ఇప్పుడు యానిమేటెడ్ ట్రెండ్ నడుస్తోంది. అత్యాధునిక సంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వలన, సైన్స్ కీ .. ఆధ్యాత్మికతకు సంబంధించిన కథలకు యానిమేషన్ తోడవుతోంది. ఈ తరహా కంటెంట్ కి విపరీతమైన ఆదరణ లభిస్తూ ఉండటంతో, పూర్తిస్థాయి యానిమేటెడ్ సినిమాలు .. సిరీస్ లు బరిలోకి దిగిపోతున్నాయి. అలా వచ్చిన 'మహావతార్ నరసింహా' సినిమా భారీ వసూళ్లను రాబట్టగా, సిరీస్ రూపంలో 'కురుక్షేత్ర' రూపొందడం జరిగింది.
గతంలో మహాభారతం నేపథ్యంలో చాలానే సినిమాలు .. ధారావాహికలు వచ్చాయి. అయితే 'కురుక్షేత్ర' ఘట్టాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 10 భాషల్లో ఈ సిరీస్ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 18 రోజుల పాటు జరిగిన 'కురుక్షేత్ర' యుద్ధాన్ని 18 ఎపిసోడ్స్ గా రూపొందించారు. ప్రస్తుతం 9 ఎపిసోడ్స్ స్ట్రీమ్ లోకి వచ్చాయి. మిగతా ఎపిసోడ్స్ ఈ నెల 24న అందుబాటులోకి రానున్నాయి. ఉజాన్ గంగూలీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కథ: పాండవులు అరణ్యవాసం .. అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు. అయినా వారికి ఇవ్వవలసిన రాజ్య భాగాన్ని ఇవ్వకుండా కౌరవులు మాట తప్పుతారు. చివరికి ఐదుగురికి ఐదు ఊళ్లు ఇవ్వమన్నా కూడా నిరాకరిస్తారు. దురాశతో దుర్యోధనుడు మొండిపట్టుపడతాడు. అతనిపై ధృత రాష్ట్రుడికి గల వాత్సల్యం .. గాంధారి మౌనం .. శకుని ఎత్తుగడలు .. కర్ణుడి అండదండలు .. అశ్వద్ధామ పరాక్రమం .. ద్రోణాచార్యుడి పట్ల గల నమ్మకం దుర్యోధనుడు దురుసుగా ముందుకు వెళ్లడానికి కారణమవుతాయి.
కృష్ణుడు చేసిన సూచన మేరకు పాండవులు ఓపిక పడతారు. ఈ విషయంలో సంజయుడి రాయబారం కూడా విఫలమవుతుంది. కౌరవులు యుద్ధం పట్ల ఉత్సాహంతో ఉన్నారనే విషయం పాండవులకు అర్థమవుతుంది. దాంతో వారు కూడా యుద్ధానికి సమాయత్తమవుతారు. కృష్ణుడి దగరికి వెళ్లిన దుర్యోధనుడు, యుద్ధంలో తమకి సాయంగా ఉండమని కోరతాడు. అదే మాటను అర్జునుడు కూడా అడుగుతాడు.
తాను ఆయుధం పట్టనని చెప్పినా ఆయన ఒక్కడు తనవైపు ఉంటేచాలని అర్జునుడు కోరగా, కృష్ణుడి సైన్యం తన వైపుకు రావడం పట్ల దుర్యోధనుడు సంతోషిస్తాడు. 'కురుక్షేత్ర' యుద్ధం మొదలవుతుంది. తన వాళ్ల ప్రాణాలను తీయడం వలన లభించే విజయం .. రాజ్యసుఖం తనకి అవసరం లేదని అర్జునుడు అంటాడు. అప్పుడే ఆయనకి కృష్ణుడు గీతోపదేశం చేస్తాడు. దాంతో అర్జునుడు తిరిగి ఆయుధాలు చేపడతాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది? ఈ యుద్ధంలో ఎవరి పాత్ర ఏమిటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ: 'రాస్తే రామాయణమంత .. చెబితే మహాభారతమంత' అని అంటూ ఉంటారు. అంటే మహాభారతం అంత పెద్దదిగా ఉంటుందని అర్థం. అలాంటి మహాభారతంలోని 'కురుక్షేత్రం' ఈ సిరీస్ లోని ప్రధానమైన కథాంశం. ఈ సిరీస్ ఫస్టు ఎపిసోడ్ లో సంజయుడి రాయబారం విఫలమవుతుంది. రెండో ఎపిసోడ్ లో యుద్ధం మొదలవుతుంది. ఒక్కో ఎపిసోడ్ ను ఒక్కో ప్రధానమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.
