తెలుగు సిరీస్ ఒకటి జియో హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఆ సిరీస్ పేరే  'రాంబో ఇన్ లవ్' అజిత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్, సెప్టెంబర్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఆ రోజున 4 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆ తరువాత 19వ తేదీ .. 26వ తేదీ అక్టోబర్ 3వ తేదీన కొన్ని ఎపిసోడ్స్ ను వదిలారు. ప్రస్తుతం 16 ఎపిసోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 
 
కథ: రాంబాబు ( అభినవ్ మణికంఠ) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. తల్లి .. తండ్రి .. చెల్లి .. ఇదే  అతని ఫ్యామిలీ. అతను ఓ స్టార్టప్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఆ కంపెనీ తన స్నేహితుడైన ఆనంద్ కి చెందినది కావడంతో, తనే అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. అందరూ కూడా తనని 'రాంబో' అని పిలవడమే అతనికి ఇష్టం. అతని టీమ్ లో  తరుణ్ .. అతని భార్య మేరీ .. సాయి .. సాత్విక్ పనిచేస్తూ ఉంటారు. వాళ్లంతా కూడా తమకి ఎలాంటి సమస్య ఎదురైనా రాంబో ఉన్నాడనే ధైర్యంతో ఉంటారు. 

తమ సంస్థకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమని ఆనంద్ చెప్పడంతో, విదేశాల నుంచి 'యాంగ్' అనే ఒక బిజినెస్ ఉమెన్ ను రంగంలోకి దింపుతాడు రాంబో. ఆమె హైదరాబాద్ వచ్చి  .. ఆ సంస్థను .. అక్కడివారి పనితీరును పరిశీలిస్తుంది. ఆ తరువాత తన మనిషిగా ఆమె సుకన్య (పాయల్ చెంగప్ప)ను ఈ ఆఫీస్ కి పంపిస్తుంది. ఆ సంస్థలో తాను ఇన్వెస్టిమెంట్ చేయాలా వద్దా అనేది సుకన్య ఇచ్చిన రిపోర్ట్ పై ఆధారపడి ఉంటుందని చెబుతుంది. 

యాంగ్ చేయనున్న ఇన్వెస్టిమెంట్ పైనే ఉద్యోగులందరూ ఆశలు పెట్టుకుని ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో యాంగ్ మనిషిగా ఆ ఆఫీసులోకి సుకన్య అడుగుపెడుతుంది. ఆమెను చూడగానే రాంబో నివ్వెరపోతాడు. సుకన్య ఉండగా 'యాంగ్' తమ సంస్థలో ఇన్వెస్టిమెంట్ చేయదనే విషయం రాంబోకి అర్థమైపోతుంది. ఇక ఇంటి వైపు నుంచి కూడా అతనికి మరో ప్రమాదం ముంచుకొస్తూ ఉంటుంది. ఆ ప్రమాదం ఏమిటి? సుకన్యతో రాంబోకి ఉన్న గొడవేంటి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఈ మధ్య  కాలంలో ఆఫీస్ నేపథ్యంలో నడిచే కథలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఎక్కువగా వస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్న 'హార్ట్ బీట్' .. 'ఆఫీస్' ఈ  తరహా కథలతో రూపొందినవే. అప్పుడప్పుడు మాత్రమే బయటికి వెళ్లే ఈ కథలు, 90 శాతం వరకూ నాలుగు గోడల మధ్యలోనే నడుస్తూ ఉంటాయి. అలాంటి ఒక కథతో ఆడియన్స్ ముందుకు వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ గా 'రాంబో ఇన్ లవ్' కనిపిస్తుంది.

ఓ అరడజను ప్రధానమైన పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. హీరో - హీరోయిన్ .. అదే ఆఫీసులో పనిచేసే మరో నాలుగు పాత్రలను కలుపుకుంటూ ఈ కథ నడుస్తూ ఉంటుంది. మీటింగులు .. ప్రాజెక్టులు .. డెడ్ లైన్ లు .. పార్టీలు .. ఇలా సాఫ్ట్ వేర్ వాతావరణంలోనే ఈ కథ కొనసాగుతూ ఉంటుంది. ఆఫీసును వదిలిపెట్టి ఆరుబయటికి ఈ కథ వచ్చిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. 

బడ్జెట్ పరంగా చూసుకుంటే కథను నాలుగు గోడల మధ్య తిప్పడం కరెక్టుగా అనిపించవచ్చునేమోగానీ, అలా కథను అక్కడక్కడే తిప్పడమే చాలా కష్టమైన విషయంగా చెప్పుకోవాలి. కథలో ఎన్నో మలుపులు .. ఎమోషన్స్ .. వాటిని కనెక్ట్ చేసిన తీరు వలన మాత్రమే ఈ తరహా కంటెంట్ కనెక్ట్ అవుతుంది. టైట్ కంటెంట్ లేకపోతే మాత్రం ఆడియన్స్ డీలాపడిపోతారు. ఈ సిరీస్ కూడా ఆ కోవలోకే వస్తుంది. 

పనితీరు: ఈ సిరీస్ లో ఇంతవరకూ 16 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరిన్ని ఎపిసోడ్స్ పలకరించనున్నాయి. అయితే ఇంతవరకూ వచ్చిన ఎపిసోడ్స్ లో పెద్దగా విషయం కనిపించదు. చాలా చిన్న పాయింట్ పట్టుకుని దానిని లాగుతూ వెళుతున్న తీరు సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమైపోతుంది. అలా కాకుండా రొటీన్ కి భిన్నమైన కథను అల్లుకుని ఉంటే బాగుండేది. 

ఆర్టిస్టులంతా పాత్రలలో బాగానే చేశారు. కథలోను .. పాత్రలను మలిచిన తీరులోనూ బలం లేకపోవడం వలన సన్నివేశాలు సాదాసీదాగా సాగిపోతూ ఉంటాయి. చందూ కృష్ణ ఫొటోగ్రఫీ .. శరణ్ రాఘవన్ నేపథ్య సంగీతం .. జయకుమార్ - ట్రంప్ కిరణ్ ఎడిటింగ్ ఫరవాలేదు. 

ముగింపు: ఇంతవరకూ నడిచిన కథలో కామెడీ పరంగా గానీ, ఎమోషన్స్ పరంగా గాని ఈ కంటెంట్ కనెక్ట్ కాలేదు. ఇక ముందు రానున్న ఎపిసోడ్స్ కూడా ఇదే దారిలో కొనసాగితే మాత్రం ఈ సిరీస్ ఓ మాదిరిగా ఉందనే కేటగిరీలోనే కనిపిస్తుంది.