Ganta Jishnu Aryan: గంటా శ్రీనివాసరావు మనవడి ఘనత.. 8 ఏళ్లకే గిన్నిస్ వరల్డ్ రికార్డు!

Ganta Jishnu Aryan Achieves Guinness World Record at 8
  • గంటా జిష్ణు ఆర్యన్ అరుదైన ఘనత
  • నిమిషంలో 216 గోల్డెన్ రేషియో దశాంశాలు చెప్పి రికార్డు
  • మనవడి ప్రతిభపై గర్వంగా ఉందన్న గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మనవడు, 8 ఏళ్ల గంటా జిష్ణు ఆర్యన్‌ తన అసాధారణ ప్రతిభతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జిష్ణు ఈ రికార్డు నెలకొల్పాడు.

కేవలం నిమిషం వ్యవధిలో 216 దశాంశాల (డెసిమల్స్‌) స్వర్ణ నిష్పత్తిని (గోల్డెన్‌ రేషియో) అనర్గళంగా చెప్పి జిష్ణు ఆర్యన్ అందరినీ అబ్బురపరిచాడు. ఇంత చిన్న వయసులో క్లిష్టమైన గణిత నిష్పత్తిని గుర్తుంచుకుని చెప్పడం ద్వారా ఈ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జిష్ణు ఆర్యన్‌ తండ్రి రవితేజ, గంటా శ్రీనివాసరావు కుమారుడు కాగా.. తల్లి శరణి, మంత్రి పొంగూరి నారాయణ కుమార్తె. రవితేజ, శరణి దంపతులు ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు తన ఆనందాన్ని పంచుకున్నారు. "నా మనవడు గంటా జిష్ణు ఆర్యన్ 60 సెకన్లలో 216 దశాంశాల గోల్డెన్ రేషియో చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సాధించడం గర్వంగా ఉంది. 8 ఏళ్ల పిన్న వయసులో అంతటి ఏకాగ్రత, గ్రహణశక్తి ప్రదర్శించిన ఆర్యన్‌కు, లక్ష్యం దిశగా ఈ చిన్నారిని నడిపించిన తల్లిదండ్రులు రవితేజ, శరణిలకు అభినందనలు" అని ఆయన తెలిపారు.
Ganta Jishnu Aryan
Ganta Srinivasa Rao
Guinness World Record
Golden Ratio
Decimal Calculation
Hyderabad
Ponguru Narayana
Mathematics
Visakhapatnam
Raviteja

More Telugu News