథకీ, తనకి ఇష్టమైన మాస్ లుక్ తో కనిపించడానికి చేసిన ప్రయత్నానికి పొంతన లేకపోవడం కూడా ఒక లోపంగా అనిపిస్తుంది.