విజయ్ ఆంటోనికి తమిళనాట మాత్రమే కాదు, తెలుగులోను అభిమానులు ఉన్నారు. అందుకు కారణం ఆయన కథలను ఎంచుకునే తీరు, పాత్రలను డిజైన్ చేసుకునే పద్ధతి అనే చెప్పాలి. ఆయన సినిమాలకి ఇక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది. అందువలన ఆయన తాజా చిత్రమైన 'భద్రకాళి' కూడా తమిళంతో పాటు తెలుగులోను ఈ రోజున విడుదలైంది. కెరియర్ పరంగా విజయ్ ఆంటోనీకి ఇది 25వ సినిమా కావడం విశేషం. 

కథ: ఈ కథ 1989 - 2025కి మధ్య కాలంలో జరుగుతుంది. కిట్టూ (విజయ్ ఆంటోనీ) సెటిల్ మెంట్లు చేయడంలో చేయి తిరిగిన మనిషి. ఆ ప్రాంతంలో స్వార్థ రాజకీయనాయకుల అరాచకం .. అవినీతి  పోలీస్ అధికారుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయినా వాళ్లకి సంబంధించిన సెటిల్ మెంట్లు కూడా కిట్టూ చేతుల మీదుగా జరిగిపోతూ ఉంటాయి. అతను తాను సంపాదించిన మొత్తంలో కొంత  దానధర్మాలకు ఉపయోగిస్తూ ఉంటాడు. 

ఆ ప్రాంతంలో అటు రాజకీయాలను .. ఇట్ పోలీస్ అధికారులను అభయంకర్ తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. రాజకీయంగా తాను మరింతగా ఎదగడానికి తగిన సన్నాహాలు చేసుకుంటూ ఉంటాడు. అతని బావమరిది రాజగోపాల్ ఒక స్కూల్ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. అతని కారణంగా ఓ స్టూడెంట్ చనిపోతాడు. ఆ కుర్రాడి తల్లిదండ్రుల ఆవేదనని చూడలేకపోయిన కిట్టూ, రాజగోపాల్ ను హత్య చేస్తాడు. అయితే ఆధారాలు లభించకుండా చూసుకుంటాడు.

అభయంకర్ కి సంబంధించిన రాజకీయ పార్టీలోను .. అతనిని సపోర్టు చేయాలనుకున్న వారి జీవితాలలోను కుదుపులు మొదలవుతాయి. ఆ సమయంలోనే అతనికి కిట్టూపై అనుమానం వస్తుంది. తనకి సంబంధించిన వ్యవహారాలలో చక్రం తిప్పుతూ, కిట్టూ 6 వేల కోట్ల రూపాయలను నొక్కేశాడనే విషయం అభయంకర్ కి తెలుస్తుంది. దాంతో అతను బీహార్ నుంచి రామ్ పాండే ను రంగంలోకి దింపుతాడు. కిట్టూ నేపథ్యం ఏమిటి? అతనికి అభయంకర్ తో గల శత్రుత్వానికి గల కారణం ఏమిటి? అతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. 

విశ్లేషణ: డబ్బున్నవాడికి మాత్రమే ఈ భూమ్మీద బ్రతికే అర్హత ఉందని భావించే ప్రతినాయకుడికీ, మానవత్వం లేనివారికి ఈ నేలపై చోటులేదని భావించే నాయకుడికి మధ్య జరిగే కథ ఇది. ప్రశ్నించే వాడు ఉండకూడదనేదే ప్రతినాయకుడి ప్రధానమైన ఉద్దేశమైతే, ప్రశ్నించని క్షణం నుంచే అణచివేత మొదలవుతుందనేది నాయకుడి అభిప్రాయం. అలాంటి వీరిద్దరి చుట్టూనే దర్శకుడు ఈ కథను తిప్పుతూ వెళ్లాడు. 

పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలలో ఒక వైపున రాజకీయాలు .. మరో వైపున పోలీస్ అధికారులు .. ఇంకొక వైపున మీడియా హడావిడి అనేవి తెరపై కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి లక్షణాలతోనే ఈ సినిమా కూడా కనిపిస్తుంది. ఫస్టాఫ్ కాస్త యాక్టివ్ గా కనిపించినా, సెకండాఫ్ ఆరంభంలోనే గ్రాఫ్ పడిపోవడం కనిపిస్తుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి ఎక్కువ నిడివిని కేటాయించడం అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. 

తమిళంలో ఈ సినిమా 'శక్తి తిరుమగన్' పేరుతో రూపొందింది. తెలుగులో 'భద్రకాళి' అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. 'భద్రకాళి' అనే పేరు పవర్ఫుల్ అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. కానీ ఈ టైటిల్ కీ .. ఈ సినిమా  కథకి సంబంధం లేకపోవడమే ఆశ్చర్య కరమైన విషయం. చివర్లో హీరో మాటలు ఆలోచింపజేస్తాయి. అయితే ఒక పాఠం చెబుతున్నట్టుగా ఉండటం వలన చిరాకు తెప్పిస్తాయి కూడా. 

పనితీరు: సాధారణంగా విజయ్ ఆంటోని సినిమాలు ఒక కాన్సెప్ట్ కి కట్టుబడి కొనసాగుతాయి. లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్లు .. కామెడీ ఆయన సినిమాలలో కనిపించవు. అయితే లైట్ గా రొమాన్స్ ను టచ్ చేస్తూ, దర్శకుడు అరుణ్ ప్రభు ఈ కథను రెడీ చేసుకున్నాడు. అయితే హీరో నడిచే మార్గాన్ని .. ఆయన ఉద్దేశాన్ని పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయలేకపోయాడని అనిపిస్తుంది. 

 సీరియస్ గా సాగే ఇలాంటి పాత్రలను విజయ్ ఆంటోని బాగానే చేస్తాడని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ తరహా కథలు .. పాత్రలు గతంలో ఆయన చేసినవే. ఇక విజయ్ ఆంటోనీ అందించిన నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. షెల్లీ ఫొటోగ్రాఫీ కథకి మరింత హెల్ప్ అయింది. రేమాండ్ డెరిక్ ఎడిటింగ్ విషయానికి వస్తే, హీరో ఫ్లాష్ బ్యాక్ సీన్ నిడివి తగ్గిస్తే బాగుండేదని అనిపిస్తుంది. 'ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం' .. 'నేను చేసిన పాపాలు లెక్కేయడానికి ఆ దేవుడికి కూడా ఆయుష్షు సరిపోదు' అనే డైలాగ్ లు సందర్భానికి తగినట్టుగా పేలాయి. 

ముగింపు: నీకు అన్యాయం చేసినవాడిని ధైర్యంగా ప్రశ్నించు. నీ చుట్టూ ఉన్నవారికి అన్యాయం చేయడానికి ప్రయత్నించినవాడిని నిర్దయతో శిక్షించు అనే ఒక సందేశంతో ఈ కథ కొనసాగుతుంది. అయితే నిదానంగా సాగే కథాకథనాలు, నీరసంగా అనిపించే సెకండాఫ్ నిరాశపరుస్తాయి.