ఈ మధ్య కాలంలో థియేటర్ కి వచ్చిన రొమాంటిక్ డ్రామాగా 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' సినిమా కనిపిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 22వ తేదీన థియేటర్లకు వచన ఈ సినిమాలో, నరేశ్ అగస్త్య - రాబిన్ ఖతూన్ జంటగా నటించారు. విపిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీ నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: వరుణ్ (నరేశ్ అగస్త్య) శ్రీమంతుల కుటుంబానికి చెందిన యువకుడు. అతని తండ్రి మహేంద్ర (సుమన్) పెద్ద వ్యాపార వేత్త. వరుణ్ కి తల్లి (ఆమని) దగ్గర చనువు ఎక్కువ. వరుణ్ ఫారిన్ లో చదువు పూర్తి చేసి అక్కడే జాబ్ సంపాదిస్తాడు. అయితే అతనికి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం. అందుకు కారణం సంగీతంలో మంచి ప్రావీణ్యం కలిగిన నాయనమ్మ (రాధిక)ను దగ్గరగా చూడటమే. ఆమె అతని జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. 

చిన్నప్పుడు నాయనమ్మ శిక్షణలో కొంతవరకూ సంగీతాన్ని నేర్చుకున్న వరుణ్, ఇప్పుడు తిరిగి దానిని కొనసాగించాలని అనుకుంటాడు. వయోలిన్ లో మరిన్ని మెలకువలు నేర్చుకోవాలని భావిస్తాడు. అలాగే సొంతంగా మ్యూజికల్ ఆల్బమ్స్ ను తయారు చేయాలనే నిర్ణయానికి వస్తాడు. అందుకోసం అతను ఫారిన్ లో జాబ్ మానేసి ఇండియాకి తిరిగొస్తాడు. 

వరుణ్ ఫారిన్ నుంచి తిరిగి రాగానే తన వ్యాపార వ్యవహారాలను అతనికి అప్పగించాలని మహేంద్ర భావిస్తాడు. కొడుకు నిర్ణయాన్ని గురించి తెలుసుకుని ఆయన ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. 'కళ' అనేది కాలక్షేపం కోసం ఎంచుకోమనీ, బ్రతకడానికి ఏం చేయాలనే విషయాన్ని గురించిన ఆలోచన చేయమని సీరియస్ అవుతాడు. దాంతో వరుణ్ ఇల్లొదిలి బయటికి వచ్చేస్తాడు. ఆ తరువాత అతను ఏం చేస్తాడు? అతనికి జీవితంలోకి మేఘన (రాబియా ఖతూన్) ఎలా ప్రవేశిస్తుంది? ఆమె నేపథ్యం ఏమిటి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఒక శ్రీమంతుడు .. అతనికి కొన్ని బిజినెస్ లు .. తన తరువాత తన వారసుడు వాటిని కొనసాగించాలనే కోరిక. ఒక యంత్రంలా పని చేసుకుపోవడం ఎంతమాత్రం నచ్చని ఆ వారసుడు, తనకి ఇష్టమైన సంగీతం వైపు వెళ్లాలని నిర్ణయించుకోవడం .. అది నచ్చని తండ్రికి దూరంగా వెళ్లిపోవడం .. వంటి ఈ లైన్లు చదువుతుంటేనే, గతంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి గదా అనిపించడం సహజం.

ఇక ఆ తరువాత హీరోయిన్ విషయానికి వస్తే, నాలుగు గోడల మధ్య యంత్రంలా పనిచేయడం అలవాటైన ఆమె, ప్రకృతి సమక్షంలో హీరోకి పరిచయమవుతుంది. ఇప్పుడు ఈ కథ పేరెంట్స్ తో కూడిన హీరో చుట్టూ .. హీరోయిన్ పనిచేసే ఆఫీస్ చుట్టూ .. ఆ తరువాత హీరో - హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూడు వైపుల నుంచి కూడా ఈ కథ రొటీన్ కి భిన్నంగా .. ఆసక్తికరంగా నడిచిందా? అంటే లేదనే చెప్పాలి. 

ప్రేమకథలకు ఫీల్ తో కూడిన భావోద్వేగాలు ముఖ్యం .. ఆ ఫీల్ ను ఎక్కువగా ఆవిష్కరించే పాటలు ముఖ్యం .. అందమైన చిత్రీకరణ ముఖ్యం .. ఆ దృశ్యాలను మనసువరకూ మోసుకొచ్చే బాణీలు ముఖ్యం. నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ వైపు నుంచి మంచి మార్కులను కొట్టేసే ఈ సినిమా, కథాకథనాల పరంగానే రొటీన్ గా అనిపిస్తూ ఉంటుంది. కొత్త కథను ఎంచుకుని ఉంటే బాగుండేదేమో అనే అభిప్రాయం కలుగుతుంది.

పనితీరు: దర్శకుడు ఈ కంటెంట్ ను మొదటి నుంచి చివరి వరకూ చాలా నీట్ గా ప్రెజెంట్ చేస్తూ వెళ్లాడు. అయితే కథలో కొత్త మలుపులు .. ట్విస్టులు లేని కారణంగా, చూసిన సినిమానే మళ్లీ చూస్తున్నట్టుగా ఉంటుంది. నరేశ్ అగస్త్య - రాబియా ఖతూన్ ఇద్దరి నటన బాగుంది. సుమన్ .. రాధిక .. ఆమని .. తులసి వంటి సీనియర్ ఆర్టిస్టుల కారణంగా హీరోపై నిండుదనం కనిపిస్తుంది. 

మోహన కృష్ణ ఫొటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలకు తగిన సహజత్వాన్నీ .. పాటలకు తగిన ఆహ్లాదాన్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. కథకి తగిన ఫీల్ ను తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు.
జస్టీన్ ప్రభాకరన్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఒకటి రెండు బాణీలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ వర్క్ నీట్ గా అనిపిస్తుంది.   
  
ముగింపు: టైటిల్ .. తారాగణం .. చిత్రీకరణ పరంగా ఆడియన్స్ లో ఈ సినిమా ఆసక్తిని రేకెత్తించగలుగుతుంది. అయితే అందుకు తగిన కథాకథనాలు రొటీన్ గా సాగడమే లోపంగా అనిపిస్తుంది. పాత్రలు బలంగా కనిపించకపోవడానికీ, సన్నివేశాలు ఎమోషన్స్ వైపు నుంచి కనెక్ట్ కాకపోవడానికి ఇదే కారణమని చెప్పుకోవచ్చు.