Droupadi Murmu: ఎంజీఎన్ఆర్ఈజీఏ శకం సమాప్తం.. 'వీబీ-జీ రామ్ జీ'కి రాష్ట్రపతి ఆమోదముద్ర

Droupadi Murmu Approves VB G RAM Ji Ending MGNREGA Era
  • ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త చట్టం
  • రాష్ట్రపతి ఆమోదంతో అమల్లోకి వీబీ-జీ రామ్ జీ బిల్లు
  • గ్రామీణ ఉపాధి పనిదినాలు 100 నుంచి 125కి పెంపు
  • ఇకపై నిధుల భారం కేంద్రం, రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో
  • మహాత్మా గాంధీ పేరు తొలగింపుపై విపక్షాల తీవ్ర ఆగ్రహం
  • రాష్ట్రాలపై భారం మోపడానికే ఈ చట్టమంటూ కాంగ్రెస్ విమర్శ
దేశ గ్రామీణ ఉపాధి వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో తీసుకొచ్చిన 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు-2025'కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఆమోదముద్ర వేశారు. 

'వీబీ-జీ రామ్ జీ'గా పిలిచే ఈ బిల్లు, రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త చట్టం ప్రకారం గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి కల్పించే కనీస పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచారు.

కొత్త చట్టంలో కీలక మార్పులు ఇవే..

'వీబీ-జీ రామ్ జీ' చట్టం కింద గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం అవసరం లేని పనులకు ముందుకువచ్చే ప్రతి కుటుంబానికి సంవత్సరంలో కనీసం 125 రోజుల ఉపాధి కల్పన హామీ ఉంటుంది.  ఈ చట్టంలో నిధుల కేటాయింపు విధానంలో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉపాధి హామీ కూలీల వేతనాల భారాన్ని పూర్తిగా కేంద్రమే భరించేది. కానీ కొత్త చట్టం ప్రకారం ఇది కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో నడిచే పథకంగా మారింది. 

సాధారణ రాష్ట్రాల్లో కేంద్రం 60 శాతం నిధులు భరిస్తే, రాష్ట్రాలు 40 శాతం వాటా భరించాల్సి ఉంటుంది. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు ఇది 90:10 నిష్పత్తిలో ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 100 శాతం నిధులను కేంద్రమే సమకూరుస్తుంది. వ్యవసాయ పనులకు కూలీల కొరత లేకుండా ఉండేందుకు, నాట్లు, కోతల సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు 60 రోజుల వరకు పనులను తాత్కాలికంగా నిలిపివేసే వెసులుబాటును కూడా కల్పించారు.

విపక్షాల తీవ్ర వ్యతిరేకత

ఈ బిల్లును పార్లమెంటులో డిసెంబర్ 18న విపక్షాల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఇది ఒక నిరంకుశ చట్టం అని, గ్రామీణ పేదలకు అండగా నిలిచిన యూపీఏ హయాంలోని పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించాయి. 

చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధుల భారాన్ని రాష్ట్రాలపై మోపి, ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా ఈ చట్టం పేదల హక్కులను కాలరాస్తుందని, అధికారాలను కేంద్రీకృతం చేస్తుందని ఆరోపించారు.

ప్రభుత్వ వాదన ఏంటి?

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మార్పులను సమర్థించారు. 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాలకు అనుగుణంగా, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల కల్పన, పారదర్శకత పెంచేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. బయోమెట్రిక్ హాజరు, జియో-ట్యాగింగ్ వంటి సాంకేతికతతో పర్యవేక్షణ కట్టుదిట్టం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొంది.
Droupadi Murmu
MGNREGA
Vikshit Bharat Guarantee
Rural Employment
NREGA
Sonia Gandhi
Mallikarjun Kharge
Shivraj Singh Chouhan
Rural Development
Job Scheme

More Telugu News