Aditi Gajapathi Raju: భోగాపురం వద్ద ఏవియేషన్ హబ్.. రూ. 1000 కోట్ల విలువైన భూమినిచ్చిన అదితి గజపతిరాజు

Aditi Gajapathi Raju MANSAS Trust Donates Land for Aviation EduCity
  • ఏవియేషన్ ఎడ్యుసిటీ కోసం మాన్సాస్ ట్రస్ట్ భారీ విరాళం
  • రూ.1000 కోట్ల విలువైన 136.63 ఎకరాల భూమి అప్పగింత
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్ సమీపంలో ప్రాజెక్ట్ నిర్మాణం
  • మంత్రి లోకేశ్ సంకల్పానికి పూసపాటి వంశీయుల మద్దతు
  • ప్రాజెక్టుకు అలక్ మహారాజా గజపతి పేరు పెట్టాలని విజ్ఞప్తి
ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసే విజయనగరం పూసపాటి రాజవంశం మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. రాష్ట్రంలో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు కోసం సుమారు రూ.1000 కోట్ల విలువైన భూమిని విరాళంగా ఇచ్చి భావితరాల భవిష్యత్తుకు బాటలు వేసింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.

విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అన్నవరం వద్ద మాన్సాస్ ట్రస్టుకు చెందిన 136.63 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టుకు కేటాయించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు పూర్తికావస్తున్న నేపథ్యంలో, పౌర విమానయాన రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రపంచస్థాయి ఏవియేషన్ యూనివర్సిటీల బ్రాంచులను ఇక్కడ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ బృహత్కార్యానికి మాన్సాస్ ట్రస్ట్ తరఫున విజయనగరం ఎమ్మెల్యే, పూసపాటి అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు ముందుకు వచ్చారు.

ఈ ప్రాజెక్టుకు తమ వంశీయుడైన అలక్ మహారాజా గజపతి పేరు పెట్టాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామి అయ్యేందుకు జీఎంఆర్‌ సంస్థ ముందుకొచ్చింది. పూసపాటి రాజవంశానికి పౌర విమానయానంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అప్పట్లోనే వారికి సొంత విమానాలు, విమానాశ్రయాలు ఉండేవని చెబుతారు. అశోక్ గజపతిరాజు కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు.

ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ "ప్రతి ఒక్కరూ చదవాలనే ఆకాంక్షతో మా తాతగారు ఎన్నో విద్యాసంస్థలను స్థాపించారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో ఏవియేషన్ ఎడ్యుసిటీకి భూములు ఇస్తున్నాం. మా పూర్వీకుల పేరుతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కావడం ఆనందంగా ఉంది" అని తెలిపారు.

ఇటీవల విశాఖలో ఈ ఒప్పందం జరగ్గా, భూముల కేటాయింపునకు దేవదాయశాఖ అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఎంఆర్‌, మాన్సాస్‌ భాగస్వామ్యంతో ఏవియేషన్‌ ఎడ్యుసిటీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
Aditi Gajapathi Raju
Bhogapuram Airport
Aviation Hub
Vizianagaram
MANSAS Trust
GMR Group
Andhra Pradesh
Nara Lokesh
Aviation Education

More Telugu News