హిందీ నుంచి మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ఓటీటీకి వచ్చింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఆ సిరీస్ పేరే,  'సెర్చ్: ది నైనా మర్డర్ కేస్'. టైటిల్ తోనే అందరిలో ఉత్కంఠను రేకెత్తించిన సిరీస్ ఇది. 6 ఎపిసోడ్స్ తో కూడిన ఈ సిరీస్, ఈ రోజు నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. కొంకణా సేన్ శర్మ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ కి, రోషన్ సిప్పి దర్శకత్వం వహించాడు.

కథ: ముంబై క్రైమ్ బ్రాంచ్ లో ఏసీపీ సంయుక్త దాస్ ( కొంకణా సేన్ శర్మ) పనిచేస్తూ ఉంటుంది. తన భర్త భీషణ్ .. టీనేజ్ వయసులో ఉన్న కూతురు 'మహీ' కోసం ఎక్కువ సమయం గడపడలేకపోవడం వలన, వాళ్ల వైపు నుంచి అసంతృప్తి ఉంటుంది. దాంతో 'అహ్మదాబాద్' లో కొత్త ఇంటిని తీసుకున్న ఆమె అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఆమె స్థానంలోకి ఏసీపీ జై కన్వర్ (సూర్య శర్మ) కూడా వచ్చేస్తాడు. ఆమె రిలీవ్ అవుతున్న సమయంలోనే ఒక మర్డర్ కేసు వస్తుంది. 

ముంబైలోని ఒక కాలేజ్ లో చదువుతున్న 'నైనా' అనే అమ్మాయి హత్య చేయబడుతుంది. ఆ ప్రాంతానికి జై కన్వర్ కొత్త కావడం వలన, ఈ కేసు కోసం మరో రెండు రోజులు కేటాయించమని  పై అధికారి సంయుక్తను కోరతాడు. ఆమెకి తోడుగా ఉండమని జై కన్వర్ ని ఆదేశిస్తాడు. దాంతో ఆమె రంగంలోకి దిగుతుంది. హంతకులు నైనాను హత్య చేసి .. ఓ కారులో ఆమె డెడ్ బాడీని ఉంచి, వర్షపు నీటితో నిండిన ఒక క్వారీలోకి తోసేస్తారు. ఆ బాడీని కనుక్కుని సంయుక్త బయటికి తీయిస్తుంది. 

డెడ్ బాడీ దొరికిన కారు, రాజకీయాలలో ఎదగాలనుకుంటున్న తుషార్ (శివ్ పండిట్)కి సంబంధించినది. ఎలక్షన్స్ పనులపై తిరగటానికి ఆయన తెప్పించిన కార్లలో అది ఒకటి. అందువలన సంయుక్త ఆయనను అనుమానిస్తుంది. ఇక కాలేజ్ లో లవ్ అంటూ నైనా వెంటపడి వేధించిన స్టూడెంట్ 'ఓజస్' ను కూడా ఆమె సందేహిస్తుంది. అలాగే నైనాతో ఎక్కువగా ఛాటింగ్ చేసిన ప్రొఫెసర్ 'రణధీర్' పై కూడా ఓ కన్నేస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో ఆమెకి తెలిసే నిజాలు ఏమిటి? అసలు హంతకులు ఎవరు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: సాధారణంగానే క్రైమ్ థ్రిల్లర్ జోనర్ అనగానే అందరిలో ఒక రకమైన ఆసక్తి ఏర్పడుతుంది. ఎందుకంటే అందులోనే సస్పెన్స్ .. ఇన్వెస్టిగేషన్ కలిసి ఉంటాయి కాబట్టి. ఈ తరహా కథలు చాలావరకూ మర్డర్ తోనే మొదలవుతాయి. చనిపోయినదెవరు? అనేది కాసేపట్లోనే ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఎందుకు చంపారు? ఎవరు చంపారు? ఆ నిజాలు ఎలా బయటపడ్డాయి? అనే అంశాలే కథ మొత్తాన్ని నడిపిస్తాయి. 

ఈ కథ కూడా అదే పద్ధతిలో కొనసాగుతుంది. ఒక మర్డర్ .. కొందరు అనుమానితులు .. అన్వేషణ ..  ఆధారాలు అనే వాటి చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. మరి ఈ కథ మొదటి నుంచి చివరి వరకూ ఊపిరి బిగబట్టి చూసేలా ఉందా అంటే లేదనే చెప్పాలి. అలాగని పెద్దగా బోర్ అనిపించదు కూడా. పోలీస్ కథల్లో ఉండవలసిన స్పీడ్ .. హడావిడి కనిపించదు అంతే. జరిగేది జరగక మానదు అనే తీరున నిదానంగా కదులుతూ ఉంటుంది అంతే.

నిజానికి ఈ కథలో స్టూడెంట్స్ .. పేరెంట్స్ .. రాజకీయాలు .. క్రైమ్ బ్రాంచ్ వైపు నుంచి ట్రాకులు వేసుకుంటూ వెళ్లారు. అయితే ఏ ట్రాక్ ను కూడా లోతుగా టచ్ చేయలేదు. ముఖ్యంగా రాజకీయాల వైపు నుంచి  .. సంయుక్త దాస్ ఫ్యామిలీ వైపు నుంచి వేసుకున్న ట్రాకులు బలహీనంగా అనిపిస్తాయి. వాటిని కాస్త గాఢంగా అల్లుకుని ఉంటే బాగుండేదనే భావన  కలుగుతుంది. కథనం నిదానంగా ఉన్నప్పటికీ, సహజత్వానికి దగ్గరగా ఉండటం ప్లస్ అయింది.

పనితీరు: క్రైమ్ థ్రిల్లర్లు .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు ఎప్పటికప్పుడు అనూహ్యమైన మలుపులతో పరిగెడుతూ ఉండాలి. ఆడియన్స్ ఉహించని ట్విస్టులతో ఆశ్చర్యపరుస్తూ  వెళ్లాలి. ఆ స్థాయిలో మాత్రం దర్శకుడు ఈ కంటెంట్ ను డిజైన్ చేసుకోలేదు. చాలావరకూ రోటీన్ కి దగ్గరగానే ఈ సిరీస్ కనిపిస్తుంది. కొంకణాసేన్ శర్మనే అంతా నడిపిస్తుంది. ఆమె నటనకి వంకబెట్టవలసిన పనిలేదు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. 

ముగింపు: టైటిల్ తోనే అంచనాలు పెంచిన సిరీస్, 'సెర్చ్: ది నైనా మర్డర్ కేస్'. 6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, రొటీన్ కి దగ్గరగానే నడుస్తుంది. థ్రిల్లర్ జోనర్ కథలను ఇష్టపడేవారికి ఇది  ఉత్కంఠను రేపే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మాత్రం అనిపించదు. ఫరవాలేదనే మార్కులు మాత్రమే సంపాదించుకోగలుగుతుంది.