Hidma: హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం: మావోయిస్టుల సంచలన లేఖ

Maoists Allege Conspiracy in Hidma Death
  • హిడ్మాది పక్కా హత్య అని మావోయిస్టుల లేఖ
  • దేవ్ జీ సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేసిన పార్టీ
  • విజయవాడ వ్యాపారుల వల్లే హిడ్మా హత్య జరిగిందని వెల్లడి
మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతిపై ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్‌జడ్‌సీ) సంచలన విషయాలు వెల్లడించింది. కమిటీ కార్యదర్శి వికల్ప్ పేరుతో విడుదల చేసిన ఓ లేఖలో, హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదని, అది పక్కా ప్రణాళికతో చేసిన హత్యేనని ఆరోపించింది. హిడ్మా ఆచూకీని దేవ్ జీ పోలీసులకు చెప్పారన్న వార్తలను పార్టీ తీవ్రంగా ఖండించింది.

"దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి మాతోనే ఉన్నారు. వారు లొంగిపోయేందుకు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. హిడ్మా సమాచారాన్ని దేవ్ జీ పోలీసులకు చెప్పారనేది పూర్తిగా అవాస్తవం" అని లేఖలో స్పష్టం చేశారు. హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులు కారణమని, వారిలో అడవి నుంచి బయటకు వచ్చిన కోసాల్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి అని పేర్కొన్నారు. అతనితో పాటు విజయవాడకు చెందిన ఓ కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ ఉన్నారని ఆరోపించారు.

చికిత్స నిమిత్తం అక్టోబర్ 27న హిడ్మా సదరు కలప వ్యాపారి ద్వారా విజయవాడకు వెళ్లాడని, ఈ సమాచారం పోలీసులకు చేరడంతోనే హిడ్మాతో సహా 13 మందిని పట్టుకుని హత్య చేశారని మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈ హత్యలను కప్పిపుచ్చుకునేందుకే మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్ జరిగినట్టు కట్టుకథ అల్లారని ఆరోపించింది. ఇది కేవలం ఏపీ పోలీసుల ఆపరేషన్ కాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అని లేఖలో పేర్కొంది. వారి ఆశయాలను ముందుకు తీసుకెళతామని శపథం చేస్తున్నట్లు మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది.
Hidma
Maoist Hidma
Hidma death
Dandakaranya Special Zonal Committee
Maoist letter
Naxalites
Andhra Pradesh police
Kosal
Vijayawada
Maredumilli

More Telugu News