ప్రదీప్ రంగనాథ్ .. చూడటానికి బక్కపలచగా ఉంటాడు. తాను ఎలా ఉంటే అలాగే తెరపై కనిపించడానికి ఇష్టపడతాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలనే ఎంచుకుంటూ వెళుతున్నాడు. తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగు ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'డ్యూడ్'. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. 

కథ: మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుటుంబ పరువు ప్రతిష్ఠలకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే రాజకీయాలలో నెగ్గుకు రావలన్నా .. ఓటు బ్యాంకుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్నా కుటుంబ పరువు ప్రతిష్ఠలు చాలా ముఖ్యమని ఆయన భావిస్తూ ఉంటాడు. తల్లి లేని కూతురని చెప్పి, 'కుందన' (మమితా బైజూ)ను చాలా గారంగా చూసుకుంటూ ఉంటాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తన చెల్లెలి పట్ల ప్రేమతో అతను ఆ పేరును కూతురుకు పెడతాడు. 

ఇక ఆదికేశవులు రెండో చెల్లెలు (రోహిణి) అదే ఊళ్లో ఉంటుంది. కానీ అన్నయ్యతో ఆమె మాట్లాడదు. ఆమె కొడుకే గగన్ ( ప్రదీప్ రంగనాథ్). అతను అముద (నేహాశెట్టి)ని చాలా ఇదిగా ప్రేమిస్తాడు. కానీ ఆమె వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. తనని ఆమె అలా వదిలేయడానికి కారణం ఏమిటనేది మాత్రం అతనికి అర్థం కాదు. ఈ నేపథ్యంలోనే మేనమామ కూతురైన కుందన, గగన్ ను ప్రేమిస్తూ ఉంటుంది. అతనినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అయితే అతను ఇంట్రెస్ట్ చూపించడు. 

ఆ తరువాత అతను ఆమె పట్ల తనకి ఉన్నది ప్రేమేనని గ్రహించి వెళితే, తాను 'పార్థు'కి  మనసిచ్చానని చెబుతుంది. అదే విషయాన్ని ఆమె తండ్రితోను చెబుతుంది. 'పార్థు' తమ కులానికి చెందిన కుర్రాడు కాదని తెలిసి, వాళ్ల పెళ్లికి ఆదికేశవులు 'నో' చెబుతాడు. ఆమె గగన్ ను పెళ్లి చేసుకోవలసిందేనని తేల్చి చెబుతాడు. కానీ 'పార్థు'తో ఆమె పెళ్లి చేయాలని గగన్ భావిస్తాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? గగన్ తల్లితో ఆదికేశవులుకి మాటలు లేకపోవడానికి కారణం ఏమిటి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ:'లైఫ్ లో ఒక విషయాన్ని నువ్వు లెఫ్ట్ హ్యాండ్ తో డీల్ చేస్తే, లైఫ్ కూడా నిన్ను లెఫ్ట్ హ్యాండ్ తో డీల్ చేస్తుంది' అనేది ఈ సినిమాలో హీరో డైలాగ్. అప్పటికే అనుభవాన్ని గడించేసిన హీరో చెప్పిన మాట ఇది. ఈ కథలోని సారం .. సారాంశం అంతా కూడా ఈ సింగిల్ డైలాగ్ లోనే ఇమిడి ఉంది. అలాగే 'చేయి జారిందేదీ తిరిగి అదే విధంగా చేతికి రాదు' అనే ఒక మాట ఉంది. ఆ నిజాన్ని  టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. 

ఆ మధ్య తెలుగులో ఒక సినిమా వచ్చింది. పెళ్లై వెళ్లిపోయిన హీరోయిన్, చాలా రోజుల తరువాత గతంలో తాను ప్రేమించిన హీరోను కలుస్తుంది. తాను సంతోషంగానే ఉన్నాననే విషయాన్ని అతను నమ్మడం కోసం అతణ్ణి తీసుకెళ్లి తన ఇంట్లో ఉంచుతుంది. ఇది సాధ్యమా? నిజంగా ఇలా జరుగుతుందా? అని చాలా మంది ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. కానీ ఈ సినిమా చూసిన తరువాత, ఆ సినిమాలోని అంశం నథింగ్ అనిపిస్తుంది. 

ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. ఆ అమ్మాయి మనసులో తాను లేనని తెలిసినప్పుడు మన్నించి వదిలేయడంలోను తప్పులేదు. కానీ సినిమాలో హీరో వాయిదాల పద్ధతిలో తన జీవితాన్ని పణంగా పెడుతూ వెళతాడు. అయితే అతను చేసే త్యాగాలు సహజత్వానికి దూరంగా ఉండటం వలన, కనెక్ట్ కావడం కష్టమవుతుంది.

పనితీరు: దర్శకుడు కీర్తీశ్వరన్ తయారు చేసుకున్న కథ ఇది. కథలో కొత్తదనం కోసం గట్టిగానే ట్రై చేశాడు. కాకపోతే ఆ కొత్తదనం ఎంతవరకూ వాస్తవ పరిస్థితులను కలుపుకుని వెళుతోంది అనేది పట్టించుకోలేదేమో అనిపిస్తుంది. శరత్ కుమార్ .. ప్రదీప్ రంగనాథ్ .. మమితా బైజు తమ పాత్రలకు న్యాయం చేశారు. తన పర్సనాలిటీని ఎవరూ కామెంట్ చేయకూడదనే ఉద్దేశంతోనే నేమో, ప్రదీప్ రంగనాథ్ ఆరంభంలో షర్ట్ లేకుండా ఎక్కువసేపు కనిపిస్తాడు.   

నికేత్ బొమ్మి కెమెరా పనితనం బాగుంది. సాయి అభ్యంకర్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. బాణీల పరంగా గుర్తుపెట్టుకోదగినవి ఏమీ లేవు. ముఖ్యంగా మొదటిపాట సాహిత్యం అర్థం కాదు. భరత్ విక్రమన్ ఎడిటింగ్ ఓకే.

ముగింపు: ప్రేమలో హీరో - హీరోయిన్ కలిసి గెలవాలని ఆడియన్స్ కోరుకుంటారు. కానీ తనపట్ల ప్రేమలేని హీరోయిన్ ను గెలిపించడం కోసం హీరో చేసే పోరాటాన్ని  ఆ స్థాయిలో ఆడియన్స్ ఆదరిస్తారా? అనే సందేహం కలుగుతుంది. ఇప్పటి ట్రెండ్ అదే 'డ్యూడ్' .. అనుకుంటే గొడవే లేదు.