డీజే టిల్లు పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైన కథానాయకుడు సిద్దు జొన్నలగడ్డ. డీజే టిల్లు, టిల్లు -2 చిత్రాలతో మాస్‌లో ఫాలోయింగ్‌ను సంపాందించుకున్న ఈ యువ హీరో తన ఇమేజ్‌ భిన్నంగా నటించిన చిత్రం 'తెలుసు కదా' . కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ్‌ కోన తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా తెలుసుకుందాం. 

కథ: వరుణ్‌ (సిద్ధు) చిన్నప్పుడే కుటుంబాన్ని కోల్పోయిన ఓ అనాథ. తనకంటూ ఎవరూ ఉండరు. అందుకే తనకు ఓ కుటుంబం, పిల్లలు  కావాలనుకుంటాడు. ఓ రెస్టారెంట్‌కు చీఫ్‌ చెఫ్‌గా.. యజమానిగా ఉండే సిద్ధు రాగ (శ్రీనిధి శెట్టి)  ప్రేమిస్తాడు. అయితే రాగకు మాత్రం పెళ్లి, పిల్లలు ఇలాంటివి తనకు ఆసక్తి లేదని హ్యపీగా రిలేషిన్‌ షిప్‌లో ఉండాలని భావిస్తుంది. అయితే అభిప్రాయ భేదాల కారణంగా సిద్దు, రాగ దూరమవుతారు. 

కొన్నాళ్ల తరువాత పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోని ద్వారా కొంత మంది అమ్మాయిలను కలుస్తుంటాడు సిద్ధు. ఈ తరుణంలోనే తనకు నచ్చిన అంజలి (రాశి ఖన్నా)ను వివాహాం చేసుకుంటాడు. ఇద్దరికీ పిల్లలంటే ఎంతో ఇష్టం. కానీ వీళ్లిద్దరి మధ్య ఓ సమస్య ఎదురవుతుంది. అనూహ్యంగా వీళ్ల జీవితంలోకి మళ్లీ రాగ వస్తుంది. అసలు వరుణ్‌, అంజలిల కాపురంలోకి రాగ ఎందుకొచ్చింది? ఆమె వచ్చాక ఈ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ: దర్శకురాలు నీరజ కోన ఓ కొత్తపాయింట్‌ను తీసుకుని దాని చుట్టూ కుటుంబ భావోద్వేగాలను అల్లుకుని, ముక్కోణపు రొమాంటిక్‌ ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ పాయింట్‌తో ప్రేక్షకులు అంత తొందరగా కనెక్ట్‌ కాలేరు. చాలా ఆధునిక ఆలోచనలతో కొనసాగే పాత్రల చుట్టు ఈ కథ నడుస్తుంటుంది. సాధారణంగా సగటు కుటుంబ ప్రేక్షకుల ఆలోచనలకు దూరంగా, ఎంతో అల్ట్రా మోడ్రరన్‌ థింకింగ్‌తో ఈ కథ ఉండటం ఈ సినిమాకు మైనస్‌. అయితే ఈ కథతో, పాత్రలతో కనెక్ట్‌ అయిన వాళ్లకు మాత్రం ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది. మిగతా వాళ్లకు ఇలాంటి సంఘటనలు మన సమాజంలో జరుగుతాయా? అనే సందేహం కలుగుతుంది. 

వరుణ్‌ అనే పాత్రను దర్శకురాలు మలిచిన విధానం కూడా కొత్తగా, ట్రెండ్‌కు దూరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా మొత్తం నాలుగు పాత్రల చుట్టే తిరుగుతుంటుంది. అందుకే చూసిన సన్నివేశాలే మళ్లీ మళ్లీ చూసిన భావనలో ప్రేక్షకుడు ఉండిపోతాడు. ప్రేమికుడు, ప్రేయసి విడిపోయిన తరువాత ప్రేయసి మళ్లీ ప్రియుడి జీవితంలోకి రావడం.. ఇలాంటి కథతో గతంలో కూడా వచ్చినా.. ఇందులో మాజీ ప్రేయసి అతని జీవితంలోకి ప్రవేశించిన విధానం డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాకు దర్శకురాలు ఇదే ప్రధాన ఎస్సెట్‌గా భావించి ఈ సినిమాను తీర్చిదిద్దారు. ప్రథమార్థం సరదాగా సాగిపోతుంది. ద్వితీయార్థంలోనే  అసలు పరీక్ష మొదలైంది. 

కొన్ని కొన్ని సన్నివేశాలను దర్శకురాలు తెరకెక్కించిన విధానం ఆమె ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. కథానాయకుడు పాత్ర ఔచిత్యం, ఆ పాత్ర మెచ్యూరిటీ లెవల్స్‌ కాస్త ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది. సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ పాత్రకు పెట్టిన కొన్ని బోల్ట్‌ డైలాగ్స్‌ కుటుంబ ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది పెడతాయి. కొత్తదనంతో కూడిన అంశాలతో, పాత్రలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆధునిక భావాలతో ఉన్న ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంది. 


నటీనటుల పనితీరు: ఇప్పటి వరకు టిల్లుగా  అందరికి తెలిసిన సిద్దు.. ఇందులో వరుణ్‌గా మెప్పించాడు. తన మార్క్‌ డైలాగ్‌ డెలివరీతో వినోదాన్ని కూడా పండించాడు. శ్రీనిధి శెట్టి తన పాత్రలో ఒదిగిపోయింది. రాశి ఖన్నా అందంగా కనిపించింది. అంజలి పాత్రకు కరెక్ట్‌గా యాప్ట్‌ అయ్యింది. హాస్య నటుడు హర్ష తొలిసారిగా తన ఇమేజ్‌కు భిన్నంగా ఓ కీలక పాత్రలో కొత్తగా కనిపించాడు. ఈ సినిమా నేపథ్య సంగీతంతో  ఇటీవల వచ్చిన 'ఓజీ'చిత్రాన్ని మరోసారి గుర్తు చేశాడు తమన్. 

సినిమా విజువల్స్‌ ఎంతో బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. దర్శకురాలిగా నీరజ కోనకు తొలిచిత్రమైనా తను ఎంచుకున్న పాయింట్‌ను ఎంతో నిజాయితీగా, ఎలాంటి డీవీయేషన్స్‌ లేకుండా హ్యాండిల్‌ చేసింది. అక్కడక్కడా సంభాషణలు గుర్తుపెట్టుకునే స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో పూర్తిగా మల్లీప్లెక్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలే ఉన్నాయి.

ఫైనల్‌గా : ఇప్పటి వరకు వచ్చిన ముక్కోణపు ప్రేమకథ చిత్రాలకు కాస్త భిన్నంగా రూపొందిన ఈ చిత్రంలో  పూర్తిగా క్లాస్‌ ఆడియన్స్‌ అలరించే అంశాలు ఉన్నాయి.సెకండాఫ్‌ స్క్రీన్‌ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని, అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించి ఉంటే ఈ 'తెలుసు కదా' అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండేది.