అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకుంటూ, హాలీవుడ్ సినిమా తెరపై అద్భుతాలు చేస్తూనే వెళుతోంది. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకుని వెళుతోంది. అలా హాలీవుడ్ నుంచి వచ్చిన సినిమానే 'హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్'. డీన్ డెబ్లోయిస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. వేలకోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఈ నెల 13వ తేదీ నుంచి తెలుగులోను 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: స్టోయిక్ దివాస్ (గెరార్డ్ బట్లర్) ఒక ఆటవిక తెగకి నాయకుడు. అతని ఒక్కగానొక్క కొడుకే హికప్ (మాసన్ థేమ్స్). స్టోయిక్ అతని గూడెం ప్రజలు తరతరాలుగా 'డ్రాగన్స్'తో ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. ఎప్పుడు ఎటువైపు నుంచి డ్రాగన్స్ దాడి చేస్తాయో తెలియని ఒక భయానక పరిస్థితులలో వాళ్లంతా రోజులు గడుపుతూ ఉంటారు. అందువల్లనే టీనేజ్ పిల్లలకి డ్రాగన్స్ ను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో శిక్షణ ఇస్తూ ఉంటారు.
స్టోయిక్ భార్య .. హికప్ తల్లి కూడా డ్రాగన్స్ బారిన పడుతుంది. అందువలన డ్రాగన్స్ స్థావరం ఎక్కడ ఉందనేది పసిగట్టి, సాధ్యమైనంత త్వరగా అంతం చేయాలనే పట్టుదలతో స్టోయిక్ ఉంటాడు. తన తరువాత డ్రాగన్స్ పై పోరాడే యోధుడిగా తన కొడుకును తీర్చిదిద్దడానికి అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే ఒకసారి 'నైట్ ప్యూరీ' అనే డ్రాగన్ ను హికప్ బంధించ గలుగుతాడు. ఆ తరువాత తన కారణంగా అది గాయపడం చూసి జాలిపడి వదిలేస్తాడు. అది తనని ఏమీ చేయకుండా వెళ్లిపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
అలాంటి పరిస్థితుల్లోనే అతనికి ఒక పాత గ్రంథం దొరుకుతుంది. వివిధ రకాల డ్రాగన్స్ .. వాటి స్వరూప స్వభావాలు .. వాటిని లొంగదీసుకునే తీరును గురించి, అనుభవపూర్వకంగా పూర్వీకులు రాసిన గ్రంథం అది. ఆ గ్రంథాన్ని పరిశీలించిన హికప్ కి తానేం చేయాలనేది అర్థమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? తండ్రికి సపోర్టుగా పోరాడతాడా? లేదంటే డ్రాగన్స్ తరఫున నిలబడతాడా? అనేది మిగతా కథ.
విశ్లేషణ: హాలీవుడ్ వైపు నుంచి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించిన పేరే 'హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్'. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఎదురుచూసినవారి సంఖ్య చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఓటీటీ సెంటర్లో అడుగుపెట్టింది. తమ జీవనానికి అడ్డుపడుతున్న డ్రాగన్స్ ను అంతమొందించాలనే ఉద్దేశంతో ఉన్న ఒక తండ్రికీ, డ్రాగన్స్ తో కలిసి జీవించవచ్చని భావించే ఒక కొడుక్కి మధ్య జరిగే కథ ఇది.
ఈ కథ అంతా కూడా ఒక 'దీవి'లో జరుగుతుంది. 'దీవి' నేపథ్యం .. అక్కడి మానవుల మనుగడ .. డ్రాగన్స్ దాడి నేపథ్యంలో నడిచే ఈ కథను దర్శకుడు అల్లుకున్న తీరు ఆసక్తికరంగానే అనిపిస్తుంది. చిన్నపిల్లలు మొదలు .. టీనేజ్ పిల్లల వరకూ ఎంజాయ్ చేసే విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి. ముఖ్యంగా రంగు రంగుల డ్రాగన్స్ తెరపై ఎగురుతూ ఆడియన్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళతాయి.
అటవీ ప్రాంతంలో నివసించే ఒక తెగ ప్రజలు .. మరో వైపున డ్రాగన్స్ లోకం .. తండ్రీ కొడుకుల ఎమోషన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే నైట్ ప్యూరీ డ్రాగన్ కీ .. హీరోకి మధ్య ఏర్పడిన బంధం తాలూకు దృశ్యాలు మాత్రమే కనువిందు చేస్తాయి. తండ్రీ కొడుకుల నేపథ్యంలో వచ్చే ఎమోషన్స్ .. డ్రాగన్స్ పై పోరాటం కోసం శిక్షణ ఇచ్చే విధానం పెద్దగా ఆకట్టుకోవు. ఇక అతిపెద్ద డ్రాగన్ ఆకాశంలో ఎగరడం అనే విషయం వాస్తవానికి చాలా దూరంగా అనిపిస్తుంది.
పనితీరు: కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా, డ్రాగన్స్ తో ఆకాశ వీధుల్లో చేయించిన విన్యాసాలు ప్రేక్షకులను .. ముఖ్యంగా చిన్న పిల్లలను ఆకట్టుకుంటాయి. ప్రధానమైన డ్రాగన్ ఎక్స్ ప్రెషన్స్ ఈ సినిమాకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. గ్రాఫిక్స్ టీమ్ వర్క్ మంచి మార్కులు కొట్టేస్తుంది. నేపథ్య సంగీతం కూడా సందర్భానికి తగినట్టుగా సాగుతుంది.
ముగింపు: కథాకథనాల కంటే కూడా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఆకట్టుకునే కంటెంట్ ఇది. తెరపై రకరకాల డ్రాగన్స్ .. రంగురంగుల డ్రాగన్స్ చేసే విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పచ్చు.
'హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!
How to Train Your Dragon Review
- జూన్ లో విడుదలైన సినిమా
- ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్
- ఫాంటసీ అడ్వెంచర్ జోనర్లో సాగే కంటెంట్
- రొటీన్ గానే అనిపించే కథాకథనాలు
- హైలైట్ గా నిలిచే విజువల్ ఎఫెక్ట్స్
Movie Details
Movie Name: How to Train Your Dragon
Release Date: 2025-10-13
Cast: Mason Thames, Nico parker, Gerard Butler, Nick Frost,Gerard Butler
Director: Dean Deblois
Music: John Powell
Banner: Universal- Dream Works
Review By: Peddinti
Trailer