ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు చాలావరకూ గ్రామీణ నేపథ్యంలోని కథలనే ఎంచుకుంటూ వెళుతున్నాయి. అలా గ్రామీణ నేపథ్యంతో ముడిపడిన కథతో రూపొందిన సినిమానే 'కన్యాకుమారి'. సృజన్ అట్టాడ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో శ్రీచరణ్ రాచకొండ - గీత్ సైనీ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆగస్టు 27న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: ఈ కథ 'శ్రీకాకుళం' నేపథ్యంలో నడుస్తుంది. కన్యాకుమారి ( గీత్ సైనీ) ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. తను బాగా చదువుకుని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలనేది ఆమె ఆశ .. ఆశయం. అయితే ఇంట్లో వాళ్లు ఆ విషయాన్ని లైట్ తీసుకోవడం వలన, గవర్నమెంట్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేస్తుంది. శ్రీకాకుళంలోని ఒక బట్టల దుకాణంలో సేల్స్ గళ్ గా పనిచేస్తూ ఉంటుంది. అయినా ఇంజనీర్ కావాలనే కోరిక .. సిటీలో సెటిలైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఆమెలో అలాగే ఉంటాయి. 

ఆ పక్కనే ఉన్న 'పెంటపాడు'లో తిరుపతి అనే యువకుడు ఉంటాడు. అతను 7వ క్లాస్ వరకూ కన్యాకుమారితోనే కలిసి చదువుతాడు. అయితే వ్యవసాయం పట్ల గల ఇష్టంతో చదువు మానేస్తాడు. వ్యవసాయం చేస్తున్న కారణంగా అతనికి పెళ్లి సంబంధాలు రాకుండా పోతుంటాయి. దాంతో తనకి పెళ్లి కాదేమోనని తిరుపతి బెంగ పెట్టుకుంటాడు. ఆ సమయంలోనే అతను కన్యాకుమారితో మాటలు కలుపుతాడు. ఆమెకి దగ్గర కావడానికి ప్రయత్నిస్తాడు. 

అప్పుడు కన్యాకుమారి తన మనసులోని మాటను చెబుతుంది. తనకి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలనే ఆశ ఉందనీ, సిటీలో జాబ్ చేసే వ్యక్తినే తాను పెళ్లి చేసుకుంటానని తేల్చి చెబుతుంది. అప్పుడు తిరుపతి ఏం చేస్తాడు? ఆమె కోసం అతను వ్యవసాయం మానేస్తాడా? సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలనే కన్యాకుమారి కోరిక నెరవేరుతుందా? అనే మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. 

విశ్లేషణ: జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక బలమైన కోరిక ఉంటుంది .. తప్పకుండా సాధించాలనే  ఆశయం ఉంటుంది. అయితే ఆ ఆశయం దిశగా సాగే ప్రయాణంలో, ఒక్కోసారి నచ్చిన వ్యక్తులకు దూరం కావలసి వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తులను వదులుకోవాలా? ఆశయాన్ని వదులుకోవాలా? అనే ఒక డైలమా చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కన్యాకుమారి ఏం చేసింది? అనేదే ఈ సినిమా కథ. 

మనం ఇష్టపడేవారి కోసం మన ఇష్టాలను కొన్ని వదులుకుని వెళ్లడమనేది ప్రేమలో ఒక కోణం. మనలను ప్రేమించేవారు మనం కోసం ఏమైనా వదులుకుని రావడమనేది మరో కోణం. అయితే ఎవరి కోసం ఎవరు త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు? అనేది వాళ్ల మనసులలో అవతల వ్యక్తి పట్ల ఉన్న ప్రేమకి కొలమానంగా నిలుస్తుంది. ఈ కథలో అలాంటి ఒక త్యాగం ఎవరు చేశారనే దిశగా దర్శకుడు ఆసక్తిని రేకెత్తించిన తీరు ఆకట్టుకుంటుంది. 

విలేజ్ నేపథ్యం .. వ్యవసాయాన్ని ప్రేమించే యువకుడు .. సాఫ్ట్ వేర్ లైఫ్ స్టైల్ ను కోరుకునే యువతి చుట్టూ అల్లుకున్న ఈ కథ, సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. కథాకథనాలకు బలమైన పల్లెటూరి నేపథ్యం తోడు కావడం కలిసొచ్చింది. అయితే మరింత ఎమోషన్స్ .. కామెడీ టచ్ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. 

పనితీరు
: ఎవరైనా సరే తమ ఆశయానికి తగినట్టుగా ఊరు మారొచ్చు .. దేశాలు మారొచ్చు .. కానీ మనసు మారకూడదు అనే ఒక సందేశాన్ని ఇచ్చిన తీరు బాగుంది. కానీ అందుకు సంబంధించిన కథను మరింత బలంగా చెప్పడానికి అవకాశం ఉన్నప్పటికీ చెప్పలేదేమో అనిపిస్తుంది. శివ గాజుల - హరి చరణ్ ఫొటోగ్రఫీ, రవి నిడమర్తి నేపథ్య సంగీతం .. నరేశ్ అడుప ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తాయి.  

ముగింపు: కేవలం నాయకా నాయికలకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వడం కాకుండా, రెండు కుటుంబాల వైపు నుంచి ఎమోషన్స్ .. విలేజ్ వైపు నుంచి వినోదం పాళ్లను పెంచితే మరింత బెటర్ గా ఉండేదేమో అనిపిస్తుంది. ఆ అంశాల తగ్గడం వలన ఈ కంటెంట్ ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.