'కురుక్షేత్ర' యుద్ధాన్ని చకచకా మొదలు పెట్టేసి, సందర్భానికి తగినట్టుగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లడం .. తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రకమైన స్క్రీన్ ప్లే ఈ సిరీస్ ను నిలబెట్టిందని చెప్పాలి. దాదాపు ప్రతి ఎపిసోడ్ కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. జరుగుతున్న కథకి అంతరాయం కలగకుండా గతంలోకి వెళ్లిరావడం .. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కథను చెప్పే విధానం సామాన్య ప్రేక్షకులకు కూడా తేలికగా అర్థమవుతుంది.
ఇది యానిమేటెడ్ సిరీస్. అందువలన ఆయా పాత్రలను ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలంటే, ఆ పాత్రలను డిఫరెంట్ గా డిజైన్ చేయాలి. ఆ పాత్రల లుక్ .. కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. అలాగే కోటలు .. రాజభవనాలు .. ఉద్యానవనాలు .. రథాలు .. ఆయుధాలకి సంబంధించిన రూపకల్పన గొప్పగా ఉండాలి. ఈ అంశాలన్నింటి వైపు నుంచి ఈ సిరీస్ కి మంచి మార్కులు దక్కుతాయనే చెప్పాలి.
ఈ యానిమేటెడ్ సిరీస్ లోని ప్రతి సన్నివేశం చాలా కలర్ఫుల్ గా ఉండేలా డిజైన్ చేసుకున్నారు. విజువల్స్ పరంగా ఈ సిరీస్ విశేషంగా ఆకట్టుకుంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. రథాలు .. యుద్ధాలు .. బాణాలు వర్షంలా కురిసే సన్నివేశాలు పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. విశ్వరూపం .. భీష్ముడు గాయపడటం .. అభిమన్యుడు నేలకొరగడం .. జయద్రధుడిని సంహరించడం వంటి సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయి.
పనితీరు: మహాభరతం కథ వస్తువు అయినప్పుడు .. ప్రధానమైన పాత్రలన్నీ యుద్ధభూమిలోకి వచ్చినప్పుడు .. అందుకు సంబంధించిన దృశ్యాలను డిజైన్ చేసుకోవడం చాలా కష్టమైన విషయం. టీమ్ లోని వారందరికీ ఆ పాత్రలు .. ఆ పాత్రల స్వరూప స్వభావాలపై అవగాహన ఉండవలసి ఉంటుంది. ఆ వైపు నుంచి అవుట్ పుట్ పెర్ఫెక్ట్ గా వచ్చిందనే అనిపిస్తుంది.
ముగింపు: ఒక వైపున యుద్ధాన్ని నడిపిస్తూనే మరో వైపున గతంలో జరిగిన సంఘటనలను చూపించడం ఈ సిరీస్ ప్లస్ అయింది. ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా చూడటానికి కారణమైందని చెప్పాలి. విజువల్స్ .. నేపథ్య సంగీతం .. తెలుగు అనువాదం పరంగా, ఇలా అన్ని వైపుల నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సిరీస్ ఆకట్టుకుంటుందని చెప్పచ్చు.
'కురుక్షేత్ర' (నెట్ ఫ్లిక్స్) వెబ్ సిరీస్ రివ్యూ!
Kurukshetra Review
- యానిమేటెడ్ సిరీస్ గా 'కురుక్షేత్ర'
- కలర్ఫుల్ విజువల్స్
- ఆకట్టుకునే స్క్రీన్ ప్లే
- అలరించే నేపథ్య సంగీతం
- అన్నివర్గాలవారిని మెప్పించే కంటెంట్
- అభినందించదగిన టీమ్ వర్క్
Movie Details
Movie Name: Kurukshetra
Release Date: 2025-10-10
Cast: -
Director: Ujaan Ganguly
Music: Simaab Sen
Banner: A Tipping Point Production
Review By: Peddinti
Trailer